Tuesday, February 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం

- Advertisement -

మెక్సికోలో చెలరేగిన హింస
అప్రమత్తంగా ఉండాలి : భారతీయులకు అడ్వైజరీ జారీ

మెక్సికో: మెక్సికో మోస్ట్‌ వాంటెండ్‌ డ్రగ్స్‌ మాఫియా డాన్‌ ఎల్‌ మెంచో మిలిటరీ ఆపరేషన్‌లో హతమయ్యాడు. ఈ మేరకు అధికార వర్గాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఎల్‌ మెంచో మృతి తర్వాత మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాకాండ చెలరేగింది. అతడి అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగులబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. ఈ అల్లర్ల నేపథ్యంలో భారత పౌరులకు ప్రభుత్వం ఒక అడ్వైజరీ జారీ చేసింది. మెక్సికోలోని భారత పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మెక్సికో సైన్యం భారీ ఆపరేషన్‌
ఎల్‌ మెంచోను పట్టుకునేందుకు మెక్సికో సైన్యం భారీ ఆపరేషన్‌ చేపట్టింది. జాలిస్కోలోని తప్పాల పట్టణంలో ఆదివారం ఈ ఆపరేషన్‌ను నిర్వహించింది. ఎల్‌ మెంచో ఉన్న ప్రాంతాన్ని చుట్టుముట్టి సోదాలు చేసింది. ఈ క్రమంలోనే మెంచో అనుచరులు కాల్పులకు పాల్పడడంతో సైన్యం ఎదురుకాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ఎల్‌ మెంచో సహా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని విమానంలో మెక్సికో నగరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందారు. అయితే ఘటనా స్థలంలోనే నలుగురు ముఠా సభ్యులు మరణించారని మెక్సికో జాతీయ రక్షణ కార్యదర్శి తెలిపారు. కాగా, ఈ ఘటనలో ముగ్గురు సైనికులు గాయపడగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.

ఎల్‌ మెంచో మృతితో చెలరేగిన హింస
ఎల్‌ మెంచో మృతితో మెక్సికోలోని పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఆందోళనలు చెలరేగాయి. మాఫియా డాన్‌ అనుచరులు పలు ప్రాంతాల్లో వాహనాలను తగలబెట్టారు. రహదారులను దిగ్బంధించారు. సూపర్‌ మార్కె ట్లు, బ్యాంకులకు నిప్పంటించారు. అంతేకాకుండా అధికారులతో ఘర్షణలకు దిగినట్టు జాలిస్కో గవర్నర్‌ పాబ్లో లెమస్‌ నవారో తెలిపారు. ప్రజా రవాణా సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. ఈ హింస కనీసం ఐదు రాష్ట్రాలకు వ్యాపించినట్టు తెలిపారు. ముఖ్యంగా 2026 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు జరగనున్న జాలిస్కో రాష్ట్రంలో భద్రతా ఆందోళనలు పెరిగాయి.

భారతీయులకు అడ్వైజరీ జారీ
మెక్సికోలో పరిస్థితులు ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులు రాయబారి కార్యాలయం సూచనలను కచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది. భారతీయ పౌరులకు ఈ మేరకు అడ్వైజరీ జారీ చేసింది. ”మెక్సిలోని జాలిస్కో, తమౌలిపాస్‌, మిచోఆకాన్‌, గ్యురెరో, న్యూవో లియోన్‌ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో హింస్మాతక ఘటనలు జరగుతున్నాయి. తదుపరి నోటీసులు వచ్చే వరకు ఇండ్లల్లోనే ఉండండి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితులపై అప్రమత్తంగా ఉండాలి. స్థానిక అధికారుల అప్‌డేట్లను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అత్యవసరమైతే 911కు కాల్‌ చేయాలి. కుటుంబ సభ్యులకు మీరు ఉంటున్న ప్రాంతం గురించి సమాచారం అందిం చాలి. సహాయం కోసం దయచేసి భారత రాయబార కార్యాలయాన్ని 52 55 4847 7539 నంబర్‌లో సంప్రదించండి’ అని ఎంబసీ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. భారత్‌తో పాటు అమెరికా, కెనడా కూడా అడ్వైజరీ జారీ చేశాయి.

భారీ ఆపరేషన్‌పై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ స్పందన
ఎల్‌ మెంచోపై చేపట్టిన ఆపరేషన్‌పై వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రెటరీ కరోలిన్‌ లీవిట్‌ స్పందించారు. ఎల్‌ మెంచోను పట్టుకోవడం కోసం మెక్సికో ప్రభుత్వానికి అమెరికా ఇంటెలిజెన్స్‌ సహకారం అందించిందని ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తమ దేశానికి ఫెంటనిల్‌ను అక్రమంగా తరలిస్తున్నాడని, ఇలాంటి నార్కో టెర్రిరిస్ట్‌లను అగ్రరాజ్యం ఎన్నటికీ సహించదని అన్నారు. డ్రగ్స్‌ సూత్రధారుడు హతం కావటంపై ట్రంప్‌ స్పందించారు. తనకు అన్ని కలిసి వస్తున్నాయంటూ కామెంట్‌ చేశారు. అంతా తామే చేసినట్టు అమెరికా చేస్తున్న వ్యాఖ్యలను మెక్సికో తిరస్కరించింది. తామే ఎల్‌ మెంచోను మట్టుబెట్టినట్టు మెక్సికో సర్కార్‌ వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -