Monday, April 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమ్మా... ఆకలేస్తోంది!

అమ్మా… ఆకలేస్తోంది!

- Advertisement -

”అమ్మా…. ఆకలేస్తోందమ్మా…”
”ఇదిగో నాన్నా… ఈ రొట్టె ముక్క తిను.”
”ఇది సరిపోదు కదమ్మా..! అమ్మా నువ్వు కూడా ఏం తినలేదుగా… రా అమ్మా.. ఇద్దరం కలిసి తిందాం.”
(వెంటనే తల్లి ఆ చిన్నపిల్లవాడిని బరువెక్కిన గుండెతో హత్తుకొని కన్నీళ్లు పెట్టుకొంది)
”నాన్నా… ఇంట్లో సరుకులు లేవు. మీ నాన్నకు బిపి బిళ్ల లేదు. తాతకు గుండెపోటు తగ్గే మందులు లేవు. ఏం చేద్దాం నాన్నా.. ఉన్నదే సర్దుకొని తినాలి.”
”అమ్మా… మన సందు చివర క్లినిక్‌ ఉంది కదా? పదమ్మా… వెళ్లి మందులు తెద్దాం.”
”లేదు నాన్నా… మనకు మందులు రాకుండా అడ్డుకున్నారు.”
”ఎవరమ్మా వాళ్లు…”
”ఓ విలన్‌ తాత ఉన్నాడు నాన్నా… అతడే ఇదంతా చేస్తున్నాడు.”
”పదమ్మా… మనం ఆ తాత దగ్గరకు వెళ్లి సర్ది చెబుదాం. కావాలంటే నా డిబ్బీలో డబ్బులు, బొమ్మలు కూడా ఆ తాతకిచ్చేస్తాను.”
”నీకున్న మంచి మనసు ఆ తాతకు లేదు నాన్నా…”
(అంటూ .. ఆ తల్లి తన బిడ్డను మరింత గట్టిగా పొదువుకొంది.)
ఈ చిన్న సన్నివేశం ఎంతో హృదయ విదారకంగా ఉంది కదూ!
ఇప్పుడు క్యూబా దేశంలో ప్రతి ఇంట్లో ప్రతి తల్లి పరిస్థితి ఇంతకంటే అధ్వానంగా ఉంది. ఆ తల్లుల ఆవేదనా స్వరం ఎవరికి వినిపిస్తోంది!
సోషలిస్టు దేశమైన క్యూబాపై కొన్ని దశాబ్దాలుగా అమెరికా అమానవీయ ఆంక్షలు విధిస్తోంది. ఇప్పుడు ట్రంప్‌ మరింత పట్టు బిగించి ఆ దేశాన్ని అంధకారంలోకి నెట్టాడు. అమెరికా సామ్రాజ్యవాదానికి తలవంచకుండా స్వాభిమానంతో తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ వచ్చిన క్యూబా… అమెరికా కఠినతర ఆంక్షలతో చీకట్లో మునిగింది. నెలల తరబడి ఆయిల్‌ లేదు. పెట్రోల్‌ లేక బస్సు సర్వీసులు లేవు. ప్రస్తుతం క్యూబాలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, ఆహార కొరత, విద్యుత్‌ కోతల కారణంగా దైనందిన జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు దొరకడం లేదు. వ్యాధులకు వాడే మందులు దొరకడం లేదు. సరైన ఔషధాలు, పరికరాలు, ఇంజక్షన్లు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి.
బిడ్డలకు తిండి, వైద్యం సమకూర్చలేక క్యూబా తల్లులు తల్లడిల్లుతున్నారు.
పొద్దెక్కుతుంటే భయం..! చీకటి ముసురుకుంటుంది. కరెంటు లేదు. కడుపు నిండా తిండి లేదు. కారు చీకట్లో కదలకుండా మళ్లీ సూర్యుడి వెలుతురు కోసం ప్రాణం బిగబట్టుకొని బతుకుతున్నారు క్యూబా ప్రజలు. విద్యుత్‌ సదుపాయం లేక, సరైన వైద్య ఔషధాలు, పరికరాలు, ఇంజక్షన్లు లేక ఆసుపత్రుల్లో వైద్య సేవలు ఆగిపోయాయి. అక్కడి గర్భవతులకు ప్రసవం చేసేందుకు డాక్టర్లు పడుతున్న పాట్లు ఇన్నీ అన్నీ కావు. శిశువులకు అందాల్సిన వైద్యం అందక శిశు మరణాల రేటు పెరిగిపోతోంది.
కోవిడ్‌ ఆపత్కాలంలో ప్రపంచానికి ఊపిరాడనప్పుడు క్యూబా శాస్త్రవేత్తలు 5 వ్యాక్సిన్లు కనుగొన్నారు. ఎందరో క్యూబా తల్లులు తమ బిడ్డలైన డాక్టర్లను ప్రాణాలకు తెగించి దేశాలకు పంపారు. కోవిడ్‌ రోగులకు ప్రపంచవ్యాప్తంగా వారు వైద్య సేవలు అందించారు. ఇప్పుడు క్యూబాకు ఊపిరాడని స్థితిని అమెరికా అమానవీయ దిగ్బంధనం కలిగిస్తోంది. ఇప్పుడు ఆ చిన్ని క్యూబాకు ప్రపంచ ప్రజల సహాయం చాలా అవసరం.

ఎస్‌.ఉమామహేశ్వరి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -