రుణాల పెరుగుదల 102 శాతం
ఆస్తుల వృద్ధి 48 శాతమే..
భారతీయ కుటుంబాల పరిస్థితిపై ఆర్బీఐ తాజా గణాంకాలు
న్యూఢిల్లీ : భారతీయ కుటుంబాలు ఆస్తులు సృష్టించటం కంటే వేగంగా అప్పులు పెంచుకుంటున్నాయి. అంటే.. పొదుపు కంటే ఖర్చు, అప్పు ఆధారిత జీవన శైలి పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆర్బీఐ డేటా ప్రకారం.. భారతీయ కుటుంబాల వార్షిక రుణభారం 2019-20 నుంచి ఇప్పటి వరకు ఆస్తుల కంటే వేగంగా పెరిగింది. 2019-20లో కుటుంబాల అప్పులు రూ.7.5 లక్షల కోట్లు ఉన్నాయి. 2024-25లో మాత్రం అవి రూ.15.7 లక్షల కోట్లకు ఎగబాకాయి. అంటే రుణాల పెరుగుదల 102 శాతంగా ఉన్నది. అదే సమయంలో కుటుంబాల ఆస్తులు మాత్రం 48 శాతమే పెరుగుదలను నమోదు చేశాయి. అంటే.. 2019-20లో భారత కుటుంబాలు తమ ఆర్థిక ఆస్తులలో రూ.24.1 లక్షల కోట్లను జోడించగా.. 2024-25 నాటికి అది రూ.35.6 లక్షల కోట్లుగా నమోదు చేశాయి.
2019లో అప్పులు జీడీపీలో 3.9 శాతంగా ఉన్నాయి. అయితే 2024-25లో అది 4.7 శాతానికి పెరిగింది. 2023-24 ఇది 6.2 శాతంగా నమోదైంది. 2019-20లో భారతీయ కుటుంబాలు జీడీపీలో 12 శాతం మేర ఫైనాన్షియల్ అసెట్స్ (ఆర్థిక ఆస్తులు)ను సృష్టించాయి. అయితే అది 2024-25 నాటికి 10.8 శాతానికి తగ్గటం గమనార్హం.భారతీయ కుటుంబాల పొదుపు పద్దతులు, పెట్టుబుడులు పెట్టే విధానాలు మారుతున్నాయి. ఇప్పటికీ బ్యాంకు డిపాజిట్లు కుటుంబాల పొదుపులో ప్రధానమైనవిగా ఉన్నాయి. వాటి వాటా 32 శాతం నుంచి 33.3 శాతానికి స్వల్పంగా పెరిగింద. అయితే మ్యూచువల్ ఫండ్లు భారీగా పెరిగాయి.
వాటి వాటా 2.6 శాతం నుంచి 13.1 శాతానికి ఎగబాకింది. అంటే 2019-20లో భారతీయ కుటుంబాలు రూ.61,686 కోట్లు పెట్టుబడులుగా పెట్టగా.. 2024-25లో అది రూ.4.7 లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే ఏకంగా 655 శాతం వృద్ధి నమోదైంది. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టే అలవాటు వేగంగా పెరుగుతోందనీ, ఇది భారతీయులలో ఆర్థిక అవగాహనకు పెరుగుతున్న సూచనగా నిపుణులు చెప్తున్నారు. ఇక భారతీయ కుటుంబాలలో నగదు పొదుపులు తగ్గాయి. నగదు చేతిలో ఉంచుకోవడం (కరెన్సీ హౌల్డింగ్) వాటా 11.7 శాతం నుంచి 5.9 శాతానికి పడిపోయింది. ఇక బీమా, పింఛన్, షేర్లు, చిన్న పొదుపులు వంటి ఇతర రంగాల్లో మాత్రం పెద్ద మార్పులు లేవు.



