Thursday, June 26, 2025
E-PAPER
Homeకవితకొండమల్లెలు

కొండమల్లెలు

- Advertisement -

1
ఒక్కో గుట్టను దాటుతుంటే
తాతాముత్తాలను పలకరించి పోతున్నట్టు
ఆదిమకాలంలోకి ప్రయాణిస్తున్నట్టు
2.
ఈ గొలుసుకట్టు గుట్టల్ని చూడు
అచ్చం
చేతులు పట్టుకొని ఆటాడుతున్న పిల్లల్లా-
3
ఎవరు పెట్టారో తెల్వదు కానీ
కొండ కొప్పున
భలే అందంగా ఉన్నాయి
ఈ తెల్లని ‘కొంగలపువ్వులు ‘
4
మొదట చూసినపుడు
వొట్టి ‘ రాళ్ళగుట్ట’ అనుకున్నాను
చినుకు పడింది
చూస్తే-
బుజ్జి మొక్కలను ఎత్తుకున్న ‘ బాలింతరాలు’
5
చెట్టూ తెలుసు
గుట్టా తెలుసు
తెలియనిదొక్కటే
పడగ విప్పిన మనిషి గురించి
6
పోశమ్మ తల్లి
ఈ గుట్ట మీదనే ఎందుకు వెలిసిందో తెలుసా?
”ఎవరి కన్ను గుట్ట మీద పడొద్దని”
7
ఈ గుట్ట ఎక్కితే
ఒకప్పుడు ఊరు మొత్తం కనబడేది
ఇప్పుడు గుట్టలేని ఊరుని
పోల్చుకోవడానికి మనసొప్పత లేదు.
8
బడికి పోతుంటే
రోజూ నిలబెట్టి అడుగుతుంది ఈ కర్రెగుట్ట
నేల రాలిన పూల గురించి
పూల కళ్ళలోని ఆశయాల గురించి
9
మీ రోడ్లకో నమస్కారం
ఈ గుట్టల్ని హత్య చేయకండి
కావాలంటే ఎంతదూరమైన
కాలి బాటనే నడుస్తాం
10
ఈ గుట్టల్లో
ఎట్లా నడుస్తున్నానో అనుకున్నాను.
బాల్యంలో
అమ్మ చేయి పట్టుకొని గుట్టను దాటినట్టు గుర్తు.
11
ఫలానా ఊరికి
ఒక కొండగుర్తు చెప్పమన్నాడు
అబ్బా, ఏమని చెప్పును?
‘కొండ’నే కదా .
12
ఇంకా ఈ గుట్టల మధ్యన్నే ఉంటున్నందుకు
చాలా మంది నవ్వారు
గాయమైతే
ఆకుపసరు నూరుతుంది బండ
13
నా ‘బంగారు కొండా’!
క్షమించు
మొదట్లో తొవ్వ బాగలేదని తిట్టాను.
ఇప్పుడు నా కండ్ల నిండా నువ్వే-
14
ఇన్నాళ్ళకు
కొండ మనసు కరిగింది.
ఎన్ని రోజుల్నుంచో అడిగితే
ఇప్పుడీ ‘కొండమల్లెల్ని’ కురిపించింది
– తగుళ్ళ గోపాల్‌
9505056316

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -