కాగితాలకే పరిమితమైన పెంపు
ఏడాది ముగిసే సరికి అంచనాలు తలకిందులు
ఆయా రంగాలపై ఆశించినంతగా జరగని వ్యయం
ప్రజలకు చేకూరని నిజమైన లబ్ది
బడ్జెట్‌లో వెల్ఫేర్ ఖర్చులపై ప్రశ్నలు
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్నప్పటికీ… పాలన కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ‘వికసిత్ భారత్’, ‘అమృత్‌కాల్’ వంటి నినాదాలు వినిపిస్తున్నాయి గానీ.. ఆ నినాదాల వెనుక ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. ప్రతీ బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు ప్రకటిస్తున్న కేంద్రం.. ఏడాది ముగిసేసరికి అవే పథకాల్లో ఖర్చులు తగ్గిస్తోంది. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పోషణ వంటి రంగాలకు బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు కాగితాలపై మాత్రమే పెరుగుతున్నాయి. వాస్తవంగా ప్రజలకు చేరాల్సిన నిధులు మాత్రం తగ్గిపోతున్నాయి. ఇది సంక్షేమానికి నిబద్ధత కాదనీ, రాజకీయ ప్రదర్శన మాత్రమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
న్యూఢిల్లీ : మోడీ పాలనలో అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా భారీగా అప్పులు చేసి ఖర్చులను కూడా పెంచుతున్నది. అయితే ఆ ఖర్చు ప్రజల సంక్షేమంగా మారటం లేదు. ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో దీనిపై ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణను చూపిస్తున్నట్టు ప్రభుత్వం చెప్తున్నా… వాస్తవంలో సంక్షేమ రంగాలకు కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చవడం లేదని విశ్లేషణలను బట్టి తెలుస్తున్నది.
కాగితాలపై పెంపు… ఖర్చులో కోత
బడ్జెట్ అంచనాల ప్రకారం 2026-27లో మొత్తం ప్రభుత్వ వ్యయం రూ.53.5 లక్షల కోట్లు, మూల ధన వ్యయం రూ.12.2 లక్షల కోట్లుగా ఉన్నది. ఆర్థిక లోటును జీడీపీలో 4.3 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. అప్పు-జీడీపీ నిష్పత్తిని 55.6 శాతానికి పరిమితం చేస్తామని ప్రకటించింది. అయితే ఈ లక్ష్యాలు వాస్తవంలో సాధ్యమవుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. విద్యకు రూ.1.39 లక్షల కోట్లు, ఆరోగ్యానికి రూ.1.05 లక్షల కోట్లు, వ్యవసాయానికి రూ.1.63 లక్షల కోట్లు, సామాజిక సంక్షేమానికి రూ.62.326 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.2.73 లక్షల కోట్లు కేటాయించినట్టు బడ్జెట్‌లో చూపించారు.
కానీ గత అనుభవాల ప్రకారం బడ్జెట్ అంచనాల (బీఈ) నుంచి సవరించిన అంచనాలకు (ఆర్‌ఈ) వచ్చే సరికి ఈ రంగాలన్నిం టిలోనూ ఖర్చులు తగ్గిపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి కేటాయింపులు రూ.2.65 లక్షల కోట్ల నుంచి రూ.2.12 లక్షల కోట్లకు పడిపోయాయి. సామాజిక సంక్షేమం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి కీలక రంగాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.
వడ్డీ భారం పెరుగుదల
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ అని చెప్తున్నా… నానాటికీ పెరుగుతున్న అప్పులు, ఆ అప్పులకు అయ్యే వడ్డీలు పెను భారంగా మారుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ ఖర్చులకు అడ్డుగా నిలుస్తున్న ప్రధాన అంశం వడ్డీ చెల్లింపుల భారం. 2025లో రూ11.37 లక్షల కోట్లుగా ఉన్న వడ్డీ చెల్లింపులు.. 2026లో రూ.12.76 లక్షల కోట్లకు పెరిగాయి. దీనితో సంక్షేమానికి అదనపు నిధులు కేటాయించడం ఆర్థికంగా భారం అవుతున్నది. మోడీ ప్రభుత్వానికి ఆర్థిక ప్రణాళిక అనేది సరిగ్గా లేదని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నదని ఆర్థిక నిపుణులు, మేధావులు వెల్లడిస్తున్నారు.
నామమాత్ర పెంపులతో మానవాభివృద్ధి కష్టం
పీఎం-కిసాన్, ఆయుష్మాన్ భారత్, పీఎం-పోషణ్ వంటి పథకాలకు స్వల్ప పెంపులు చూపించినా.. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే వాటి వాస్తవ విలువ తగ్గిపోయిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్యం, పోషణ, ఆదాయ భద్రత రంగాల్లో ఈ నామమాత్ర పెంపులు మానవాభివృద్ధి ఫలితాలను మార్చలేవని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ 2026-27లో సంక్షేమ రాజ్యంగా కనిపించే ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేసింది. కానీ అమలులో లోపాలు, వాస్తవ ఖర్చుల్లో కోతల కారణంగా ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పు కనిపించడం కష్టమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిధుల కేటాయింపులు మాత్రమే కాదనీ, అవి నమ్మకంగా ఖర్చవడం కూడా సవాలుగా మారిందని వారు స్పష్టం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ పాలన ప్రజల అవసరాల కంటే రాజకీయ లాభాలకే ఎక్కువ పని చేస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. నినాదాలు, ప్రచారాలు కాకుండా నిజమైన ఉపాధి, బలమైన సంక్షేమం, సమాన అభివృద్ధి అవసరమని మేధావులు సూచిస్తున్నారు. అవి లేకుండా మోడీ ప్రభుత్వం నిరంతరం వినిపించే ‘వికసిత్ భారత్’ కేవలం ఖాళీ నినాదంగానే మిగిలిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, పీఎం-పోషణ్ పథకాలపై ప్రభావం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)కు గ్రామీణ ఒత్తిడులు ఉన్నప్పటికీ.. బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం వాస్తవ పెరుగుదల కనిపించలేదు. కేంద్రంలో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోడీ ప్రభుత్వం దీనిని చిన్నచూపే చేస్తున్నది. క్రమక్రమంగా దీనిని నిర్వీర్యం చేయాలని చూస్తున్నదనే ఆరోపణలూ ఉన్నాయి. కాగా 2026-27లో దీనిని ‘వికసిత్ భారత్ గ్రామీణ్’ కార్యక్రమంలో కల్పడంతో నిజమైన వ్యయ పెరుగుదల ఎంత అన్నది స్పష్టంగా కనిపించడం లేదు. పీఎం-పోషణ్, అంగన్వాడీ పథకాలకు కేటాయించిన నిధులు వాస్తవ విడుదలల్లో తగ్గిపోవడంతో చిన్నారులు, మహిళల పోషణ స్థితి మెరుగుపడటం లేదు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్-5) గణాంకాల ప్రకారం పిల్లల్లో రక్తహీనత పెరగడం ఆందోళన కలిగిస్తోంది.



