అక్షరాల అలలపై అనుభూతుల పడవలలో
ఆనంద డోలలూగిన అపురూప క్షణాలు….
పద లయలలో ఎద లోయలను
హరిత రాగిణులుగ చేసే
ఆ అపూర్వ సమయాలు…..
వ్యాకులతల చీకట్ల వెన్ను వెరిచే
వాక్య తరంగాలలో మనసు ఊరట చెందిన
మధురోదయాలు…
వేకువకు కువకువలను వెన్నెలకు మధురిమలను
అద్దిన మధుర సుధల గ్రంథ సుగంధాలు….
ఏవి తల్లీ బ్రతుకు కథలో భాగ్య నిధిగా
భావ కాంతులుపంచిన ఆ మురిపాల దారులు….
చేతిలో ఒదిగి చేతనగ వెలిగి చరిత గతులను
మలుపు తిప్పిన ఆ గెలుపు సంతకమేది ఇపుడు…
అరచేతిలో చేరిన చరవాణి హొయలకు
మతులు తప్పిన మనిషి గుంపులు….
మంచి చెడుల గీత చెరిపిన నెట్టింటి మెరుపులు….
పండుగేదో దండగేదో వంట ఏదో మంట ఏదో
అంతా అంతర్జాల తళుకులు….
ఎక్కడమ్మా! ఆత్మీయ కాంతులు ఎదన దాచిన
అమ్మతనపు నీ అడుగులు….
పుస్తకమా! మా బ్రతుకు పండగ దీవించ రావమ్మా….
- వెల్ముల జయపాల్ రెడ్డి, 9441168976



