వివాహేతర సంబంధమే కారణం..?
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జేపీ కాలనీలో ఘటన
నవతెలంగాణ- రామచంద్రాపురం
తల్లీ, కొడుకు దారుణ హత్యకు గురైన ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాల్టీలోని జేపీ కాలనీలో గురువారం జరిగింది. మరోవ్యక్తి కత్తిపోటుకు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగ్ ప్రాంతానికి చెందిన శివరాజు క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన చంద్రకళ (30)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలో చంద్రకళ, ఆమె కుమారుడు రేవంత్ కుమార్(15)తో కలిసి శివరాజు.. నాలుగు రోజుల క్రితం తెల్లాపూర్‌లోని జేపీ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు దిగారు.
అయితే గురువారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల ప్రాంతంలో అద్దెకున్న ఇంట్లో చంద్రకళ, రేవంత్‌కుమార్, శివరాజు రక్తపు మడుగులో ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా, తల్లీ కొడుకు అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలతో ఉన్న శివరాజును దగ్గరలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అడిషనల్ డీసీపీ ఉదయ్ రెడ్డి, ఏసీపీ శ్రీనివాస్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని.. హత్య జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తల్లి, కొడుకును శివరాజే కత్తితో గొంతు కోసి అనంతరం అతను కూడా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసి ఉండొచ్చని సమాచారం. సంఘటనా స్థలానికి క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీమ్ పోలీసులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించారు.



