రిలయన్స్ పాత్రపై అస్పష్టత
అనిల్ అంబానీ ఆర్థిక కార్యకలాపాలపై నిఘా
సోర్స్ కోడ్స్ బదిలీకి ఫ్రాన్స్ ‘నో’
చండీగఢ్ : భారత వైమానిక దళం కోసం 114 డస్సాల్ట్ రాఫెల్ యుద్ధ విమానాలను సిద్ధం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఇటీవల పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. అయితే వీటిలో అధిక భాగం విమానాలను దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు వీలుగా నాగపూర్‌లోని డస్సాల్ట్ ఏరోస్పేస్ లిమిటెడ్ (డీఆర్‌ఏఎల్)లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేశారు. బహుళ ప్రయోజక ఫైటర్ జెట్ విమానాల (ఎంఆర్‌ఎఫ్‌ఏ) కొనుగోలు కోసం రూపొందించుకున్న కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా రాఫెల్ విమాన ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. రాఫెల్ యుద్ధ విమానాల సేకరణకు సంబంధించి కేవలం కొన్ని వివరాలు మాత్రమే బయటికి వచ్చాయి. అయితే రెండు ఇంజన్లు ఉండే ఈ ఫ్రాన్స్ విమానాలలో 96 విమానాలను డీఆర్‌ఏఎల్‌లోనే నిర్మిస్తారని, మిగిలిన 18 విమానాలు ఫ్రాన్స్ నుంచి దిగుమతి అవుతాయని అంటున్నారు.
ఉమ్మడి భాగస్వామ్యంలో పెరిగిన డస్సాల్ట్ వాటా
నాగపూర్‌లోని మిహాన్ ప్రత్యేక ఆర్థిక మండలిలో ఉన్న డీఆర్‌ఏఎల్ 2017లో ఏర్పడింది. ఇందులో రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఏరోస్ట్రక్చరల్ లిమిటెడ్ (అప్పుడు అనిల్ అంబానీ చేతిలో ఉంది)కు 51 శాతం వాటాలు, ఫ్రాన్స్‌కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. 2018లో కార్యకలాపాలు ప్రారంభించిన డీఆర్‌ఏఎల్ అప్పటి నుంచి రాఫెల్ విమానాలకు, డస్సాల్ట్‌కు చెందిన ఫాల్కన్- 2000 దీర్ఘ శ్రేణి ఎగ్జిక్యూటివ్ జెట్ విమానాలకు విడిభాగాలను తయారు చేస్తోంది. గత సంవత్సరం సెప్టెంబరులో డీఆర్‌ఏఎల్‌లో డస్సాల్ట్ తన వాటాను 51 శాతానికి పెంచుకుంది. పెంచుకున్న రెండు శాతం వాటాల కోసం రూ.176 కోట్లను వెచ్చిం చింది. దీంతో ఉమ్మడి భాగస్వామ్య సంస్థ డస్సాల్ట్ సబ్సిడరీగా మారిపోయింది. దీనికి ఉన్న మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కారణంగా డీఆర్‌ఏఎల్ విమానాలను ఉత్పత్తి చేసే కేంద్రంగా ఎదిగింది.
సోర్స్ కోడ్స్ బదిలీ సాధ్యం కాదు
గత సంవత్సరం మేలో పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణ సమయంలో రాఫెల్ విమానాల పనితీరును అంచనా వేయడం సాధ్యం కాలేదు. సోర్స్ కోడ్స్ అందుబాటులో లేకపోవడమే దీనికి కారణం. వీటిని అభివృద్ధి చేయడానికి దశాబ్దాల కాలం పట్టిందని, అందువల్ల వాటిని ఎవరితోనూ పంచుకోలేమని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. రాఫెల్‌పై జరుగుతున్న చర్చలలో భాగంగా…స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, ఇతర కీలక ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు సంబంధించిన ముఖ్యమైన సోర్స్ కోడ్స్‌ను బదిలీ చేసే విషయం ప్రస్తావనకు వచ్చింది. అయితే ఫ్రాన్స్ ప్రభుత్వం అందుకు ససేమిరా అంది. అంటే ఫ్రాన్స్ అంగీకారం, మద్దతు లేకుండా కొన్ని సెన్సార్లు, ఆయుధాలను లేదా విమాన సాఫ్ట్‌వేర్‌ను స్వతంత్రంగా రాఫెల్‌లో చేర్చడం భారత్‌కు సాధ్యపడదన్న మాట. సోర్స్ కోడ్స్ లేకుండా రాఫెల్‌ను వేగంగా తిరిగి ప్రోగ్రా మింగ్ చేయడం కుదరదని నిపుణులు అభిప్రాయపడ్డారు. సోర్స్ కోడ్స్ లేకపోవడంతో ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఓ రాఫెల్ విమానాన్ని కోల్పోయిందని అమెరికా వైమానిక దళంలో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ డెప్టులా తెలిపారు. అయితే దీనిని భారత్ అంగీకరించలేదు.
అంబానీలపై నిఘాతో ఆలస్యం
డీఆర్‌ఏఎల్‌లో రిలయన్స్ భవిష్యత్ కార్యకలాపాల పాత్ర అస్పష్టంగానే ఉంది. అనిల్ అంబానీ, ఆయన అసోసియేట్లు ఆర్థిక, రెగ్యులేటరీ నిఘా నీడలో ఉన్నారు. ఈ అనిశ్చితి కారణంగా రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం అమలులో జాప్యం జరగవచ్చునని నిపుణులు అభిప్రాయపడ్డారు. అంచనా వేసిన షెడ్యూల్ ప్రకారం స్థానికంగా రాఫెల్ యుద్ధ విమానాల తయారీ 2028-29 లోగా మొదలయ్యే అవకాశాలు కన్పించడం లేదు. అందుకు మరింత సమయం పట్టవచ్చు. రాఫెల్ కార్యక్రమం మొత్తాన్నీ గోప్యంగా ఉంచుతున్నారు. అందుకే దీనిపై ఊహాగానాలే తప్ప అధికారిక ప్రకటనలు ఏవీ విడుదల కావడం లేదు. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఒకే ఒక సమాచారం ఏమంటే ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాలను సేకరించాల్సిన అవసరాన్ని రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ గుర్తించి అందుకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది.
ఒప్పందం కుదరాలంటే…
రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన తుది ఒప్పందం ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కుదురుతుందన్న సంకేతాలు కన్పించడం లేదు. ఎందుకంటే ఒప్పందం కుదరాలంటే ప్రాజెక్ట్ వ్యయం, సాంకేతిక బదిలీకి సంబంధించిన ప్రొటోకాల్స్, పారిశ్రామిక భాగస్వామ్యాలు, డెలివరీ షెడ్యూల్స్ వంటి అంశాలపై చర్చలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒప్పందం కుదిరిన తర్వాత వైమానిక దళం రాఫెల్-4, రాఫెల్-5 వేరియంట్లను పొందుతుంది. అయితే ఇప్పటికే డస్సాల్ట్‌కు పెద్ద ఎత్తున ఆర్డర్లు ఉన్నాయి. దీంతో మనకు యుద్ధ విమానాలను అందజేయడం మరింత ఆలస్యం కావచ్చు.
దానికి బదులుగా…
సోర్స్ కోడ్స్‌కు బదులుగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేసెస్ (ఏపీఐలు)ను ఫ్రాన్స్ అందజేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఏపీఐలు అందుబాటులో ఉంటే భారత్ తన సొంత వ్యవస్థలను రాఫెల్‌లో అమర్చుకోవచ్చు. యూఏఈ ఇప్పటికే దీనిని ఉపయోగిస్తోంది. ఖతార్, గ్రీస్ కూడా రాఫెల్‌ను వాడుతున్నాయి. అయితే అవి ఎక్కువగా ప్రామాణికమైన ఫ్రాన్స్, నాటో ఆయుధ ప్యాకేజీపై ఆధారపడుతున్నాయి. ప్రస్తుతం మన దేశం ఎఫ్3-ఆర్ స్టాండర్డ్ రాఫెల్ జెట్లను ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు ఎఫ్-4 స్టాండర్డ్ కోసం ఒప్పందం కుదుర్చుకుంటోంది.



