Friday, March 6, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంకాంగోలో గని కుప్పకూలి 200 మందికి పైగా మృతి

కాంగోలో గని కుప్పకూలి 200 మందికి పైగా మృతి

- Advertisement -

70 మంది చిన్నారులు సైతం!
భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి కుప్పకూలిన రుబాయా కోల్టన్‌ గని

క్రిషశ : ఆఫ్రికా దేశం కాంగోలో భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడి రుబాయా కోల్టన్‌ గని కుప్పకూలింది. ఈ ఘటనలో 200 మందికిపైనే మరణించారు. మృతుల్లో 70 మంది చిన్నారులు ఉన్నట్టు ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ గని తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. అయితే, బాంబులతోనే ఈ ప్రమాదం జరిగిందని, కేవలం ఐదుగురు మాత్రమే చనిపోయినట్టు రెబల్‌ గ్రూప్‌ ప్రకటించింది. అయితే మంత్రిత్వ శాఖ చెబుతున్న మృతుల సంఖ్య వాస్తవం కాదని ఎం 23 రెబల్స్‌ సీనియర్‌ అధికారి ఫానీ కాజ్‌ తెలిపారు.

ఈ మైనింగ్‌ కూలిపోవడం కాదని, బాంబు దాడుల వల్లే జరిగిందని చెప్పారు. ఐదుగురు మాత్రమే మరణించారని పేర్కొన్నారు. మరోవైపు స్థానిక కార్మికులు మాత్రం 200 కంటే ఎక్కువ మంది చనిపోయారని చెబుతున్నారు. ఆ ప్రదేశంలో 200 కంటే ఎక్కువ మృతదేహాలను వెలికితీసినట్టు గని కార్మికుడిగా పని చేస్తున్న ఇబ్రహీం తాలుసే తెలిపాడు. గనుల యజమానులు మరణాల సంఖ్యను వెల్లడించడానికి అంగీకరించడం లేదని చెప్పాడు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా, ఎలాంటి నియంత్రణ లేకుండా ప్రజలు ప్రజలు ఎక్కడ పడితే అక్కడ చేతులతో తవ్వుతున్నారని స్థానికులు అంటున్నారు. అందుకే ఈ ఘటనలు జరుగుతున్నాయని చెబుతున్నారు.

నెల రోజుల క్రితం కూడా
ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగడం ఇదేం తొలిసారి కాదు. సరిగ్గా నెల రోజుల క్రితం జనవరి చివరి వారంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది. రుబాయా గనుల్లో మట్టిచరియలు విరిగిపడి దాదాపు 200 మంది మృతి చెందారు. భారీ వర్షం కారణంగా ఈ గనుల్లో సొరంగాలు కుప్పకూలాయి.

రుబాయా మైనింగ్‌ కేంద్రం
రుబాయా తూర్పు కాంగో నడిబోడ్డున ఉంది. ఇది మధ్య ఆఫ్రికా దేశంలోనే ఖనిజాలు సమృద్ధిగా ఉండే ప్రాంతం. ఇక్కడ దశాబ్దాలుగా ప్రభుత్వ బలగాలు, వివిధ సాయుధ గుంపుల మధ్య కలహాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతంలో రువాండా మద్దతు పొందిన ఎం23 రెబల్స్‌ యుద్ధాన్ని గణనీయంగా పెంచారు. ఈ ఘర్షణ, ఇప్పటికే తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరముగా మార్చింది.

కోల్టాన్‌ ప్రధాన సరఫరాదారు కాంగో
కోల్టాన్‌ ప్రధాన సరఫరాదారుగా కాంగో ఉంది. కోల్టాన్‌ అనేది అరుదైన మెటల్‌ టాంటాలమ్‌ కలిగి ఉన్న నల్ల లోహ ధాతువు. ఇది స్మార్ట్‌ఫోన్స్‌, కంప్యూటర్లు, విమాన ఇంజిన్లు వంటి ఉత్పత్తుల్లో కీలక భాగంగా ఉపయోగపడుతుంది. 2023లో ప్రపంచ కోల్టాన్‌ ఉత్పత్తిలో కాంగో 40శాతం వాటాను కలిగి ఉందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే తెలిపింది. రుబాయా మైన్స్‌ ప్రపంచ టాంటాలమ్‌ సరఫరాలో 15శాతం పైగా వాటా కలిగి ఉన్నాయని పేర్కొంది.

సంక్షోభాల్లో కాంగో
తూర్పు కాంగో దశాబ్దాలుగా సంక్షోభంలో ఉంది. వివిధ ఘర్షణలు, మానవతా సంక్షోభాల వల్ల డిసెంబర్‌ నంచి 300,000 మంది తమ ఇండ్లను వదిలి వెళ్లిపోయారు. సుమారు 7 మిలియన్లకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 2024 జూన్‌లో అమెరికా మధ్యవర్తిత్వంలో కాంగో, రువాండా శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి. తిరుగుబాటుదారులు, కాంగో మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తూర్పు కాంగోలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ ఘర్షణల కారణంగా అనేక మంజి పౌరులు, సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -