దేశ రాజధానిలో ప్రతి ఉదయం మనిషికి ఒక శాపంగా మారిందా? శ్వాస అనేది బతుకు సంకేతంగా కాకుండా మృత్యుగణనకు లెక్కయిందా? వాయు కాలుష్యంపై పలు అధ్యయనాల్ని పరిశీలిస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఢిల్లీలో బుధవారం వాయు నాణ్యత సూచీ-(ఏక్యూఐ)లో ‘వేరీపూర్’ కేటగిరి కింద మూడు వందల అరవై ఐదు రీడింగ్ నమోదవడం ఆందోళన కలిగించే అంశం. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇది 400 దాటింది. అక్టోబర్ రెండోవారం నుండే ఇది తగ్గుతూ వస్తున్నా, దీపావళి తర్వాత మరింత క్షీణించి ప్రమాదకర స్థాయికి చేరింది. దీన్ని దృష్టిలో పెట్టు కునే పండగ రోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య గ్రీన్‌క్రాకర్స్ మాత్రమే కాల్చాలని సుప్రీంకోర్టు నిర్దేశించిం చింది. అయినా మోతాదుకు మించి బాణసంచా వినియోగించడం వల్ల కాలుష్య కారక సూక్ష్మ ధూళికణాల (పీఎం 2.5) స్థాయి 675కి చేరి హస్తినాపురాన్ని మరణశయ్యపై పడేసింది. సిటీ మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లు ఉంటే వాటిలో 35 స్టేషన్లు ‘రెడ్‌జోన్’ ఇండికేటర్‌ను చూపించడం ముంచుకొస్తున్న ముప్పుకు ఓ సంకేతం.
ఒక క్యూబిక్ మీటర్ గాల్లో ఐదు వందల మైక్రోగ్రాముల పీడీఎమ్ 2.5 ధూళికణాలు ఉంటే, అది మన ఊపిరి లోకి ప్రవేశించే సూక్ష్మముల వలే మారు తుంది. వాయు నాణ్యత సూచీ జీరో నుంచి ఐదువందల వరకు ఉంటే, అందులో నాలుగు వందలు దాటితే అది మన గుండెమీద బరువుగా ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో ఆ సంఖ్యే ‘ఆరోగ్య సంక్షోభం’ అనే అర్థం చెబుతోంది. ఈ ప్రమాద ఉధృతి ఇటీవల మరింత తారాస్థాయికి పెరిగింది. టపాసులు కాల్చడం ద్వారా వెలువడిన ఉద్గారాలు, గాలుల మంద గమనం తదితర అంశాలు వాయు కాలుష్యానికి కారణమని ‘క్లైమెట్ ట్రెండ్’ అధ్యయనం పేర్కొంది. కానీ ఢిల్లీ సర్కార్ మాత్రం పంజాబ్, హర్యానా రైతుల మీదకు తోస్తూ తన బాధ్యత నుంచి తప్పుకుంటోంది. వారు పంటవ్యర్థాలను కాల్చ డం వల్లే ఈ పొగ వ్యాపిస్తున్నట్టు చెబుతున్నా అది కూడా ఓ కారణమే తప్ప సమస్యకు అదొక్కటే మూలం కాదు. డీజిల్ వాహనాల పెరుగుదల, నిర్మాణాల ధూళి, పరిశ్రమల పొగ, నగరం చుట్టుపక్కల రోడ్డు రవాణా, వ్యర్థాల దహనం ప్రధాన కారణాలు. దీనిపై దృష్టి పెట్టకుండా గత ఆప్ ప్రభుత్వం, ప్రస్తుత బీజేపీ సర్కార్ ఒకరినొకరు నిందించుకుంటూ ప్రజల ప్రాణాల్ని పణంగా పెడుతున్నాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సిపిసిబి) ఏకంగా ఢిల్లీ ప్రజలను రోడ్లమీదకు రావద్దని హెచ్చరించింది. అయినా ప్రతిఏడాది ఇది ‘సహజమే’ కదా అన్న ధోరణిలో పాలకులు వ్యవహరిస్తుండటం సరికాదు. ఏఐఐఎంఎస్, ఐసిఎంఆర్, ఐఐటి-ఢిల్లీ సంయుక్త అధ్యయ నాలు ఈ సమస్యను విశ్లేషిస్తూ కాలుష్య కార ణాలను వెల్లడించాయి. ఇప్పటికే వాయు కాలుష్య సంబంధిత వ్యాధులతో ప్రతియేటా లక్ష మందికి పైగా చనిపోతున్నట్టు వార్తలొస్తున్నాయి. పిల్లల్లో ప్రతిముగ్గురిలో ఒకరికి ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతున్నాయి. వృద్ధుల్లో ఊపిరితిత్తుల వ్యాధులు నలభై శాతం పెరిగాయి. ఢిల్లీవాసుల సగటు జీవితకాలం తొమ్మిదేండ్లు తగ్గిపోతోంది. పరిస్థితి ఇలా ఉంటే కేంద్రసర్కార్ ‘మానవుడు ప్రకృతిలో భాగం’ అన్న మూలసూత్రాన్ని విస్మరించి పర్యావరణ సంక్షోభానికి తెరదీసింది. బీహార్ ఎన్నికల హడావిడి, మత రాజకీయాల్లో తలమునకలైంది.
ప్రతి సంవత్సరం వాయు కాలుష్యం తీవ్రత పెరుగుతున్నా ముందు జాగ్రత్తచర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్- జిఆర్‌ఎపి’ల లాంటి పథకాలు కాగితాలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఢిల్లీ ఎన్‌సిఆర్ పరిధిలో ఇప్పటికే ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-2 నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాయు నాణ్యత సూచీ దిగ జారడంతో ‘సెంట్రల్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్’ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఇలాంటి పరిస్థితిలో కూడా రహదారులపై మాస్కులు వేసుకుని స్కూల్‌కు వెళ్తున్న చిన్నారులు, శ్వాసకోస సమస్యలతో ఆస్పత్రులకు తరలుతున్న వృద్ధులు, ఊపిరి పీల్చుకోలేని స్థితిలో గర్భిణుల అవస్తలు పాలకవర్గాల నిర్లక్ష్యానికి సజీవదృశ్యాలు.
ప్రతీపౌరుడికి స్వచ్ఛమైన గాలి పీల్చే హక్కు ఉంది. దీన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని నెరవేర్చకుండా పాలకులు ఎన్ని ‘స్మార్ట్‌సిటీల’ గురించి మాట్లాడినా ప్రయోజనం శూన్యం. వాయు కాలుష్యమనేది ఇప్పుడు పర్యా వరణ సమస్య మాత్రమే కాదు, ఆరోగ్య సమస్య కూడా. ఎందుకంటే, పేదలు, కార్మికులు, ఆటోడ్రైవర్లు, చిన్నవ్యాపారులు రోజూ రోడ్లమీదకు రానిదే పూట గడవదు. పాలకవర్గాలు ఎయిర్ ఫ్యూరి ఫైయర్ గదుల్లో, సెంట్రలైజ్డ్ ఏసీ ఆఫీసుల్లో కూర్చొని వీరి ‘ఊపిరి’పై లాభాలు గడిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు స్పందించాలి. లేదంటే రాబోయేకాలంలో ఢిల్లీలో జీవావరణమే ప్రమాదంలో పడుతుంది.
తల్ల’ఢిల్లీ’!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES