Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంఆలయ భూమిలో 'ఏకశిల' నిర్మాణం

ఆలయ భూమిలో ‘ఏకశిల’ నిర్మాణం

- Advertisement -

నకిలీ డాక్యుమెంట్లతో అనుమతులు
– కేశవాపూర్‌లోనూ కబ్జాల ‘పులి’
– పట్టించుకోని హన్మకొండ ఉన్నతాధికారులు


నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
హన్మకొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున కంచరకుంట ఆలయ భూమిలో మ్యాక్స్‌కేర్‌ (ఏకశిల) ఆస్పత్రి యాజమాన్యం అక్రమంగా బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తోంది.. సదరు భూమి దేవుడి మాన్యంగా పేర్కొంటూ గతంలో పలుమార్లు కోర్టు తీర్పులు ఇచ్చినా.. కబ్జాదారు నకిలీ పత్రాలు సృష్టించి ఇతరులకు విక్రయించాడు. ఇప్పటికీ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. అయినా, అక్కడే ఆస్పత్రి యాజమాన్యం నిర్మాణం చేస్తోంది. దీన్ని జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ అధికారులు, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ అధికారులు అడ్డుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
కంచరకుంటలోని సర్వే నెంబర్‌ 1145లో 27 గుంటల భూమిలో శరాభలింగం (బాల రాజరాజేశ్వరస్వామి) దేవాలయం ఉంది. 11-12 శతాబ్దాలకు చెందిన కాకతీయుల నాటి ప్రాచీన దేవాలయం నగరం నడిబొడ్డున ఉండటంతో ఈ భూమి కబ్జాకు 1954లోనే బీజం పడింది. 1936 పహాణి రికార్డు ప్రకారం 1953 వరకు దేవాలయ మాన్యం భూమిగానే ఉంది. ఈ భూమిని అక్రమంగా కొత్తపెల్లి లక్ష్మీకాంతరావు తన పేరిట నమోదు చేసుకొని.. తర్వాత వారి కుమారులు కొత్తపెల్లి వాసుదేవరావు, కొత్తపెల్లి జయశంకర్‌, కొత్తపెల్లి ప్రసాద్‌రావుకు పంపకాలు చేసినట్టు దస్తావేజులు సృష్టించారు. దేవాలయ ప్రాంగణానికి రాత్రికి రాత్రే ప్రహారి నిర్మించారు. ”మిగతా భూమి మాది.. దేవాలయం కూడా మాదే.. మా పూర్వీకులు పూజలు చేసేవారు.. మేమే ఈ భూమిని దానం ఇచ్చాం” అని ప్రచారం చేసుకున్నారు. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపారు. ఈ భూకబ్జా కేసు ఎల్‌జిసి నెంబర్‌ 1/1997గా నమోదు కాగా, విచారణ అనంతరం వరంగల్‌ జిల్లా కోర్టు ఈ కేసును కొట్టేసి.. ఆ భూమి దేవుని మాన్యంగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. 1997, 2003, 2010, 2016లోనూ పలుమార్లు వారి దస్తావేజులు అక్రమమని, ఆ భూమిని కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్‌దేనని పలు తీర్పులు వచ్చాయి. అయినా కొత్తపెల్లి వాసుదేవరావు ఈ భూమిపై నకిలీ దస్తావేజులు సృష్టించి పలువురికి విక్రయించాడు. ఈ విషయాలు తెలిసినా మ్యాక్స్‌కేర్‌(ఏకశిల) ఆస్పత్రి యాజమాన్యం ఆ భూమిని కొనుగోలు చేసి అక్రమంగా రేకులతో ప్రహారి నిర్మించి కబ్జాకు పాల్పడింది.
నకిలీ డాక్యుమెంట్లతో అనుమతులు
కొత్తపెల్లి వాసుదేవరావు, కుందూరు కరుణాకర్‌రెడ్డి నకిలీ దస్తావేజులు సమర్పించి బహుళ అంతస్తుల నిర్మాణానికి అనుమతులు తీసుకున్నారు. నాటి కలెక్టర్లు ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, రాజీవ్‌గాంధీ హన్మంతు ఈ వివాదంపై ఆర్డీఓతో విచారణ చేసి ఈ భూమి దేవాలయ మాన్యంగా నిర్ధారించారు. డబ్యూపీ నెంబర్‌ 20914/2017 కేసు హైకోర్టులో పెండింగ్‌లో వుండగానే వరంగల్‌ గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు మ్యాక్స్‌కేర్‌ (ఏకశిల) ఆస్పత్రి యాజమాన్యానికి అనుమతినివ్వడం సందేహాలకు తావిస్తోంది.
తెర వెనుక గులాబీ నేతలు
సుమారు రూ.25 కోట్ల విలువైన ఈ భూమి కబ్జా వెనుక గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నేతలు కొందరు కీలక పాత్ర పోషించినట్టు ఆరోపణలున్నాయి. రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి భారీగా ముడుపులు పుచ్చుకొని కోర్టు తీర్పును నిర్వీర్యం చేసి మున్సిపాల్టీ నుంచి అనుమతులు ఇప్పించారన్న ప్రచారం వుంది. ఈ వివాదంపై లోకాయుక్తలో 2020 నుంచి కేసు నడుస్తోంది. జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ హాజరు కావాలని ఆదేశాలిచ్చినా లోకాయుక్త ఆదేశాలను భేఖాతర్‌ చేసి కిందిస్థాయి అధికారులను మాత్రమే పంపుతుండటం గమనార్హం.
కలెక్టరే పరిరక్షించాలి
చీకటి రాజు, కన్వీనర్‌, కాకతీయ వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ
హన్మకొండ కంచరకుంటలోని ఆలయ భూమిలో 20 గుంటల కబ్జాకు సంబంధించి కలెక్టరే పరిరక్షించాలని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చినా, కలెక్టర్లు పరిరక్షించలేదు. దీంతో ఏకశిల ఆస్పత్రి యాజమాన్యం నకిలీ దస్తావేజులను సృష్టించి ఆలయ భూమిలో 4 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తోంది. కాకతీయుల కాలం నాటి ప్రాచీన దేవాలయానికి వంద మీటర్ల దూరంలో ఎలాంటి కట్టడాలూ నిర్మించొద్దని జీవో వున్నా అధికారులు ఈ కబ్జాను అడ్డుకోలేకపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌ స్పందించి ఈ కబ్జాను నియంత్రించి ఆలయ భూమిని కాపాడాలి.
కేశవాపూర్‌లోనూ..
ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌లో సర్వేనెంబర్‌ 51ని 489గా మార్చి రిజిస్ట్రేషన్‌ చేసుకుని.. 600 గజాల ప్రభుత్వ భూమిలో పులి వెంకటేశ్వర్లు, క్రిష్ణ ఇల్లు నిర్మించుకొని ప్రహారిగోడను కట్టారు. మూడేండ్లుగా ఈ భూమి కబ్జాపై ఫిర్యాదులు చేస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడం గమనార్హం. కబ్జాదారులతో పంచాయతీ పెద్దలు సైతం కుమ్మక్కైనట్టు ఆరోపణలున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కేటాయించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసినా అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఎండి ఖాజా మొయినుద్దీన్‌ ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌కు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సదరు తహసీల్దార్‌ సర్వేయర్‌ను పంపినట్టు ఫిర్యాదుదారుకు సమాచారం ఇచ్చినా, సర్వేయర్‌ రాకపోవడం గమనార్హం. దీంతో కబ్జాదారు దర్జాగా 600 గజాల ప్రభుత్వ స్థలంలో ఇల్లు కట్టుకున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాపై మీరెందుకు ఫిర్యాదు చేస్తున్నారు? అని అధికారులు ప్రశ్నించడం పట్ల ఫిర్యాదు దారు ఎండి ఖాజా మొయినుద్దీన్‌, పౌల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ప్రజావాణిలో మరోమారు ఈ భూ కబ్జాపై ఫిర్యాదు చేశారు.

కలెక్టర్‌ జోక్యం చేసుకోవాలి
హన్మకొండ కంచరకుంట ఆలయం భూమి కబ్జా విషయంలో జిల్లా కలెక్టర్‌ జోక్యం చేసుకొని విచారణ జరిపించాలి. కోర్టు తీర్పును అమలు చేయాలి. ఆలయ భూమిని పరిరక్షించాలి. ఈ వివాదంలో దోషులను శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలి.
జి.ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కార్యదర్శి

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad