Thursday, November 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలురైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం

రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమం

- Advertisement -

ఈనెల 26న దేశవ్యాప్త ప్రదర్శనలు
సుంకంలేని పత్తి దిగుమతులతో మన రైతులకు నష్టం
‘కేంద్ర ప్రభుత్వ విధానాలు – వ్యవసాయ రంగంలో సంక్షోభం’పై సదస్సులో ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌
ఎనిమిది రకాల పంటలకు బోనస్‌ ఇవ్వాలి : సాగర్‌
సామినేని, సంక్రాంతి కుటుంబాలకు పరామర్శ

నవతెలంగాణ-వైరాటౌన్‌/చింతకాని
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజ్జూ కృష్ణన్‌ పిలుపు నిచ్చారు. బుధవారం ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ పరిధిలోని లాలాపురం గ్రామంలో తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ”కేంద్ర ప్రభుత్వ విధానాలు – వ్యవసాయ రంగంలో సంక్షోభం” అనే అంశంపై సదస్సు నిర్వహించారు. చింతనిప్పు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ రైతు సదస్సులో విజ్జూ కృష్ణన్‌ మాట్లాడారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం వల్ల సాగుకు రైతులు దూరం అవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ బెదిరింపులకు లొంగిపోయి పత్తిని సుంకం లేకుండా దిగుమతి చేసుకోవడం వల్ల మన దేశ రైతులకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. దాంతో మద్దతు ధర క్వింటాకు రూ.8110 కూడా పొందకుండా అన్యాయం జరుగుతుందని అన్నారు.

మూడు నల్లచట్టాల ఉద్యమం సమయంలో ఆనాడు కేంద్రం రాత పూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 26న దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునిచ్చామని, వాటిని జయప్రదం చేయాలని అన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను అమలు చేయాలని, ఎనిమిది రకాల పంటలకు బోనస్‌ ఇస్తామని చెప్పి నేడు కేవలం సన్న ధాన్యంకు మాత్రమే బోనస్‌ ఇస్తుందని, అది కూడా రబీ సీజన్లో రైతులకు జమ చేయలేదని అన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2025 విద్యుత్‌ సంస్కరణల బిల్లుతో విద్యుత్‌ వ్యవస్థ ప్రయివేటీకరణ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతుందని అన్నారు.

సంక్రాంతి మధుసూదనరావు కుటుంబానికి పరామర్శ
సదస్సు అనంతరం సీపీఐ(ఎం) సీనియర్‌ నాయకులు సంక్రాంతి మధుసూదనరావు కుటుంబాన్ని విజ్జూ కృష్ణన్‌, తీగల సాగర్‌తో కలిసి పరామర్శించారు. సంక్రాంతి మధుసూదన్‌ రావు చిత్రపటానికి పూలమాలలు నివాళులు అర్పించారు. మధుసూదన్‌ రావు భార్య సంక్రాంతి సామ్రాజ్యం, కుమారుడు రవికుమార్‌కు తన ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవితాంతం శ్రమజీవులు, బుడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని కొనియాడారు. ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.

రాజకీయ కక్షతోనే సామినేని హత్య
సామినేని రామారావు హత్య దారుణమైన ఘటన అని, రాజకీయ కక్షతోనే కాంగ్రెస్‌ గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారని ఏఐకేఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌ అన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడు గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) రాష్ట్ర సీనియర్‌ నాయకులు సామినేని రామారావు ఇటీవల హత్యకు గురికాగా ఆయన కుటుంబ సభ్యులను బుధవారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌తో కలిసి విజ్జూ కృష్ణన్‌ పరామర్శించారు. సామినేని రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సామినేని రామారావు భార్య స్వరాజ్యం, కుమారుడు విజయకుమార్‌ను పరామర్శించి ఓదార్చారు. సంఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. తన భర్తను కాంగ్రెస్‌ గూండాలు రాజకీయంగా ఎదుర్కోలేకనే అత్యంత కిరాతకంగా హత్య చేశారని స్వరాజ్యం వివరించారు. ఆనాటి సంఘటన జరిగిన తీరును ఆయనకు సీపీఐ(ఎం) మధిర డివిజన్‌ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు, కుమారుడు విజయకుమార్‌ వివరించారు. అనంతరం విజ్జూ కృష్ణన్‌ మాట్లాడుతూ.. సామినేని రామారావు మృదు స్వభావి అని, రైతు సమస్యలపై సంపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి అని అన్నారు. రైతు సమస్యలపై తాను రామారావుతో కలిసి 2009 నుంచి పనిచేశానని తెలిపారు.

ఆయా కార్యక్రమాల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదినేని రమేష్‌, బొంతు రాంబాబు, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్‌.కె మీరా, వాసిరెడ్డి ప్రసాద్‌, రాయల వెంకటేశ్వరరావు, చింతలచెర్వు కోటేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళపల్లి కృష్ణ, రైతు మహిళ కో కన్వీనర్‌ బొంతు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి రాచబంటి రాము, పార్టీ బోనకల్‌ మండల కార్యదర్శి కిలారు సురేష్‌, తెలంగాణ రైతు సంఘం మధిర డివిజన్‌ కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, పార్టీ సీనియర్‌ నాయకులు కొండ్రు జానకి రామయ్య, వత్సవాయి జానకి రాములు, మునికుంట్ల సుబ్బారావు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -