Sunday, January 18, 2026
E-PAPER
Homeకథఅత్తగారూ - కొత్త అల్లుడు

అత్తగారూ – కొత్త అల్లుడు

- Advertisement -

ఆదివారం ఉదయం 8 గంటలు. సూర్యుడు కిటికీలోంచి తొంగిచూస్తున్నా… కిరణ్‌ ఇంకా దుప్పటి ముసుగు తన్నే పడుకున్నాడు. భార్య సుమ వంటగదిలో నుంచి గరిటెలతో ‘సంగీతం’ వాయిస్తోంది.
”ఏవండీ.. లేవండి! సూర్యుడు నెత్తిమీదకు వచ్చేశాడు. ఆఫీసులోలా గుర్రు పెట్టి నిద్రపోకండి” అంటూ సుమ గదిలోకి వచ్చింది.
కిరణ్‌ కళ్లు తెరవకుండానే, ”ఆ కాఫీ ఏదో ఇక్కడికే తెస్తే, ఈ ‘మహారాజు’ గారు కళ్లు తెరుస్తారు” అన్నాడు నవ్వుతూ. సుమ కాఫీ కప్పుతో దగ్గరికి వచ్చి, ”మహారాజు గారికి మర్యాదలు ఎక్కువే.. తీసుకోండి” అంది.

కిరణ్‌ కాఫీ కప్పు అందుకుంటూ ఆమె చేతిని మెల్లగా నొక్కి, ”కాఫీలో చక్కెర తక్కువైనట్టుంది కానీ.. నీ మాటల్లో తీపి మాత్రం అలాగే ఉంది” అన్నాడు కొంటెగా చూస్తూ.
”చాల్లేండి మీ సరసాలు.. ఎవరైనా చూస్తారు, వదలండి!” అంటూ సుమ సిగ్గుపడుతూ చేతిని విడిపించుకుంది. ”త్వరగా రెడీ అవ్వండి, ఇవాళ మా అమ్మ వస్తోంది ఊర్నించి”
కిరణ్‌ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. ”అత్తగారా? అంటే.. ఇవాళ కూడా నాకు ఆఫీసులో ఉన్నంత స్ట్రెస్‌ ఉంటుందన్నమాట!”

”అదేంటి అలా అంటారు?” అని సుమ బుంగమూతి పెట్టింది.
”ఏం లేదు.. మీ అమ్మగారు వస్తే చాలు, ‘మా సుమ బంగారం, దాన్ని సరిగ్గా చూసుకోవడం లేదు’ అని నా మీద ఒక ఛార్జ్‌ షీట్‌ వేస్తారు కదా, అందుకే అన్నాను” అని నవ్వాడు కిరణ్‌.
”సరేలేండి.. మాటలు ఆపి త్వరగా స్నానం చేయండి. ఇవాళ మీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను” అని సుమ వెళ్ళబోతుంటే..
”వంకాయ కూర సరే.. కానీ ఆ కూరలో నీ చేతి గోరుముద్దలు తోడైతే, ఆ రుచే వేరు” అన్నాడు కిరణ్‌ మళ్ళీ రొమాంటిక్‌ గా.
”అబ్బో! ఇవాళ హాస్యం, సరసం బాగా ముదిరాయి.. త్వరగా రండి!” అంటూ సుమ నవ్వుతూ వెళ్ళిపోయింది.

మధ్యాహ్నం 12 గంటలు. కాలింగ్‌ బెల్‌ మోగింది. సుమ ఉత్సాహంగా తలుపు తీసింది. రాజమ్మ గారు రెండు చేతుల్లో సంచులతో ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే సుమ ఎగిరి గంతేసినట్లే అయింది. కిరణ్‌ సోఫాలో నుంచి మెల్లగా లేచి, బలవంతపు నవ్వుతో, ”రండి అత్తయ్య గారు.. బాగున్నారా?” అన్నాడు.
”నేనేం బాగుంటాను బాబూ.. ఆ బస్సులో కుదుపులకి నా నడుం కాస్తా నలుగ్గొట్టుకుపోయింది. అయినా మా అమ్మాయిని చూసి ఎన్ని రోజులైందో.. అందుకే వచ్చేసా,” అంటూ గంభీరంగా సోఫాలో సెటిల్‌ అయ్యారు. భోజనం దగ్గర కూర్చున్నారు. సుమ వంకాయ కూర వడ్డించింది.
”ఏంటమ్మా సుమా.. కూరలో నూనె అంత పోశావు? అల్లుడు గారికి ఆఫీసులో కూర్చునే పని, ఇలాంటివి తింటే పొట్ట వస్తుంది. చూడు.. ఇప్పటికే కొంచెం పెరిగినట్టుంది!”
”అప్పుడే నా పొట్ట మీద విచారణ మొదలైంది!” కిరణ్‌ మైండ్‌ వాయిస్‌.

”లేదమ్మ.. ఆయనకి ఇష్టమని కొంచెం వేశాను అంతే.”
”నీకు ఎప్పుడూ ఆయన మీదే ధ్యాస. అల్లుడు గారూ.. రోజు పొద్దున్నే లేచి కొంచెం వ్యాయామం చేయండి. మా ఊర్లో మీ వయసు వాళ్ళు ఇప్పటికీ ఎరువుల బస్తాలు స్వంతంగా మోసుకుంటూ పొలాల్లోకి వెళ్తుంటారు.”
”అత్తయ్య గారు.. నేను మోసే ఆఫీసు టెన్షన్‌ బరువుల ముందు ఆ బస్తాలు ఎంతండి?” అని నవ్వాడు.
సాయంత్రం కిరణ్‌ మెల్లగా సుమ దగ్గరకు వెళ్ళి, ”చూడు సుమా.. మీ అమ్మగారు వచ్చాక నువ్వు నన్ను మర్చి పోయావు. కనీసం ఆ కప్పు కాఫీ అయినా ఇవ్వచ్చు కదా?” అని చిన్నగా అన్నాడు. అది రాజమ్మ గారి చెవిన పడింది.

”ఏమన్నారు అల్లుడు గారు? సుమ సరిగ్గా చూసుకోవడం లేదా? పాపం.. చిన్నప్పటి నుంచి దాన్ని పూలలో పెట్టి పెంచాను. మీ ఇంట్లో పని చేసి చేసి దాని వేళ్లు అరిగిపోయి ఉంటాయి”
”అబ్బే.. లేదత్తయ్య గారు! వేళ్లు అరిగిపోవడం కాదు.. ఆ వేళ్లకి గోరింటాకు పెట్టే తీరిక కూడా ఇవ్వకుండా నేను వంటపనులూ ఇంటిపనులూ చేయించుకుంటున్నాను” అని సుమ వైపు చూసి కన్ను గీటాడు.
సుమ సిగ్గుపడుతూ, ”అమ్మా.. ఆయన సరదాగా అంటున్నారు, నువ్వు సీరియస్‌గా తీసుకోకు” అని కవర్‌ చేసింది. రాత్రి పడుకునే ముందు, కిరణ్‌ తన గదిలోకి వెళ్తుంటే..
”సుమా! ఇవాళ నేను, నువ్వు, ఈ గదిలో పడుకుందాం. కబుర్లు చెప్పుకోవాలి. అల్లుడు గారూ.. మీరు హాల్‌లో పడుకుంటారు కదా?” కిరణ్‌ బిత్తరపోయి సుమ వైపు చూశాడు. సుమ నవ్వు ఆపుకుంటూ,

”అలాగేనమ్మా” అంది. కిరణ్‌ తన తలగడ పట్టుకుని హాల్‌లోకి వెళ్తూ, ”అత్తయ్య గారూ.. మీరు వచ్చింది నా ఆరోగ్యం బాగుచేయడానికా? లేక నా సంసారంలో ‘గ్యాప్‌’ పెంచడానికా?” అని ఏడవలేక నవ్వుతూ గొణుక్కున్నాడు. రాజమ్మ గారు మాత్రం, ”ఏదో అన్నారు బాబూ?” అని అడిగారు.
”ఏం లేదత్తయ్య గారు.. ‘అత్త సొమ్ము.. అల్లుడు దానం’ అన్న సామెతని.. ‘అత్త ప్రేమ.. అల్లుడికి వనవాసం’ అని మార్చుకుంటున్నాను!” అన్నాడు కిరణ్‌.
ఆదివారం వచ్చింది. ”అమ్మా, అల్లుడు గారూ.. ఇలా రండి” అంటూ రాజమ్మ గారు పిలిచారు. కిరణ్‌కి అర్థమైపోయింది, జేబు ఖాళీ అయ్యే సమయం ఆసన్నమైందని!
”చూడు సుమా, పండగ వస్తోంది కదా.. నీకు, అల్లుడు గారికి బట్టలు తీసుకోవాలి. పదండి బయలుదేరుదాం.”

”అత్తయ్య గారు, ఇప్పుడెందుకు.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేద్దాం, ఇంటికే వస్తాయి కదా!”
”ఆ పిచ్చి నమ్మకాలు నా దగ్గర వద్దు బాబూ! బట్టని చేత్తో పట్టుకుని, దాని క్వాలిటీ చూడకుండా కొంటే అది షాపింగ్‌ ఎలా అవుతుంది? పదండి వెళ్దాం.”
కిరణ్‌కి తప్పలేదు. సుమ మాత్రం కొత్త చీర వస్తుందన్న ఆనందంతో అప్పుడే తయారైపోయింది. పెద్ద బట్టల షాపులోకి వెళ్ళారు. సుమ ఒక పట్టు చీరను చూసి మురిసిపోయింది. సేల్స్‌ మెన్‌ వచ్చి, ”మేడమ్‌, ఇది లేటెస్ట్‌ డిజైన్‌.. దీని ధర కేవలం 15 వేలు మాత్రమే” అన్నాడు. కిరణ్‌ షాక్‌ తిని గుటకలు మింగుతుంటే, అత్తగారు రంగంలోకి దిగారు.
”ఏంటయ్యా.. దీనికి 15 వేలా? మా ఊర్లో ఇవే చీరలు ఐదు వేలకు ఇస్తారు. అల్లుడుగారికీ అమ్మాయికీ నచ్చిందని రేటు పెంచేస్తున్నావా ఏంటి?”

”అమ్మగారు, ఇది బ్రాండెడ్‌ షాపు.. ఇక్కడ బేరాలు ఉండవు”
”బ్రాండ్‌ అయితే మాత్రం రక్తం తాగుతారా? అల్లుడు గారూ.. మీరు ఉండండి, వీడు ఎక్కువ చెప్తున్నాడు”
కిరణ్‌ మెల్లగా సుమతో, ”చూశావా సుమా, మీ అమ్మగారి పుణ్యమా అని ఆ సేల్స్‌ మెన్‌ నన్ను వెర్రి వెధవాయిని చూసినట్టు చూస్తున్నాడు” అని గొణిగాడు. చివరికి కిరణ్‌కి షర్ట్‌ కొనే వంతు వచ్చింది. కిరణ్‌ ఒక మోడ్రన్‌ ఎరుపు ఫిట్టింగ్‌ షర్ట్‌ తీసుకున్నాడు.
”ఇదేం షర్ట్‌ బాబూ? ఊపిరి కూడా ఆడేలా లేదు. రేపు పొద్దున్న మా ఊరు వస్తే ‘అల్లుడు గారికి బట్టలు కొనే శక్తి కూడా సుమకి లేదు, పాపం అందుకే చిన్న షర్ట్‌ వేసుకున్నారు’ అని నవ్వుతారు. ఇంకో రెండు సైజులు పెద్దది తీసుకోండి”

”అత్తయ్య గారు.. ఇది ఫ్యాషన్‌ అండి. ఇప్పుడు ఇలాగే వేసుకుంటారు”
”ఏం ఫ్యాషన్‌ నాయనా.. గాలి తగిలేలా ఉండాలి. సుమా, ఆ పెద్ద షర్ట్‌ పట్టుకో, మా అల్లుడు గారు అందులో సింహంలా ఉంటారు”
కిరణ్‌ ఆ షర్ట్‌ వైపు చూసి, ‘సింహంలా కాదు సుమా.. పిట్టలదొరలా ఉంటాను’ అని సుమ చెవిలో చెబితే, సుమ నవ్వు ఆపుకోలేకపోయింది. బిల్లు వేసే సమయానికి కిరణ్‌ తన క్రెడిట్‌ కార్డు తీశాడు.
”అయ్యో.. అల్లుడు గారు, వద్దు వద్దు! నేను ఉన్నప్పుడు మీరు డబ్బులు కట్టడమేంటి?” అంటూ తన పాత సంచిలోంచి ఒక పెద్ద మూట తీశారు. కిరణ్‌ సంతోషపడేలోపే రాజమ్మ గారు ఆ బాంబు పేల్చారు.

”ఇదిగోండి బాబూ.. ఇందులో ఐదు వందలు ఉన్నాయి, మిగతాది మీరే కట్టండి. నా దగ్గర చిల్లర లేదు!” కిరణ్‌ తల పట్టుకున్నాడు. సుమ నవ్వుతూ, ”పర్లేదు లేండి, అమ్మాయి తరపున అది కట్నం అనుకోండి” అంది చిలిపిగా. చివరికి ఐదు సంచులతో, ఖాళీ అయిన జేబుతో కిరణ్‌ బయటకు వస్తూ, ”అత్తయ్య గారు.. నెక్స్ట్‌ టైం షాపింగ్‌కి మీరు వెళ్ళండి, నేను ఇంట్లో ఉండి వంకాయ కూర వండుతాను!” అన్నాడు.
ఆ సాయంత్రం కిరణ్‌ ఆఫీసు స్నేహితుడు రవి, తన భార్యతో కలిసి రాత్రి డిన్నర్‌కు వచ్చారు. కిరణ్‌ చాలా ‘స్టైలిష్‌’గా ఉండాలని ప్లాన్‌ చేశాడు, కానీ అక్కడ రాజమ్మ గారు ఉన్నారని మర్చిపోయాడు. రవి దంపతులు రాగానే కిరణ్‌ ఇంగ్లీష్‌లో వెల్‌కమ్‌ చెప్పాడు. రాజమ్మ గారు సోఫాలో గంభీరంగా కూర్చుని ఉన్నారు.

”రవి.. ఈవిడ మా అత్తయ్య గారు”
”నమస్తే అండీ! బాగున్నారా?”
”బాగున్నాను బాబూ.. కానీ చూస్తుంటే మీరే కొంచెం నీరసంగా ఉన్నట్టున్నారు. సరిగ్గా తిండి పెట్టడం లేదా ఏంటి మీ ఆవిడీ మా సుమను చూడు.. అల్లుడు గారిని ఎలా మేపుతుందో!” కిరణ్‌కి అప్పుడే చెమటలు పట్టడం మొదలైంది. రవి భార్య సరళ మాత్రం నవ్వుతూ,
”అవునండీ.. మీ అల్లుడు గారు చాలా అదష్టవంతులు” అని సరళ కవర్‌ చేసింది. సుమ రకరకాల వంటకాలు వడ్డించింది. సరళ కొంచెం డైటింగ్‌ చేస్తుండటంతో అన్నం తక్కువ తీసుకుంది. అది చూసి రాజమ్మ గారు తట్టుకోలేకపోయారు.

”ఏంటమ్మా.. పక్షికి పెట్టినట్టు పెడుతున్నావు? ఆ ముద్దేంటమ్మా.. అంత చిన్నగా ఉంది? లేవమ్మా సుమా.. గరిటెతో రెండు సార్లు గట్టిగా వడ్డించు. ఎముకలు కనిపిస్తున్నాయి పిల్లకి!”
”పర్లేదు ఆంటీ.. నేను డైటింగ్‌లో ఉన్నాను” సరళ సిగ్గుతో చితికిపోతూ అంది.
”ఏంటది? డైటింగా? అంటే ఏంటి బాబూ.. తిండి మానేసి ఉండటమా? మా ఊర్లో పొద్దున్నే లేచి మజ్జిగ అన్నం, ఆవకాయ తింటే వచ్చే తెలివి, బాడీ ఫిట్టింగ్‌, ఆరోగ్యం ఈ డైటింగుల్లో రాదు తల్లి!”
రవి కిరణ్‌తో మాట్లాడుతూ, ”కిరణ్‌.. నిన్న ఆఫీసులో ప్రెజెంటేషన్‌ అదరగొట్టావు కదా!” అన్నాడు.
రాజమ్మ గారు మధ్యలో అందుకొని, ”ప్రెజెంటేషన్‌ సంగతి ఏమో కానీ.. నిన్న రాత్రి కూర మాత్రం ఈయన అదరగొట్టారు బాబూ. అదే మాడగొట్టారు. అందులోనూ. ఆ కారం భరించలేక కన్నీళ్లు పెట్టుకుని, చివరికి మజ్జిగ తాగి పడుకున్నా.”

”అత్తయ్య గారు.. అది పర్సనల్‌ విషయం.. ఇప్పుడు ఎందుకు?”
”పర్సనల్‌ ఏముంది బాబూ? రవి మనవాడే కదా. అయినా రవీ.. మా అల్లుడు గారు ఆఫీసులో పులి కావొచ్చు కానీ, ఇంట్లో మాత్రం పిల్లి కంటే సాధువు. నేను కొంచెం గట్టిగా చూస్తే చాలు.. చకచక వెళ్ళి గిన్నెలు కడిగేస్తారు!” ఆ మాటకి రవి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. కిరణ్‌ ముఖం మాడిపోయిన వంకాయలా అయిపోయింది.
వెళ్లేటప్పుడు రవి ఒక చాక్లెట్‌ బాక్స్‌ ఇచ్చాడు. రాజమ్మ గారు అది చూసి..

”బాబూ.. ఈ రంగు కాగితాల డబ్బా బదులు, ఏవైనా నాటుకోడి గుడ్లో లేక దోసకాయలో తెస్తే బాగుండేది. ఇవి తింటే పళ్ళు పుచ్చిపోతాయి.”
”అత్తయ్య గారు.. ప్లీజ్‌, ఆపండి! వాళ్ళు ప్రేమతో తెచ్చారు.”
రాజమ్మ గారు తన దగ్గర ఉన్న ఆవకాయ డబ్బా తీసి వాళ్ళకి ఇస్తూ.. ”ఇదిగోండి.. ఇది పట్టుకెళ్ళండి. ఆ డైటింగులు మానేసి, వేడి అన్నంలో ఇది వేసుకుని తినండి. అప్పుడు తెలుస్తుంది అసలైన రుచి!” అని పంపించేశారు.
రవి దంపతులు వెళ్ళాక, కిరణ్‌ సోఫాలో చతికిలబడి.. ”అత్తయ్య గారు.. మీరు గెస్టులకి మర్యాద చేశారో లేక నా పరువు తీశారో నాకు అర్థం కావట్లేదు!” అన్నాడు.

”పరువు ఏముంది బాబూ.. మనసులో ఉన్నది చెప్పాను. వాళ్ళకి ఆవకాయ ఇచ్చాను కదా, రేపు మళ్ళీ మన ఇంటికే వస్తారు చూడు!” అని నవ్వారు.

మర్నాడు సాయంత్రం కిరణ్‌ ఆఫీసు నుండి చాలా ఉత్సాహంగా వచ్చాడు. ఎందుకంటే ఆ రోజు ఇండియా-పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ ఉంది.
”సుమా! త్వరగా కాఫీ ఇవ్వు. ఇవాళ మ్యాచ్‌ మొదలవుతోంది, టీవీ రిమోట్‌ ఎక్కడీ” కిరణ్‌ టీవీ ఆన్‌ చేసేసరికి, అక్కడ రాజమ్మ గారు అప్పుడే తన ఫేవరెట్‌ సీరియల్‌ ‘కన్నీటి కాపురం’ పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు.
”అత్తయ్య గారు.. ఇవాళ మ్యాచ్‌ ఉందండి. ఆ సీరియల్‌ రేపు ఉదయం రిపీట్‌ టెలికాస్ట్‌లో చూడొచ్చు కదా?”
రాజమ్మ గారు ఎంతో గద్గగ స్వరంతో ”ఏం మాట్లాడుతున్నావు బాబూ! ఇవాళ ఆ సీరియల్‌లో హీరోయిన్‌కి విషం పెడుతున్నారు. అది ఆమె తాగుతుందో లేదో చూడకుండా నాకు నిద్ర పట్టదు. ఆ క్రికెట్‌లో ఏముంది? కొట్టడం, పరుగెత్తడం..”

”అత్తయ్య గారు.. ఇది దేశ గౌరవం అండి! కోట్లాది మంది చూస్తారు.”
”నాకు నా హీరోయిన్‌ కుటుంబ గొరవం ముఖ్యం అల్లుడు గారూ… ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఆ విలన్‌ గంపెడు కుట్రలు చేస్తుంటే, నువ్వు ఆ బంతి గురించి చెప్తావేంటి?” చివరికి కిరణ్‌ బతిమాలితే, అత్తయ్య గారు ఒక షరతు మీద ఒప్పుకున్నారు. ”కాసేపు క్రికెట్‌, కాసేపు సీరియల్‌” అని. మ్యాచ్‌ చూస్తుంటే రాజమ్మ గారు తన సొంత కామెంటరీ మొదలుపెట్టారు.
”అదేంటయ్యా.. వాడు అంత గట్టిగా తంతే., ఆ వైట్‌ డ్రెస్‌ వేసుకున్న వాడు పట్టుకోకుండా అలా నిలబడ్డాడు? వాడికి కూడా ఆ సీరియల్‌ గుర్తొచ్చినట్టుంది!”
”అత్తయ్య గారు.. అది సిక్స్‌! దాన్ని పట్టుకోలేరు.”

”అవునా! సరేలే.. ఆ బ్యాట్‌ పట్టుకున్న కుర్రాడికి దిష్టి తగిలినట్టుంది, వెంటనే వెనక్కి వచ్చేస్తున్నాడు. వాడికి ఒక నిమ్మకాయ కట్టమని చెప్పకూడదా?” కాసేపటికి ఛానెల్‌ మార్చి సీరియల్‌ పెట్టారు. అందులో హీరోయిన్‌ ఏడుస్తోంది. రాజమ్మ గారు కూడా కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు.
”చూశారా అల్లుడు గారు.. ఆ అత్తగారు ఆ కోడలిని ఎన్ని కష్టాలు పెడుతోందో! ఎంత దుర్మార్గురాలు!”
”అత్తయ్య గారు.. అది కేవలం యాక్టింగ్‌ మాత్రమే. మీరు ఎందుకు ఏడుస్తున్నారు?”
”యాక్టింగ్‌ అయితే ఏంటి బాబూ? నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేను. రేపు పొద్దున్న నువ్వు కూడా సుమని ఇలాగే ఏడిపిస్తే, నేను కూడా ఆ సీరియల్‌ అత్తమ్మలాగే మారిపోతాను జాగ్రత్త!” కిరణ్‌కి అర్థమై పోయింది.. క్రికెట్‌ స్కోరు కంటే అత్తగారి బీపీ పెరగడం ప్రమాదకరమని!
”సరే అత్తయ్య గారు.. మీరే గెలిచారు. మీరు సీరియల్‌ చూడండి, నేను మొబైల్‌లో స్కోర్‌ చూసుకుంటాను”

”అది పద్ధతి! ఒక విధానం. అయినా అల్లుడు గారు.. ఆ స్కోరు ఏదో చూసి నాకు కూడా చెప్పండి. ఆ విలన్‌కి ఎన్ని మార్కులు వచ్చాయో, మనోళ్ళు ఎన్ని కొట్టారో నాకు కూడా తెలియాలి కదా!” కిరణ్‌ తల పట్టుకున్నాడు. సుమ నవ్వుతూ కాఫీ తెచ్చి ఇస్తూ, ”చూశారా! అమ్మ స్మార్ట్‌ ఫోన్‌ మాత్రమే కాదు, మీ స్మార్ట్‌నెస్‌ని కూడా వాడేస్తోంది!” అంది. ఆ రాత్రి మ్యాచ్‌లో ఇండియా గెలిచిందో లేదో తెలియదు కానీ, రాజమ్మ గారి సీరియల్‌లో హీరోయిన్‌ మాత్రం విషం తాగకుండా బతికిపోయింది. మనలో మాట కిరణ్‌ కూడా బతికిపోయాడు.

రాజమ్మ గారు వెళ్ళే రోజు రానే వచ్చింది. ఊరికి వెళ్ళే బస్సు సాయంత్రం 5 గంటలకు. ఇంట్లో మౌనం.. వారం రోజులుగా జరిగిన అల్లరి, కేకలు, నవ్వులు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయాయి. కిరణ్‌ రాజమ్మ గారి సంచులను కారులో పెడుతుంటే, రాజమ్మగారు గదిలోంచి బయటకు వచ్చారు. ఆమె చేతిలో ఒక చిన్న మూట ఉంది.
”ఇదిగో అల్లుడు గారు.. ఇది మీకోసం.”
కిరణ్‌ దాన్ని తెరిచి చూస్తే.. అందులో ఆయనకి ఇష్టమైన ఆవకాయ పచ్చడి జాడీ, ఆయన షాపింగ్‌లో ఇష్టపడి వదులుకున్న ఆ ఎరుపు రంగు షర్టు ఉన్నాయి.
”అత్తయ్య గారు.. ఇది ఎప్పుడు కొన్నారు? పైగా ఈ పచ్చడి చేయడానికి మీకు తీరిక ఎక్కడ దొరికింది?” కిరణ్‌ కళ్ళింత చేసుకుని అడిగాడు

”మీరు ఆఫీసుకి వెళ్ళినప్పుడు, చేశాను బాబూ. మీరు నోరు తెరిచి అడగరని నాకు తెలుసు. అయినా, ‘ఆల్ట్రామోడ్రన్‌’ అత్తగారు అంటే ఆటపట్టించడమేనా పచ్చడి పెట్టించాలి కదా. అల్లుడికి ఈ మాత్రం బహుమతి ఇవ్వకపోతే ఎలా?” రాజమ్మ గారు సుమ తల నిమిరి, ”చూడు సుమా.. అల్లుడు గారు చాలా మంచివారు. నిన్ను బాగా చూసు కుంటున్నారు. నేనేదో సరదాకి ఆయనని ఏడిపించాను కానీ, నీకు ఇలాంటి తోడు దొరకడం నా అదష్టం” అన్నారు.
కిరణ్‌ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యాడు. ”అత్తయ్య గారు.. మీరు వెళ్తుంటే ఇల్లు వెలితిగా ఉంటుంది. ఆ ఫోన్‌ గొడవలు, ఆ వంట మీద మీ కామెంట్స్‌.. ఇవన్నీ నేను చాలా మిస్‌ అవుతాను.

మీ తిట్లు కూడా నాకు దీవెనల్లాగే ఉన్నాయి” అన్నాడు మనసూస్ఫూర్తిగా.
బస్సు ఎక్కే ముందు రాజమ్మ గారు కిరణ్‌ వైపు తిరిగి, ”అన్నట్టు అల్లుడు గారు.. ఆ షర్టు వేసుకుని పండక్కి మా ఇంటికి రావాలి. ఆఫీస్‌ పనులున్నాయని రావడం మానేస్తే డైరెక్ట్‌గా నేనే మీ ఆఫీస్‌కి వస్తా ఈసారి. రాజమ్మా మజాకానా” అన్నారు.
కిరణ్‌ నవ్వుతూ ”మీ గురించి ఇప్పటికే మా రవిగాడు ఆఫీస్‌లో అందరికీ చెప్పేసాడు. ఇక మీరే తిన్నగా వస్తే నేను వేరే అడ్రస్‌ వెతుక్కోవాలి” ఆమెకు నమస్కారం చేశాడు. బస్సు కదులుతుంటే రాజమ్మ గారు కిటికీలోంచి సరదాగా వార్నింగ్‌ ఇస్తున్నట్లు చేయి ఊపుతున్నారు.

  • తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
    8008 577 834
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -