శంకరం మాష్టారు గత పాతికేళ్ళుగా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు టీచరుగా పని చేస్తున్నారు. ఆయనది కంచు కంఠం. క్లాసులో ఆయన పాఠం చెబుతూ వుంటే స్కూల్ ఆవరణ మొత్తం వినబడుతుంది. ఒకసారి పాఠం మొదలుపెట్టారంటే, గంగా ప్రవాహానికైనా అడ్డుకట్టలు వున్నాయేమో కాని, ఆయన వాక్ప్రవాహానికి మాత్రం ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. శ్రావ్యమైన గొంతుతో తెలుగు పద్యాలు చదువుతూ వుంటే ‘ఒన్స్ మోర్’ అనకుండా వుండలేం.
అటువంటి శంకరం మాష్టారి గొంతు మూగబోయింది. గత పక్షంరోజులుగా ఆయన ఎవరితోనూ మాట్లాడింది లేదు. క్లాసులో కూడా పాఠం చెప్పకుండా, కళ్ళు మూసుకుని మౌనంగా వుండిపోతున్నారు.
పిల్లలకి ఆయనంటే చచ్చేంత భయం. ఆయన పాఠం చెబుతుంటే తలకూడా పక్కకు తిప్పరు. పిల్లలే కాదు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మాష్టారు అంటే భయమే. ఒక్కరోజు పిల్లవాడు స్కూలుకు రాకపోతే, మరుసటి రోజు అతని తల్లిదండ్రులు మాష్టారి ముందు హాజరవ్వా ల్సిందే.
అటువంటి మాష్టారు ఈ రోజు భయం భయంగా స్కూలుకి వస్తున్నారు. ఆయన ఎప్పుడు వచ్చి వెళ్తుంది కూడా స్కూల్లో చాలామందికి తెలియదు. అంతకు ముందు స్కూలుకు అందరి కంటే ముందు వచ్చి అందరి కంటే చివర వెళ్లేవాడు. ఉపాధ్యాయ వత్తిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి శంకరం మాష్టారికి ఏమయ్యింది? ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో తెలియాలంటే ఓ పదిహేను రోజులు క్రితం జరిగిన పరిణామాలు మనం తెలుసుకోవాలి.
ఆ రోజు శంకరం మాష్టారు క్లాసులోకి అడ్డుగుపెట్టగానే, ఒక్క పిల్లవాడు కూడా కనపడలేదు, ఖాళీ బెంచీలన్నీ వెక్కిరిస్తూ కనపడ్డాయి.
”ఏమిటి ఈ వేళ ఒక్కడు కూడా రాలేదు” అని మనసులో అనుకుంటా వుండగా బయట ‘డౌన్ డౌన్ రాజీనామా చేయాలి’ అంటూ పెద్దగా అరుపులు వినపడ సాగాయి.
శంకరం మాష్టారు తన సుదీర్ఘ ఉపాధ్యాయ వత్తి ప్రయాణంలో, పాఠశాల ఆవరణలో ఏనాడు అటువంటి అరుపులు వినలేదు.
”ఏమయ్యంటుంది, ఈ అరుపులేమిటి..” అనుకుంటూ క్లాస్‌రూంలో నుంచి బయట కొచ్చి వరండాలో నిలబడ్డారు.
బయట దూరంగా మెయిన్ గేటు దగ్గర ఓ ముప్పై, నలభై మంది దాకా గుమిగూడి పెద్దగా అరుస్తున్నారు. గేటుకు తాళం వేసుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే, ఈ పాటికి వాళ్ళంతా పాఠశాల ఆవరణలోకి దూసుకేచ్చి నానా భీభత్సం చేసే వాళ్ళే.
అంతలో మిగిలిన క్లాసు రూముల్లో నుంచి కూడా టీచర్లు బయటకొచ్చి చోద్యం చూసినట్టు చూస్తున్నారు.
ఆ పాఠశాలకు ఓ హెడ్మాష్టారు కూడా వున్నాడంటే వున్నాడు, కాని వారానికి ఏ రెండుమూడు రోజులో వస్తుంటాడు స్కూల్‌కి. మిగిలిన రోజులలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మునిగి తేలుతుంటాడు. అధికార పార్టీ అండదండలు కూడా వుండటంతో, ఆయన పైన అధికారులెవరూ పల్లెత్తు మాట అనే వాళ్ళు కాదు. అన్ని పనులు శంకరం మాష్టారి భుజాల మీద వేసేవాడు. పాపం మాష్టారు కూడా పల్లెత్తు మాట అనకుండా చెప్పిన పని చెప్పినట్టు చేసేవాడు.
శంకరం మాష్టారు టీచర్ల వంక చూశారు, ఎవరైన వెళ్ళి గేటు దగ్గర వాళ్ళతో మాట్లాడతారేమో అని. కాని వాళ్ళ ముఖాలలో అటువంటి ఛాయలు ఏమీ కనపడలేదు. ఇక తనకు తప్పదు అనుకుని మాష్టారే, ”పద వెళ్దాం ఆ గొడవ ఏమిటో చూద్దాం” అంటూ పక్కనే వున్న ప్యూన్ వెంకన్న వైపు చూస్తూ అన్నారు మాష్టారు.
వెంకన్న మారు మాట్లాడలేదు, కాని అడుగు మాత్రం ముందుకు వేయలేదు.
అడుగులు ముందుకు వేస్తూ, తన వెనుక వెంకన్న రావటం లేదని గ్రహించి ”ఏం వెంకన్న.. ఏమయింది రావట్లేదు!” అన్నారు మాష్టారు.
”సార్ వాళ్ళు గొడవ చేస్తోంది మీగురించే” అంటూ నసిగాడు వెంకన్న.
”నా గురించా.. నేనేం చేశాను. అయినా నాతో గొడవ పడటానికి మన ఊరి వాళ్ళు రారే” అంటూ సందేహం వెలిబుచ్చారు మాష్టారు.
”అవును మాష్టారు మన ఊరి వాళ్ళు ఒకరో ఇద్దరో వున్నారు వాళ్ళలో. మిగిలిన వాళ్ళ ముఖాలు నేను ఎప్పుడూ చూడలేదు” అంటూ దగ్గర కొచ్చాడు గేటు దగ్గరవున్న వ్యాయామ ఉపాధ్యాయుడు.
”వాళ్ళు ఎవరైనా గానీ, నామీదకు రావటానికి నేను ఏ తప్పు చెయ్యలేదే?” కాస్త అసహనంగా అన్నారు మాష్టారు.
”మీరేదో వాళ్ళ పిల్లల్ని బూతులు తిట్టారట. అందుకని గొడవ పడటానికి వచ్చి నట్టున్నారు. వాళ్ళ మాటల్ని బట్టి నాకు అర్ధం అయ్యింది సార్” అంటూ తనకు తెలిసింది చెప్పాడు వెంకన్న.
”అవును సార్, వాళ్ళ అరుపులను బట్టి నేనూ అదే విన్నాను”
నేను పిల్లల్ని బూతులు తిట్టటం ఏమిటి. మీకు తెలియదా నేను ఎలాంటి వాడినో..” ఈసారి మాష్టారి ముఖంలో కోపం తొంగి చూసింది.
‘అదే నేను చెప్పాను సార్. వాళ్లు వినిపించుకోలేదు” తన ప్రయత్నం ఫలించలేదు అన్నట్టు చెప్పాడు వ్యాయామ ఉపాధ్యాయుడు.
”సరే. పదండి నేనే మాట్లాడతాను” అంటూ ముందుకు కదలబోయారు శంకరం మాష్టారు.
”మీరు వద్దులే సార్” అంటూ మిగిలిన ఉపాధ్యాయుల వంక చూసాడు ఎవరన్నా తోడు వస్తారేమోనని. కాని వాళ్ళెవరూ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.
ఈలోపు శంకరం మాష్టారు గేటు దగ్గరకు చేరుకోవటంతో ఆయన వెనకాలే వెంకన్న, వ్వాయామ ఉపాధ్యాయుడు ఇద్దరూ చేరుకున్నారు.
శంకరం మాష్టారిని చూడగానే ఇంకా పెద్దగా అరవసాగారు గేటు అవతల జనం.
”అరవకండి మాస్టారు మీతో మాట్లడటానికి వచ్చారు.. నిశ్శబ్దంగా వుంటే మాష్టారు మాట్లాడతారు, లేకపోతే మీదారి మీది” అంటూ వ్యా.ఉ. అరవటంతో, అక్కడున్న వాళ్ళందరి నోళ్లు మూతబడ్డాయి.
”వెంకన్నా తాళం తీయి” అంటూ వాళ్ళ వంక చూసారు మాష్టారు.
ఇద్దరు ముగ్గురిని తప్ప మిగతావాళ్ళను ఎప్పుడూ ఊళ్ళో చూసినట్టు లేదు. పైపెచ్చు వాళ్ళు పేరెంట్సులాగా కూడా అనిపించలేదు మాష్టారికి.
”చెప్పండి.. ఏం జరిగింది. ఎందుకిలా అరుస్తున్నారు..” అంటూ అడిగారు మాష్టారు.
”ఏం జరిగింది అంటారేంటండి, చేసిందంతా చేసి.. మా పిల్లలు బడికి రావాలా వద్దా” ముందు వరుసలోని ఒక పెద్ద మనిషి అడిగాడు.
”ఇది ప్రభుత్వ పాఠశాల, ఎవరైనా రావచ్చు. అసలు ఏం జరిగిందో చెపితే కదా ముందు అర్ధమమేది”
”ఇంకా ఏం జరగాలండి.. పసిపిల్లను పట్టుకుని పాలిస్తావా? అంటారా? అసలు మీకు బుద్ధి జ్ఞానం వుందా?” అంటూ అతని పక్కనే వున్న మరో భారీకాయం చిందులు తొక్కింది.
అసలు జరిగిందేమిటంటే సదరు పెద్దమనిషి కూతురు స్కూలుకు లేటుగా వస్తే, మాష్టారు ”ఏం తల్లీ.. ఎందుకు లేటయ్యింది.. ఇంటి దగ్గర పాలిస్తున్నావా?” అన్నారు. దానితో ఆ పిల్ల మనోభావాలు దెబ్బతిని, ఇంటికి ఏడ్చుకుంటా వెళ్ళి ఇంట్లో వాళ్ళకి చెప్పింది. దానితో అ పెద్ద మనిషి మందీమార్బలంతో స్కూలు మీదకు దండయాత్రకు వచ్చాడు. వస్తూ వస్తూ ఓ మీడియా ఛానల్‌ని కూడా పెంటపెట్టుకుని వచ్చాడు.
వాడు వచ్చీ రావటంతోనే అక్కడ జరుగుతున్నది మొత్తం రికార్డు చెయ్యటం మొదలుపెట్టాడు.
”మా పిల్లల్ని ‘బడుద్ధాయిలు’ అని బూతులు తిడుతున్నారట. వాళ్ళు స్కూల్లో తలెత్తుకోలేకుండా వున్నారంట. అందుకే స్కూలుకి రామని భీష్మించుకుని ఇంట్లో కూర్చున్నారు” మరో గున్నఏనుగు మాష్టారి మీద ఆరోపణలు చేసింది.
అసలు బడుద్ధాయి అనేది బూతు పదమేమి కాదు. బడుద్ధాయి అంటే బద్దకస్తుడు, బాగా అల్లరి చేసేవాడు అని అర్ధం. ఆ. అర్థం తెలియక స్కూలు ముందు నానా యాగి చేస్తున్నారు వాళ్ళు.
వాళ్ళ మాటలకు ఏం మాట్లాడాలో శంకరం మాష్టారికి అర్థం కాలేదు.
”నా వయస్సు 60కి దగ్గరపడింది. నా మనుమరాలి వయసు పిల్లతో నేనెందుకు అసభ్యంగా మాట్లాడతాను చెప్పండి” అంటూ అక్కడున్న వాళ్ళను ప్రాధేయ పడ్డాడు.
కాని వాళ్లే ఎవరూ వినే స్థితిలో లేరు. మాష్టారు రాజీనామా చెయ్యల్సిందే అని పెద్దగా అరవటం మొదలు పెట్టారు.
‘ఇంత చిన్న దానికి రాజీనామా దాకా ఎందుకండి, మాష్టారు చేసిన తప్పుకు క్షమాపణ చెపుతారు” అంటూ మధ్యలో దూరాడు వ్యా.ఉ.
‘నేను తప్పు చేశానా. క్షమాపణ చెప్పాలా. అని మనసులో అనుకుంటూ’ కోపంగా వ్యా.ఉ వంక చూశారు మాష్టారు.
మాష్టారి అంతరంగం అర్ధంకాని వ్యాఉ, ”మాష్టారు. ఏదో జరిగింది జరిగిపోయింది. ఆ పిల్లకు క్షమాపణలు చెప్పండి” అంటూ తొందర పెట్టాడు.
అక్కడున్న వాళ్ళు కూడా ”క్షమాపణలు చెప్పాలి” అంటూ పెద్దగా అరవసాగారు.
మాష్టారికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. తన ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయి.
యాంత్రికంగా, అక్కడున్న వాళ్ళందరి చేతులు పట్టుకుని క్షమాపణలు కోరారు.
అప్పటిదాకా అక్కడలేని ఆ ఆడపిల్ల, ఎక్కడనించి వచ్చిందో వచ్చింది.
ఆ పిల్లకు కూడా క్షమాపణలు చెప్పాల్సిందే అని అక్కడున్న వాళ్ళు పట్టుబట్టటంతో, మాష్టారు. కన్నీళ్ళు పెట్టుకుంటూ ఆ పిల్లకు కూడా క్షమాపణలు చెప్పారు. అప్పటికి గాని అక్కడున్న వెళ్ళందరూ శాంతించలేదు.
జరుగినది మొత్తం వీడియో రికార్డు చేశారని వేరే చెప్పనక్కర్లేదనుకుంటా.
పక్క రోజు, ఆ మీడియా ఛానల్ వాడు, ”కీచక టీచరు! ఉపాధ్యాయుడా కామ పిశాచా?’ అంటు రకరకాల టైటిల్స్ పెట్టి ఓ రోజంతా ఉదరగొట్టడం జరిగింది. ఆ రోజంతా మాష్టారు ఇంట్లో నుండి బయటకు కూడా కాలు పెట్టలేదు. మాష్టారి ఇంట్లోవాళ్ళు కూడా ఆ వార్తలు చూసి హతాశులయ్యారు. మాష్టారి శ్రీమతి అయితే రోజంతా ఏడుస్తూనే వుంది.
మాష్టారి శ్రేయోభిలాషులు ఒకరిద్దరు ఫోన్లోనే పరామర్శించి ధైర్యం చెప్పారు. కాని, ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా వచ్చి అండగా నిలిచిన పాపాన పోలేదు.
నిజానికి జరిగిన అవమానానికి ఇంకొకరైతే ఏ ఉరో వేసుకునేవాళ్ళు. కానీ శంకరం మాష్టారు ఆత్మవిశ్వాసం గలమనిషి. ఏనాడు ఏ తప్పు చేయని మనిషి. ఎవ్వరినీ, దేనికీ చేయిచాచి ఎరుగడు. అందుకనే ఇంత జరిగినా ధైర్యంగా వుండగలిగాడు.
ఆ రోజు ఉదయం అసెంబ్లీ కోసం పిల్లలందరూ ఆటస్థలం పక్కనే వున్న వేదిక ముందు వరుసలో నిలబడ్డారు. ప్రతిరోజూ అది వాళ్ళకి అలవాటే..
అసెంబ్లీలో రోజూ పిల్లలకు నాలుగు మంచి మాటలు చెప్పటం, ప్రతిపాఠశాలలో జరిగేదే. ఇక్కడ ఆ బాధ్యత కూడా శంకరం మాష్టారిదే. కాని ఈ సంఘటన జరిగిన నాటి నుండి అసెంబ్లీ కూడా జరగటంలేదు.
వ్యా.ఉ. రెండు మూడు సార్లు అడిగినా శంకరం మాష్టారి నుండి మౌనమే సమాధానంగా వచ్చేది.
కాని ఆ రోజు శంకరం మాష్టారు వ్యా.ఉ డిని పిలిచి మరీ అసెంబ్లీ ఏర్పాటు చెయ్యమన్నారు.
ఆ మాటలకు వ్యా.ఉ. మొదట ఆశ్చర్య పోయినా, మాష్టారు మళ్లీ తమ లోకంలోకి వచ్చినందుకు సంతోషపడుతూ పిల్లలందరిని అసెంబ్లీకి పిలిచాడు.
పిల్లలందరూ వచ్చాక శంకరం మాస్టారు మెల్లగా వేదిక ఎక్కి పిల్లలందరి ఎదురుగా నిలబడ్డారు.
మిగిలిన టీచర్లందరూ వేదిక కింద నించుని ఆయన ఏం మాట్లాడబోతున్నాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
వ్యా.ఉ. ముందుగా పిల్లలచేత వందేమాతరం పాడించి, ”ఇప్పుడు మన శంకరం మాష్టారు మాట్లాడతారు” అంటూ మైకును ఆయన చేతికిచ్చాడు
మైకు అందుకుని, పిల్లలు మీరందరూ నా మనుమళ్ళు, మనుమరాళ్ళలాంటి వాళ్ళు. నేనొక మాటు మీ పట్ల కఠినంగా, పరుషంగా మాట్లాడి ఉంటే అది మీ మంచి కోసమే తప్ప, మీ మీద పగతో కాదు. నా 30 ఏళ్ళ ఉపాధాయ వత్తిలో నా విద్యార్థులను నా పిల్లలతో సమానంగా చూశాను. నా పిల్లలతో పాటు మీరు కూడా వద్ది లోకి రావాలనే కోరుకున్నాను. ఆ క్రమంలో మీలో ఒకరిద్దరిని గట్టిగా తిట్టి వుండచ్చు. అందువల్ల మీ మనోభావాలు దెబ్బతింటాయని గ్రహించలేక పోయాను. అసలు మీ వయసులో మీకు కూడా మనోభావాలు వుంటాయని గహించలేక పోవటం నా తప్పే” అంటూ తన నడుముకు వున్న తోలుబెల్టును సర్రున బయటకులాగి, ఫటా ఫటా తనని తాను కొట్టుకోవటం మొదలు పెట్టారు.
ఆ హటాత్ పరిణామానికి అక్కడున్న వాళందరూ నిశ్చేష్టులై మాటలు రాని బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు.
ఇంతలో వ్యా.ఉ. తేరుకుని, మాష్టారి చేతుల్లో నుంచి బెల్టు లాక్కోబోయాడు.
”మాష్టారు నన్ను ఆపకండి” అంటూ మరో పది దెబ్బలు వీపు వాచి పోయేటట్టు కొట్టుకున్నారు.
ఆ తరువాత గుంజీళ్ళు తీయటం మొదలుపెట్టారు. ”ఒకటి. రెండు..” అంటూ.
అక్కడున్న పిల్లలకు ఏమీ అర్ధం కాలేదు. కాని ఒక్కటి మాత్రం వాళ్ళు గ్రహించ గలిగారు, తమవల్ల మాష్టారు బాధపడుతున్నారని.
కొంత మంది పిల్లలు అయితే కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు, మాష్టారు గుంజీళ్ళు తీస్తుంటే.
”తొంభై ఎనిమిది.. తొంభైతొమ్మిది.. వంద”
వంద గుంజీళ్ళు అయ్యేసరికి ఓపిక నశించి వేదిక మీద కూలబడ్డారు.
వ్యా. ఉ పరిగెత్తుకుంటా వెళ్ళి కింద పడ్డ మాష్టారిని లేపాడు.
మరో మాస్టారు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు.
అవి తాగిన శంకరం మాష్టారు కాస్త తేరుకుని ”ఇంకో ఏడాదిలో నేను రిటైర్ కావలసి వుంది. ఆనందంగా నాకు ఇష్టమైన ఈ వత్తి నుండి శలవు తీసుకుందామనుకున్నా. కాని ఇలా మిమ్మల్ని విడిచి పోవలసి వస్తుందని ఊహించలేదు. ఇంక శలవు. ఈ రోజే నా ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా” అని అక్కడ నుంచి చిన్నగా కదిలారు.
నేరుగా హెడ్మాష్టారు గదికి వెళ్ళి తన రాజీనామా లేఖను అక్కడి టేబుల్ మీద ఉంచి, తన గదికి వెళ్ళి, తన సామాన్లు సర్దుకుని పాఠశాలను వీడటానికి బయటకు అడుగులు వేశాడు.
బయట మెయిన్ గేటుకు దగ్గర అడ్డంగా పిల్లలందరూ నిలబడి ముక్త కంఠంతో… ”మమ్మల్ని క్షమించండి మాష్టారు. మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక పోయాం”’ అంటూ అరవటం మొదలు పెట్టారు.
ఇంతలో, ఈ విషయం తెలిసిన ఆ ఊరి సర్పంచి అక్కడికి వచ్చాడు,
”మాష్టారూ… ఒకరిద్దరు అజ్ఞానంతో మాట్లాడిన మాటలు పట్టించుకోకండి. ఆ దుర్ఘటన జరిగిన రోజు నేను ఊరిలో లేను. వుండి వుంటే ఇంత అనర్థం జరిగేది కాదు. మీలాంటి నిబద్ధత కలిగిన మాష్టారు స్కూల్ విడిచి వెళ్ళిపోతే పిల్లల పరిస్థితి ఏమిటి” అంటు మాష్టారి చేతులు పట్టుకుని ప్రాధేయ పడ్డాడు.
”మీ అందరూ నా పట్ల చూపిస్తున్న అభిమానానికి నేను ధన్యుడిని. కాలం మారుతోంది. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి. ఇప్పుడు విద్య ఒక వినిమయ వస్తువు. విద్యార్థి ఒక వినియోగదారుడు. ఉపాధాయుడు కేవలం సేవకుడు మాత్రమే. అతనికి విద్యార్థుల పట్ల ఎటువంటి బాధ్యతలు కాని, హక్కులు కాని వుండవు. ఇటు వంటి వాతావరణంలో నేను ఇంక ఇమడలేను. మీ విన్నపాలను తిరస్కరిస్తున్నందుకు నన్ను క్షమించండి” అంటు అక్కడి నుంచి కదిలారు.
నిజానికి గొడవ జరిగిన రోజే వాళ్ళందరూ మాష్టారికి అండగా నిలబడి వుంటే, మాష్టారి గౌరవం దక్కేది. మనోభావాల పేరుతో, పరువు రోడ్డు మీద పడ్డ తరువాత ఇంక అక్కడ వుంటే రోజూ చస్తూ బతకాలని తెలిసే మాష్టారు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.
కాని మాష్టారికి, ఆ ఊరి సర్పంచికి ఇతర ఉపాధ్యాయులకు తెలియనిది ఏమిటంటే, ఈ నాటకం మొత్తానికి సూత్రధారి హెడ్ మాష్టారు. శంకరం మాష్టారికి ఊళ్ళో మంచి పేరు వుంది. విద్యార్ధులు ఆయనంటే ఎనలేని భయభక్తులతో వుంటారు. ఆయన వున్నంత కాలం వెలుగు పక్కన చీకటిలా వుండి పోవల్సిందే తప్ప తనకు ఎన్నటికీ గుర్తింపు రాదు. పైపెచ్చు ఈ మధ్య తను చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వేలు పెడుతున్నారు. స్కూల్ చుట్టూ వెంచర్లు వేసి అమ్మజూపుతున్న స్థలాలకు అడ్డుపడుతున్నాడు. దానికి కారణం స్కూల్‌కి సంబంధించిన భూమిని కొంత మేర ఆక్రమించు కోవటమే.
అందుకనే ‘మనోభావాలు’ అంటూ తెరవెనుక నుంచి నాటకం ఆడించి ఓమంచి మనిషిని పాఠశాలలోని విద్యార్ధులకు దూరం చేశాడు. మనోభావల పేరుతో మంచి ఉపాధ్యాయులు దూరమైతే పాఠశాలల్లో మిగిలేవి మట్టి గడ్డలే.
(ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు విద్యార్ధులు చేసే అల్లరి భరించలేక తమకి తాము దండించుకున్నారు. వారి ఆవేదనకు ప్రతి రూపమే ఈ కథ)
- ఇ. శ్రీనివాస రెడ్డి,
7893111985