Sunday, November 9, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుమా గ్రామాలను తరలించండి

మా గ్రామాలను తరలించండి

- Advertisement -

ఎన్టీపీసీ బూడిదతో బతకలేక పోతున్నాం
చర్మ, శ్వాసకోశ ఇతర వ్యాధులు
చుట్టు ముడుతున్నాయి
కుందనపల్లి, శాలపల్లి గ్రామస్తుల ఆవేదన
ఎన్టీపీసీ యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వేడుకోలు


రామగుండం ఎన్టీపీసీ ఫ్యాక్టరీ నుంచి వచ్చే బూడిద వల్ల ఆ రెండు గ్రామాలు కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయి. బూడిద సృష్టిస్తున్న వింధ్వంసంతో ఇక్కడ తాము జీవించలేమనీ, మరోచోట పునరావాసం కల్పించాలని మూడు దశాబ్దాలుగా కుందనపల్లి, శాలపల్లి గ్రామస్తులు ఉద్యమాలు చేస్తున్నారు. గతంలో 100 రోజులపాటు పెద్ద ఎత్తున దీక్షలు, ఆందోళనలు చేసినా.. ఎవరు కనికరించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగాన్ని కలిసి వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం బూడిద కాలుష్యం నుంచి తమను కాపాడాలని వారు వేడుకుంటున్నారు.

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఎప్పుడైనా, ఎక్కడైనా కాలుష్యపు పొగ గాని, ఏదైనా ఫ్యాక్టరీ నుంచి వెలువడే దుమ్ము ధూళి గాని కొద్దిసేపు వస్తేనే ఊపిరాడక విలవిల్లాడిపోతాం. కానీ 40 ఏండ్లుగా ఆ ఊర్లకు పక్కనే ఉన్న పరిశ్రమ వదిలే కాలుష్యాన్ని పీలుస్తూ ఆయుష్షును కోల్పోతున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్‌ సమీపంలో రాజీవ్‌ రహదారిని ఆనుకుని రాజాపూర్‌, కుందనపల్లి గ్రామాలు ఉండేవి. 40 ఏండ్ల కింద ఎన్టీపీసీ పవర్‌ ప్రాజెక్ట్‌ కోసం వేలాది ఎకరాల సాగు భూములను సేకరించారు. అదే క్రమంలో ప్రభావిత గ్రామమైన రాజాపూర్‌ గ్రామాన్ని తరలించిన అధికారులు కుందనపల్లి దాని ఆమ్లెట్‌ గ్రామమైన శాలపల్లిని పట్టించుకోలేదు. ఎన్టీపీసీ సేకరించిన 1,200 ఎకరాల్లో బూడిద చెరువును ఏర్పాటు చేయడం వారికి శాపంగా మారింది. కరకట్టల ఎత్తు పెంచడంతో బూడిద నిల్వ పెరిగింది. ఫలితంగా నాలుగు దశాబ్దాల కాలంలో చుట్టూ పది కిలోమీటర్ల దూరం వరకు పర్యావరణం కాలుష్యంగా మారింది. సీఎస్‌ఆర్‌ కింద కొన్ని పనులు చేపట్టినా అవి ఆగ్రామాన్ని కాలుష్యం నుంచి రక్షించలేక పోతున్నాయి. గాలులకు బూడిద పైకి లేచి నివాస గృహాలను నింపేస్తోంది. రెండు గ్రామాల ప్రజలు స్థానిక కాలుష్య నియంత్రణ మండలికి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేసినా..అవి పరిశీలనలు, నివేదిక సమర్పణల వరకే పరిమితమయ్యాయే తప్ప శాశ్వత చర్యలు చేపట్టలేదు.

నీరు, గాలి విషతుల్యం
బొగ్గు బూడిదను పారవేయడం వల్ల భారీ లోహాలు, ఇతర విషపదార్థాలతో నేల, నీరు, గాలి విషతుల్యంగా మారాయి. ఇది సమీప గ్రామాల ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తోంది. ఈ ప్రాంతాలలో నివసించే మను షుల జీవిత కాలం కనీసం పదేండ్లు తగ్గుతోందని వైద్యులు చెబుతున్నారు. శ్వాసకోశ వ్యాధులు, చర్మ, ఎముకల జబ్బు లు, గుండె సంబంధిత రోగాలతో ఎక్కువగా బాదప డుతున్నారు. ప్రభుత్వాలు, కాలుష్య నియంత్రణ మండలి పట్టించుకోక పోవడంతోనే జల, వాయు, శబ్ద కాలుష్యం నియంత్రణ చేయలేని స్థాయికి చేరిందని నిపుణులు అంటున్నారు. ఫలితంగా కుందనపల్లి, శాలపల్లి గ్రామాల ప్రాంతంలో మానవ మనుగడ ప్రశ్నర్థకంగా మారింది.

40 ఏండ్లలో 2 వేలకు పైగా మరణాలు
ఎన్టీపీసీ బూడిద వెదజల్లే కాలుష్యం వల్ల కుందనపల్లి, శాలపల్లి గ్రామాల్లోని ప్రతి కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్న వయసులోనే రోగాల బారిన పడుతున్నారు. గ్రామ పంచాయతీ రికార్డుల ప్రకారం గడిచిన 40 ఏండ్లలో దాదాపు 2వేల మందికి పైగా మరణించారు. వేలాది మంది అనారోగ్యం పాలయ్యారు. యాజమాన్యం గ్రామాన్ని దత్తత తీసుకుని కొన్ని సౌకర్యా లను కల్పించింది. గ్రామంలో పైపులైన్లు వేయడం ద్వారా తాగునీటిని సరఫరా చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు చికిత్స అందించడానికి వైద్య శిబిరాలను నిర్వహిస్తోంది. అయితే ఇవేమి ఆ రెండు గ్రామాల ప్రజల జీవన కాలం పెరగడానికి ఉపయోగపడటం లేదు. రాష్ట్రం లోని మిగతా గ్రామాలతో పోల్చితే సగటు జీవిత కాలం దాదాపు పదేండ్లకు పైగా తగ్గుతోందని డాక్టర్లు అంటు న్నారు. వేసవి కాలంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటోంది. గ్రామస్తులు ఆందోళన బాట పట్టినప్పుడు వారిని శాంతింప చేయడానికి వస్తున్న అధికారులు, నాయకులు తిరిగి మళ్లీ కనిపించడం లేదు. గ్రామాన్ని తరలించే వరకు స్థానికంగా వసతులు కల్పించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

పునరావాసం కల్పించాలి
కోదాటి తిరుపతి, మాజీ కార్పొరేటర్‌, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌
ఎన్టీపీసీ బూడిదతో గత 40 ఏండ్లుగా కుందనపల్లి, శాలపల్లి గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, రాజకీయ నాయకుల నుంచి మొదలుకుని అందరికీ విజ్ఞప్తి చేశాం. అయినా మా మొర ఎవరు పట్టించు కోవడం లేదు. గ్రామాలను దత్తత తీసుకుని కొన్ని చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా పెద్దగా మార్పు కానరా వడం లేదు. ప్రభుత్వం మా విజ్ఞప్తిని ఆలకించి ఈ రెండు గ్రామాలను వేరే ప్రాంతానికి తరలించి పరిహారం అందించాలి. అప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది.

గ్రామాన్ని తరలించండి
చుట్టూ ఫ్యాక్టరీలు.. మధ్యన మా గ్రామం.. ఎటూ వెళ్లలేని పరిస్థితి. ఎన్టీపీసీ బూడిద పైప్‌లైన్‌ లీకేజి అయినప్పుడల్లా గ్రామం మొత్తం బూడిదతో నిండిపో తోంది. గ్రామానికి చెందిన రిజర్వాయర్‌, స్మశాన వాటికకు వెళ్లే దారిని కూడా ఇటీవల ఎన్టీపీసీ యాజ మాన్యం మూసేసింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగాలు, నొప్పులు, చావులు నిత్యకృ త్యమయ్యాయి. మల్యాలపల్లి గ్రామాన్ని వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలి.
-కత్తరమల్ల మనోహర్‌, మల్యాలపల్లి, రామగుండం మండలం

రోగాలతో బతుకుతున్నాం
తెల్లవారేసరికి పొగమంచును కప్పుకుంటున్నట్టు బూడిద మా గ్రామాన్ని కప్పేస్తున్నది. ఎండా కాలంలో అయితే మరీ ఎక్కువగా ఉంటోంది. ఎన్టీపీసీ బూడిద వెదజల్లే కాలుష్యం వల్ల గ్రామ ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. శ్వాసకోశ, చర్మ, కంటి, కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. బూడితతో నీరు, గాలి, భూమి అంతా విషతుల్యంగా మారింది. ఎన్టీపీసీ అధికారులు మంచినీరు సరఫరా చేస్తున్నా అందులో సైతం బూడిద, ఇతర కాలుష్యం కలుస్తోంది. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయం చూపించాలి.
-ఎత్తినేని రవి, మల్యాలపల్లి, రామగుండం మండలం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -