Wednesday, March 18, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమూసీ ప్రక్షాళన చేపట్టాలి

మూసీ ప్రక్షాళన చేపట్టాలి

- Advertisement -

12 ఏండ్లలో మూసీ అభివృద్ధి శూన్యం
బఫర్‌ పేరుతో ఇండ్ల తొలగింపు వద్దు
అవసరమైతే ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలి : యూడీఎఫ్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌, హెచ్‌సీఎఫ్‌ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ – ముషీరాబాద్‌

మూసీ ప్రక్షాళన చేపట్టాలని, సుందరీకరణ పేరుతో బఫర్‌ జోన్‌ కారణంగా ఇండ్ల తొలగింపును నిలిపివేయాలని హైదరాబాద్‌ సిటిజన్‌ ఫోరం (హెచ్‌సీఎఫ్‌), అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఫోరం (యూడీఎఫ్‌) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గత 12 ఏండ్లలో మూసీ నది అభివృద్ధి జరగలేదని, మురుగు దుర్వాసన మాత్రం పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని హెచ్‌సీఎఫ్‌ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో యూడీఎఫ్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాస్‌ మాట్లాడారు. మూసీ నది అభివృద్ధి కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రణాళికను విడుదల చేయగా, దీనికి కౌంటర్‌గా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వారి హయాంలో చాలా పనులు జరిగినట్టు చెబుతున్నారని అన్నారు. కానీ, గత 12 ఏండ్లలో మూసీ అభివృద్ధి జరగలేదని, మురుగు కంపు సమస్య తగ్గకపోగా ప్రచారమే ఎక్కువైందని విమర్శించారు. మూసీ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు, ఖర్చుల వివరాలను వెల్లడిస్తూ అనేక సంవత్సరాల్లో కేటాయింపులు జరిగినప్పటికీ ఖర్చులు తక్కువగా ఉన్నాయని అన్నారు. 2024-25, 2025-26 సంవత్సరాల్లో రూ.1500 కోట్ల చొప్పున కేటాయింపులు చేసినా వ్యయం చాలా తక్కువగా జరిగిందన్నారు. హెచ్‌సీఎఫ్‌ అధ్యక్షులు ఎం.శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ.. మూసీ శుద్ధీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని, సుందరీకరణ పేరుతో భారీగా ఇండ్ల తొలగింపులు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. మూసీ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా నదికి ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌ జోన్‌ పేరుతో భూసేకరణ చేపట్టి మొత్తం 10,017 ఇండ్లను తొలగించే ప్రణాళిక రూపొందించినట్టు తెలిపారు. ఇందులో రివర్‌బెడ్‌లో 2,166 ఇండ్లు, బఫర్‌ జోన్‌లో 7,851 ఇండ్లు ఉన్నాయని చెప్పారు. ఎక్కడైనా నదీ ప్రవాహానికి ఆటంకంగా ఉన్న ఇండ్లను తొలగించాల్సి వస్తే బాధితులకు ప్రత్యామ్నాయ నివాసం కల్పించాలని, దీనిపై ప్రభుత్వ ప్రణాళికలో స్పష్టత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో రూపొందించిన ప్రణాళికలో 8,594 ఇండ్లను తొలగించి వారికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇండ్ల తొలగింపునకు కేసీఆర్‌ ఒప్పుకోలేదని కేటీఆర్‌ ఇప్పుడు చెప్తున్నారని, కానీ వారి ప్రభుత్వ హయంలో ఏ రోజూ ఇలాంటి ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. మూసీ పరిసర బస్తీలు, కాలనీల ప్రజలతో చర్చలు జరిపి అవసరమైన మార్పులు చేసిన తర్వాతే అభివృద్ధి ప్రణాళిక అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో హెచ్‌సీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి వీరయ్య, ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -