అంబర్‌పేట కేసు ఛేదన
అధిక వడ్డీ వసూలు, వేధింపులు..
నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-అంబర్‌పేట
హైదరాబాద్ అంబర్‌పేట బాపునగర్‌లో ఒకే ఇంట్లో ఇటీవల ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న కేసులో నలుగురు అక్రమ వడ్డీ వ్యాపారులను పోలీసుల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దీనికి సంబంధించి సికింద్రాబాద్ జోన్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో డీసీపీ రక్షిత కె.మూర్తి వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరి 24న హోటల్ వ్యాపారి కడిగేకర్ రామ్‌రాజ్, ఆయన భార్య మాధవి, కుమారుడు శశాంక్ రాజ్ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. రామ్‌రాజ్ మల్లాపూర్‌లో ‘కింగ్స్ బిర్యానీ’ హోటల్ నిర్వహించేవాడు. అతను హోటల్ వ్యాపార అవసరాల కోసం జవహర్‌నగర్ మౌలాలికి చెందిన రియల్ ఎస్టేట్, స్క్రాప్ వ్యాపారి మహమ్మద్ వాసి ఉజ్ జమాన్ అలియాస్ ఇర్ఫాన్, మౌలాలి వెంకటేశ్వర నగర్‌కు చెందిన పి.రాజశేఖర్ రెడ్డి, ఓల్డ్ సఫిల్‌గూడ సుధానగర్‌కు చెందిన మహమ్మద్ నవాజ్, మౌలాలి సాదుల్లానగర్‌కు చెందిన సయ్యద్ మజీద్ హైదర్ వద్ద రూ.57 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు ఇచ్చిన వారు రోజువారీ వడ్డీ వసూలు చేస్తూ తీవ్ర వేధింపులకు గురిచేశారు. మితిమీరిన వడ్డీ డిమాండ్ చేశారు. వడ్డీ చెల్లించలేని పరిస్థితుల్లో ఖాళీ చెక్కులపై బలవంతంగా సంతకాలు చేయించుకోవ డంతోపాటు ప్రామిసరీ నోట్లు, భూమి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి వెళ్లి అవమానించడం, బెదిరించడం వంటివి చేశారు. ఈ వేధింపులు భరించలేక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఘటన స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్‌లో తమ మరణాలకు నలుగురే కారణమని, వారి పేర్లు, వారు పెట్టిన బాధలను రాశారు. వారు ఆత్మహత్య చేసుకున్న రోజు రాత్రి కూడా నిందితులు డబ్బు డిమాండ్ చేస్తూ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని బెదిరించినట్టు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. రామ్‌రాజ్ కుమార్తె అమూల్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కాల్ డాటా ఆధారంగా రికార్డ్స్ కూడా పరిశీలించి కేసును ఛేదించారు. నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించారు. అధిక వడ్డీకి డబ్బు అప్పుగా ఇచ్చినట్టు.. తిరిగి చెల్లింపు కోసం వారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు నిందితులు అంగీకరించారు. పూచీకత్తుగా ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, ఆస్తి పత్రాలను బలవంతంగా సేకరించినట్టు కూడా అంగీకరించారు. దీంతో నలుగురుపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి రామ్‌రాజ్ 12 ఖాళీ చెక్కులు, 6 ప్రామిసరి నోట్లు, ఒప్పంద పత్రాలు, యాదాద్రి భువనగిరి జిల్లా గాంధీ మాల్ గ్రామంలో ఉన్న మూడు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు, బాండ్ పేపర్లు, మృతుడి కుటుంబ సభ్యులను బెదిరించడానికి నిందితులు ఉపయోగించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, ఓయు ఏసీపీ జి.జగన్, అంబర్ పేట ఇన్‌స్పెక్టర్ టి.కిరణ్ కుమార్, డీఐ మహ్మద్ హఫీజుద్దీన్, ఎస్‌ఐలు సురేష్, తరుణ్ పాల్గొన్నారు.
కుటుంబం ఆత్మహత్యకు వడ్డీ వ్యాపారులే కారణం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



