Sunday, October 26, 2025
E-PAPER
Homeహెల్త్తల్లి మనసే తొలి పాఠశాల

తల్లి మనసే తొలి పాఠశాల

- Advertisement -

బిడ్డకు మొదటి భావం, మొదటి శబ్దం, మొదటి భద్రత.. అన్నీ తల్లి మనసులోంచే వస్తాయి. గర్భధారణ అనేది కేవలం శారీరక మార్పుల ప్రయాణం కాదు. అది ఒక మనసు పునర్జన్మ కూడా. ఈ దశలో స్త్రీ శరీరం కొత్త జీవాన్ని మోస్తుంది, కానీ మనసు మాత్రం అనేక ఆలోచనలు, భయాలు, ఆశలతో నిండిపోతుంది. ”బిడ్డ బాగుంటాడా? నేను తల్లిగా సరిపోతానా? ప్రసవం సేఫ్‌గా జరుగుతుందా?”

ఈ ప్రశ్నలే గర్భిణీ మనసులో మెల్లిగా ఆందోళనగా, స్ట్రెస్‌గా మారుతాయి. ఇవి సాధారణమే, కానీ వాటిని గమనించకపోతే మెంటల్‌ ఇన్‌బాలెన్స్‌ వచ్చే ప్రమాదం ఉంటుంది. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో హార్మోన్లలో మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టెరోన్‌ లెవెల్స్‌ మారుతాయి. ఈ మార్పులు మూడ్‌ స్వింగ్స్‌, చిరాకు, ఆందోళన, నిరాశ ధోరణులు వంటి భావాలను కలిగిస్తాయి. మన మెదడులోని సెరొటోనిన్‌ అనే ‘హ్యాపినెస్‌ హార్మోన్‌’ లెవెల్‌ తగ్గితే, ఎమోషనల్‌ స్టెబిలిటీ తగ్గుతుంది.

దీని వలన: చిన్న విషయానికీ భయం, నిద్రలేమి, నిరుత్సాహం, సున్నితమైన భావోద్వేగ ప్రతిస్పందన వస్తాయి.
సైకాలజీలో దీన్ని పెరినాటల్‌ యాంగ్జైటీ/ డిప్రెషన్‌ అంటారు. అంటే గర్భధారణ సమయంలో లేదా తరువాత (postpartum) వచ్చే మానసిక ఒత్తిడి.

కేస్‌ స్టడీ:
రాధా గర్భం ధరించిన సమయంలో భర్త ఉద్యోగం కోసం ఇతర పట్టణంలో ఉండేవాడు. అత్తామామలతో రోజూ గొడవలతో… ఆమె ఒంటరిగా ఉండటం వల్ల చిన్న చిన్న భయాలు పెద్దవిగా మారాయి.
‘ఏమైనా సమస్య వస్తే?, ‘ఎవరూ తోడుగా లేరు’ అన్న ఆలోచనలు. ఒకసారి ఆమె ప్రీనటల్‌ కౌన్సిలింగ్‌కి వచ్చింది. నా సూచన మేరకు రోజూ భర్తతో వీడియో కాల్‌ ద్వారా మాట్లాడడం మొదలు పెట్టింది. భర్తతో ఆ చిన్న సంభాషణలే ఆమెకు emotional anchor అయ్యాయి. కొద్ది రోజుల్లోనే ఆమె యాంగ్జైటీ తగ్గిపోయింది. ఈ ఉదాహరణ మనకు చెబుతుంది… సంబంధాలు మానసిక ఆరోగ్యానికి సహజమైన ప్రేమ, సహనం, మద్దతు ఇవే గర్భిణీకి నిజమైన మందులు.

మనసు – బిడ్డకు అద్దం: తల్లి మనసు ప్రశాంతంగా ఉంటే, బిడ్డ కూడా అంతే ప్రశాంతంగా ఎదుగుతాడు. సైంటిఫిక్‌గా నిరూపించబడినది ఏమిటంటే.. గర్భిణీ స్త్రీకి స్ట్రెస్‌ ఉన్నప్పుడు కార్టిసాల్‌ అనే హార్మోన్‌ ప్లాసెంటా ద్వారా బిడ్డకు కూడా చేరుతుంది. దీని వలన బిడ్డలో హైపర్‌ యాక్టివ్‌, భావోద్వేగ అసమతుల్యత వంటి ప్రభావాలు రావచ్చు. అందుకే గర్భిణీ స్త్రీ మానసిక శాంతి అనేది బిడ్డ భవిష్యత్తుకు పునాది.
మన సంప్రదాయంలో ఉన్న మానసిక జ్ఞానం: పూర్వం భారతదేశంలో గర్భిణీ స్త్రీల మానసిక స్థితికి ప్రత్యేక శ్రద్ధ ఇచ్చేవారు. ఆమెకు ఇష్టమైన సంగీతం వినిపించేవారు. మంచి గ్రంథాలు (భారతం, రామాయణం, బైబిల్‌, ఖురాన్‌) చదివించేవారు. ప్రకృతి వాతావరణంలో, తల్లితనాన్ని ఆనందించగల ప్రదేశంలో ఉంచేవారు. ఇది కేవలం ఆధ్యాత్మిక ఆచారం కాదు, సైకలాజికల్‌ థెరపీ. ఎందుకంటే, మంచి ఆలోచనలు, సానుకూల వాతావరణం, ప్రశాంతత… ఇవన్నీ పిండం అభివృద్ధికి అవసరం. ఒకసారి ఒక గర్భిణీ ఆలయంలో ప్రతిరోజూ కూర్చుని భక్తిగా పాడేది. అక్కడివారు అడిగారు ”ఇంతకీ నువ్వు ఎవరికోసం పాడుతున్నావు?” అని. ఆమె నవ్వుతూ అంది ”నేను పాడేది దేవుడికోసం కాదు, నా బిడ్డ వినడానికి” అని. కొన్నేళ్ల తర్వాత ఆమె కుమారుడు సంగీతకారుడయ్యాడు. ఇది యాదృచ్ఛికం కాదు, తల్లి మనసు పాడిన పాట బిడ్డ మనసులో నాటుకుపోయింది.

గర్భిణీ స్త్రీ మానసిక ఆరోగ్యానికి:

  1. రోజూ కొంతసేపు సానుకూల ఆలోచనలతో బిడ్డతో మాట్లాడండి, ‘నువ్వు బలంగా, సంతోషంగా ఉన్నావు’ అని చెప్పండి.
  2. ఆరోగ్యకరమైన సంభాషణలు కొనసాగించండి. భర్త, కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఎమోషనల్‌ సపోర్ట్‌ చాలా అవసరం.
  3. ధ్యానం, సంగీతం, ప్రార్థన… ఇవి మానసిక ప్రశాంతతకు అద్భుతమైన సాధనాలు.
  4. సామాజిక మద్దతు (Support system) స్నేహితులను, సలహాదారులను, వేదికలను ఉపయోగించుకోండి.
  5. నెగెటివ్‌ సమాచారం లేదా భయపెట్టే కథలు దూరంగా ఉంచుకోండి.
    గర్భిణీ స్త్రీ అంటే జీవాన్ని మోసే దేవత. ఆమె మానసిక శాంతి భవిష్యత్తు తరం ప్రశాంతతకు మూలం.
    తల్లి మనసు ప్రశాంతంగా ఉంటే శిశువు ఎదుగుదల మానసికంగా ఆరోగ్యంగా బాగుంటుంది.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌,
హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -