Monday, September 8, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుపైసలకు కటకట…

పైసలకు కటకట…

- Advertisement -

కేంద్రం నుంచి నిధులు రావు..ఇక్కడ ఆదాయం పెరగదు
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం
అటకెక్కిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా
ఈ దసరా నుంచి బతుకమ్మ చీరెలు కొందరికే
సర్పంచులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.400 కోట్లు
పంచాయతీ కార్యదర్శులకు పెండింగ్‌ బిల్లులు రూ.70 కోట్లు
గట్టెక్కించే మార్గాల అన్వేషణలో సర్కారు

బి.వి.యన్‌.పద్మరాజు
రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యింది. గతం నుంచి వెంటాడుతున్న ఆర్థిక కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. రోజువారీ ఖర్చులు, చెల్లింపులకు కూడా కటకట మొదలైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై చూపిస్తున్న ఆర్థిక వివక్షే దీనికి ప్రధాన కారణం.ప్రత్యామ్నాయ వనరులు, ఆదాయ మార్గాలను అన్వేషించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కూడా కనిపిస్తోంది. అనివార్యంగా ఇది ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఇతర సహాయాల రూపంలో రాష్ట్రానికి రూ.22,782 కోట్లు వస్తాయని రేవంత్‌ సర్కారు అంచనా వేసింది. కానీ జులై చివరి నాటికి కేవలం రూ.790 కోట్లే వచ్చాయి. ఇప్పుడు ఆగస్టు కూడా ముగిసింది. అంటే బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఐదు నెలలు పూర్తయ్యాయన్నమాట. మిగతా రూ.21,992 కోట్లు ఎప్పటిలోగా వస్తాయనేది పెద్ద సందేహమే. మరోవైపు 2025-26 బడ్జెట్‌లో రెవెన్యూ రశీదుల ద్వారా మొత్తం రూ.2,29,720 కోట్ల ఆదాయం వస్తుందంటూ సర్కార్‌ అంచనా వేసుకుంది. కానీ ఈ ఏడాది జులై నాటికి కేవలం రూ.50,270 కోట్లే ఖజానాకు చేరాయి. గతేడాది (2024-25)తో పోలిస్తే ఇందులో కొంత శాతం (.30 శాతం) రాబడి పెరిగినప్పటికీ మొత్తంగా వేసుకున్న అంచనాల్లో తగ్గింది. పన్నేతర ఆదాయం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.31,681 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తే, అందులో జులై నాటికి కేవలం రూ.1,334 కోట్ల ఆదాయమే వచ్చింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఆర్నెల్లు పూర్తయిన నేపథ్యంలో మిగతా ఆర్నెల్లలో మిగిలిన రూ.30,284 కోట్లు ఎలా సమకూరుతుందనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడం వల్లే పలు కీలక పథకాలు, కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయలేకపోతున్నామని ఆర్థికశాఖ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ తమకు అత్యంత ప్రతిష్టాత్మకమైన పథకమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని అర్హులైన వ్యవసాయ కూలీలందరికీ ఏడాదికి రూ.12 వేల చొప్పున అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల మంది లబ్దిదారులను గుర్తించారు. కానీ వీరిలో ఇప్పటి వరకూ రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పూర్తిగా, మిగతా జిల్లాల్లో ఒక్కో మండలంలో ఒక్కో గ్రామాన్ని గుర్తించి, అక్కడి కూలీలకు మాత్రమే ఆర్థిక సాయాన్ని అందించారు. ఆ రకంగా చూస్తే కేవలం 88 వేల మందికి రూ.51 కోట్లను మాత్రమే పంపిణీ చేశారు. మిగతా వ్యవసాయ కార్మికులు ఈ సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను చేపట్టిన సర్పంచులు, అందుకోసం దాదాపు రూ.400 కోట్లను ఖర్చు చేశారు. వారిప్పుడు ఆ పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలంటూ సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. సర్పంచుల పదవీకాలం పూర్తయిన తర్వాత ఏడాదిన్నరగా పంచాయతీల్లో కార్యదర్శులే వివిధ పనులను చేపడుతున్నారు. వీధి లైట్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, హరితహారం కింద పెంచిన మొక్కలకు నీటిని పోయటం, ట్రాక్టర్ల నిర్వహణ వగైరా పనులను వారు చేపట్టారు. ఇందుకోసం మొదట తమ సొంత డబ్బును ఖర్చు పెట్టి, ఆ తర్వాత బిల్లులు క్లెయిమ్‌ చేసుకోవాలంటూ ప్రభుత్వం వారిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారికి సర్కారు ఇప్పటి వరకూ రూ.70 కోట్లను చెల్లించాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలోని 60 లక్షల మంది ఆడపడుచులకు ఏటా దసరాకు బతుకమ్మ చీరెలను ప్రభుత్వం సరఫరా చేసేది. ఇందుకోసం రూ.312 కోట్లను వెచ్చించామని ఆర్థికశాఖ తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అంత మొత్తంలో నిధులను వెచ్చించలేక, ఈ ఏడాది కేవలం మహిళా పొదుపు సంఘాల్లోని వారికే చీరెలను పంపిణీ చేస్తామని ప్రకటించింది. అంటే మిగతా వారికి చీరెలను ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు అన్వేషణను ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆర్థికశాఖకు సుదీర్ఘకాలం పాటు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉండి, ఆ తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందిన కే.రామకృష్ణారావును దీనిపై ప్రధానంగా దృష్టి సారించాలంటూ వారు కోరారు. అందుకే ఆగస్టుతో పూర్తయిన ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలంటూ డీవోపీటీకి సర్కారు లేఖ రాసింది. ఇప్పుడాయన పదవీకాలాన్ని డీవోపీటీ మరో ఏడు నెలలపాటు పొడిగించింది. 2026 మార్చి వరకు, ఇంకా చెప్పాలంటే వచ్చే బడ్జెట్‌ నాటి వరకూ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్న ఆయన… రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక కష్టాల నుంచి ఏ రకంగా గట్టెక్కిస్తారో వేచి చూడాలి.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad