Friday, October 24, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిడబ్బులు చెట్లకు కాయట్లేదండీ!

డబ్బులు చెట్లకు కాయట్లేదండీ!

- Advertisement -

(తెల్లటి, పొడవాటి గడ్డంతో వశిష్టుల వారిలా ఉండే బాబాయి జింక చర్మంపై పద్మాసనం వేసుకుని ఉన్నాడు అచ్చం రుషిలాగానే)

బాబాయి : గుండు బాబ్జీగారి ప్రేరణతో… జంబూ ద్వీపంలోని ఒకానొక దేశంలో పార్లమెంటును ప్రయివేటీకరించారు. నీకు గడ్డం ఉందా? లేదా? అనే దాంతో సంబంధం లేకుండా మొత్తం 543 లోక్‌సభ, రాజ్యసభలోని 250 సీట్లు అన్నిటికీ వంద కోట్ల రూపాయలు డిపాజిట్‌ కట్టాలి. కట్టినవారికి వేలంపాటలో పాల్గొనే హక్కు వస్తుంది. సామాన్యులెవరూ ఆ పని చేయలేరు. ‘దమ్ము’న్నోళ్లే ఆ పని చేయగలరు. ఆ ‘దమ్ము’ ఎక్కడ్నించి? ఎలా? వస్తుందనేది ఇక్కడ అప్రస్తుతం! పైగా ఇది ఐదేండ్ల కోసమే సుమా! వారికి అవసరమైతే ఖండాంతరాల్నుండి చూడగల హిండెన్‌బర్గ్‌ డేగ కండ్లను కూడా కప్పగల శక్తిమంతులై ఉండాలి.

ఆ సందర్భంలో దేశంలో టెంపరవరీగా వచ్చే విమర్శలను తట్టుకోగల దళసరి చర్మం ఉండాలి. ‘తోలు మందం’గాళ్లనే పార్లమెంటరీ భాషను నేనిక్కడ వాడదల్చుకోలేదు. ఆ రకంగా చర్మం లావెక్కాలంటే కొన్ని అద్భుతమైన క్రీములుంటాయి. ఆ క్రీము వొళ్ళంతా పూసుకుని, దేవతా వస్త్రాలు ధరించి, నెమళ్లను మేపు కుంటూ తెల్లవారి 5 గంటల నుండి 8 గంటల వరకు నులివెచ్చని ఎండలో తోటలో పచార్లు చేయాలి. కొంతకాలానికి చర్మం దళసరిగా మారుతుందని సదరు కంపెనీ యాడ్‌! ఆ కంపెనీ ఏ రాష్ట్రంలోదో నాకైతే తెలీదురా! పైగా అది అసందర్భం కూడా!
అబ్బాయి : (ఇంత ఉపన్యాసం విన్న తర్వాత అబ్బాయి గారికి ఓ చిన్న ధర్మసందేహం వచ్చింది) లింకన్‌ మహాశయుడు చెప్పిన ‘ఆఫ్‌ ది పీపుల్‌, ఫర్‌ ది పీపుల్‌, బై ది పీపుల్‌’ పార్లమెంటు భవనంపై అంత పెద్ద పెద్ద అక్షరాల్లో చెక్కించారు గదా! దేశంలో ఇన్ని భాషలుండగా ఆ ఎంగిలిపీచే ఎందుకు బాబాయి? అన్నాడు వెటకారంగా.

బాబాయి : అన్ని భాషల పేర్లూ రాయాలంటే సైబర్‌ టవర్స్‌లో కంపెనీల లిస్టు పెట్టినట్టుండదా! అందుకే పెట్టలేదురా మోడర్న్‌ మయసభ నిర్మాత! అసలు విషయం ఆ విధంగా దాటవేశాడు. అసలు సంగతేమంటే సామ్రాట్టు.. తూర్పుకి తిరిగి.. ఎటుపోయినా, ఎన్ని వేల మీటర్ల ఎత్తున ఆయన పుష్పకం ఎగురుతున్నా.. రత్నగర్భలో ప్రజాస్వామ్యం వర్థిల్లుతోందని.. దానికి అమెరికన్‌ ప్రజాస్వామ్య పితామహుడే కారణమని సామ్రాట్టుకు అర్థం కావాలంటే ఇంగ్లీషే దిక్కని తెలిసే ఆ బోర్డు పెట్టించాడు. పైగా, గతంలో అటు టెక్సాస్‌లో భారతీయులను కదిలించడానికీ, ఇటు అహ్మదాబాద్‌కు గుజ్జూల దిగుమతికీ లక్షల కోట్ల డాలర్ల ఖర్చుచేసినా వ్రతమూ చెడింది, ఫలితమూ దక్కలేదు ఆనాడు.
అబ్బాయి : ఆ పద్దును 130 కోట్ల మంది ఖాతాలో వేశారో, వారి పార్టీ ఖాతాలోకి వేశారో ఆ భగవంతుడికైనా తెలుసా బాబాయి!

బాబాయి : సర్వజ్ఞుడైన భగవంతుడికి ఏ విషయం తెలీకుండా ఉండదు. 56 అంగుళాల ఛాతీ నిండా ఇలాంటి ఎన్నో విషయాలు నిగూఢంగా నిక్షిప్తమై ఉంటాయి.
అబ్బాయి : ప్రతి కంపెనీ ప్రయివేటీకరణకూ తలా తోకలేని కారణం ఏదో ఒకటి చెప్తారు కదా! ఏకంగా పార్లమెంటునే ప్రయివేటీకరించి దీనికి ఏమి సాకులు చెప్తున్నారు?

బాబాయి : సాకులేంట్రా పిల్లకాకీ? దేని కారణాలు దానికుంటాయి కదా! సాలుకు కొన్ని వేల కోట్ల రూపాయల ఆదా అవుతుంది తెలుసా? అదెలాగని కదా నీ సందేహం!? అక్కడికే వస్తున్నారా అబ్బాయి! 543 లోక్‌సభ సభ్యులకి ఒకరికి వందకోట్ల చొప్పున రాజ్యసభ సభ్యులు 250 మందికి మనిషికి వంద కోట్ల డిపాజిట్‌ చొప్పున లెక్కేయి. దీనిపైన వేలంపాటలో వచ్చేది ఎన్ని లక్షల కోట్లో తెలీదు. ఇదంతా ప్రభుత్వానికి ఆదాయం కాదా?! మన పార్లమెంటు సభ్యులు పడుతున్న ఈతి బాధలు చూడలేక, తిండికి వాచిపోతున్న వారి కుటుంబ సభ్యుల గోస చూసి తట్టుకోలేక ఘనత వహించిన మన ప్రభుత్వ పెద్దలు వారి నెలవారీ వేతనాన్ని మొన్ననే మార్చి 2025న ఒక లక్షా ఇరవై నాలుగు వేలకి పెంచారు తెలుసా? ‘అబ్బా’ అంటూ నోరెళ్లబెట్టవాకు అప్పుడే! దీనికి అదనంగా నెలకు రూ.87వేలు నియోజకవర్గ అలవెన్స్‌ ఇస్తారు.
అబ్బాయి : అదెందుకు బాబాయి?

బాబాయి : నియోజకవర్గంలో కార్యాలయాల నిర్వహణకు, తన ఓటర్లకు చేసిన వాగ్దానాల అమలుకు పడే కష్టాలు కడతేర్చడానికీ!
అబ్బాయి : ఓసంతేనా?!
బాబాయి : నెలకి రూ.75 వేలు ఆఫీసుల్లో స్టాఫ్‌ కోసం, కంప్యూటర్లు గట్రా కొనుగోలు కోసం ఇస్తారు. (అబ్బాయి నోరు తెరిచాడు) సమావేశానికి హాజరైనందుకు రోజుకు రూ.2600/- బత్తా ఇస్తారు (అబ్బాయి స్పృహ తప్పి పడిపోయాడు) (వాడి మొహాన నీళ్లు చల్లి లేపి కూచోబెట్టాడు) ఒరేరు! ఇవన్నీ చెప్పిందెందుకంటే ఇవన్నీ ఆపేస్తారని చెప్పడానికేరా!
అబ్బాయి ఇపుడు మళ్లీ మూర్చబోయాడు
బాబాయి : (వాడి చేతుల్లో పెద్ద తాళం చెవుల గుత్తి పెట్టి మెల్లిగా లేవదీశాడు) నా ప్రధాన వాదనంతా ఇదే కదరా అబ్బారు! ఇంత డబ్బు ప్రభుత్వం దగ్గిర మిగుల్తుంది. దాన్ని వాళ్లేమీ భోం చేయరు కదా! మిగిలే అన్ని వేల కోట్లుపెట్టి రోడ్లేయిస్తారు. ఆ రోడ్డు పక్కన చెట్లు నాటిస్తారు. ఓవర్‌ బ్రిడ్జీలు, ఫ్లైఓవర్లు కట్టిస్తారు. అందుకే ఈ ప్రయివేటీకరణ నిర్ణయం సాక్షాత్తూ బృహస్పతే చేసి మన ‘వాచస్పతి’ నోట పలికించిన విషయం ముందు నువ్వు అర్థం చేసుకోవాలి!

మన పార్లమెంటు సభ్యులకు సాలకు 50 వేల యూనిట్ల ఫ్రీ కరెంటు, ఏటా ‘ఫ్రీ’గా ఇచ్చే నాలుగు వేల కిలో లీటర్ల మంచినీరు, పుక్కట్లో ఇచ్చే డొమెస్టిక్‌ విమాన చార్జీలు, మొదటి తరగతి రైలు ప్రయాణం వంటివి యథాతథంగా ఉంటాయి. ఏమైనా పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు సభ్యుడేగా!? ఇవి మినహా మిగతావన్నీ గవర్నమెంటుకి మిగులే!
ఐదేండ్లలో ఎన్ని వేల, లక్షల కోట్ల రూ||లు ఆదా అవుతుందో ఎపుడైనా ఆలోచించావా నీ మట్టి బుర్రతో? ప్రపంచ బ్యాంకుకు మనం ఎదురిస్తాం అప్పు. ఇవన్నీ డైరెక్ట్‌ ఉపయోగాలు! నీ చదువేంటని ప్రతిపక్ష నాయకుడు అడగాల్సిన అవసరం ఉండదు. మీ నానమ్మ ఇలా, మీ ముత్తాత అలా చేశాడనే తిట్ల పురాణాలుండవు. ఈవీఎంలు టాంపరింగ్‌ చేశారనే ఆరోపణలుండవ్‌. ఎందుకంటే అసలు ఈవీఎంలే ఉండవు కాబట్టి! దొంగఓట్లు చేర్పించడాలు, ‘ఓట్‌ చోర్‌’ ఆరోపణలూ ఉండవు.

అంతా ప్రశాంతంగా ‘బిజినెస్‌’ లైక్‌గా జరిగిపోతూంటుంది. డార్విన్‌ ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది ఫిట్టెస్ట్‌’ అంటే నేడు ‘సర్వైవల్‌ ఆఫ్‌ ది రిచ్చెస్ట్‌’ సూత్రం ఉనికిలోకి వస్తుంది. ‘ఫిట్టెస్ట్‌’ కాని జాతి డైనోజార్లలా అంతరించి పోతుందని డార్విన్‌ చెప్పినట్టే, పేదలు కూడా అంతరించిపోతారు. ఇక వారి అవసరం ఐదేండ్లకే గాక, ఎప్పటికీ లేదు గనుక ‘ఫ్రీబీస్‌’ ప్రకటించాల్సిన అగత్యం ఎవ్వరికీ లేదు. రాదు కూడా. దొంగ ఓటర్లూ ఉండరు. కనుక దొంగ ఓట్లేసే పద్ధతి, బూత్‌ కాప్చరింగ్‌లుండవు. పోలింగు లేదు కనుక పోలింగ్‌ ఖర్చు ప్రభుత్వానికి తగ్గిపోతుంది. సీఎంఎస్‌ అధ్యయనం ప్రకారం 2024లో మన దేశ లోక్‌సభ ఎన్నికల ఖర్చు ఒక లక్షా ముప్పయిదు వేల కోట్ల రూ||లు. ఇదిగాక పాపం! రాజకీయ పార్టీలకు తడిసి మోపెడు ఖర్చు. ఇవన్నీ మిగుల్తాయి. ఇంత డబ్బు మిగిల్తే పార్టీలు మాత్రం ఏం చేస్తాయి? జనానికి పంచరా?

అబ్బాయి : ఓహ్‌! దీని వెనుక ఇంతుందా బాబాయి?! అంటూ నోరు తెరిచాడు.
బాబాయి : ఇంకా ఉంది… నాకు టైం లేదు! అహ్మదాబాద్‌లో మీటింగు ఉంది… తర్వాత చెప్తారా అబ్బాయి దాన్ని!
తాను కూచున్న జింక చర్మాన్ని చాపలా చుట్టి చంకలో పెట్టుకుని పరుగులాంటి నడక సాగించాడు బాబాయి.

ఇట్లు
మీ.. నారదరావ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -