న్యూఢిల్లీ: ఇజ్రాయిల్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడంతో పశ్చిమ ఆసియా గగనతలం అల్లకల్లోలంగా మారింది. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు పెరగడంతో శనివారం ఒక్కరోజే భారత్ నుంచి పశ్చిమ ఆసియా దేశాలకు వెళ్లాల్సిన సుమారు 180కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. గగనతలం మూసివేత, భద్రతా కారణాల దృష్ట్యా భారతీయ విమానయాన సంస్థలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. దేశీయ విమానయాన దిగ్గజాలు తమ సర్వీసులను పెద్ద ఎత్తున నిలిపివేశాయని తెలుస్తోంది. ఇండిగో అత్యధికంగా సుమారు 72 విమానాలను రద్దు చేసింది. ఇరాన్ మీదుగా గగనతల ఆంక్షలు ఉండటంతో అర్థరాత్రి వరకు అన్ని సర్వీసులను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఎయిర్ ఇండియా దాదాపు 31 సర్వీసులను రద్దు చేసింది. దుబారు, దోహా, రియాద్, జెద్దా వంటి నగరాలకు వెళ్లాల్సిన విమానాలు ఇందులో ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు ప్రధాన ఆపరేటర్ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పశ్చిమ దిశగా వెళ్లే అన్ని అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేసింది. రోజుకు సగటున 110 సర్వీసులు నడిపే ఈ సంస్థ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దుబారు, షార్జా వంటి నగరాలకు వెళ్లే విమానాలు ఈ యుద్ధ ప్రభావానికి లోనయ్యాయని, పలు సర్వీసులు రద్దయ్యాయని స్పైస్‌జెట్ వెల్లడించింది.
మధ్యలోనే వెనక్కి…
శనివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఏఐ139 విమానం గగనతలం మూసివేత సమాచారం అందడంతో మధ్యలోనే వెనుతిరిగి ముంబయిలో ల్యాండ్ అయింది. కేవలం రద్దయిన విమానాలే కాకుండా, యూరోప్, అమెరికాకు వెళ్లే విమానాలు కూడా ఇరాన్ గగనతలాన్ని వదిలి సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం పెరగడమే కాకుండా, విమాన టికెట్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన కేంద్ర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేయాలని, విమానాల మళ్లింపు, రద్దు విషయంలో అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటించాలని ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించారు. తమ విమానం రద్దయిన ప్రయాణికులు పూర్తి రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ విమానాన్ని ఎంచుకునే సదుపాయాన్ని విమానయాన కంపెనీలు కల్పిస్తున్నాయి.
భారత్ నుంచి 180కి పైగా విమానాలు రద్దు..
- Advertisement -
- Advertisement -



