– ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా సహాయ కార్యదర్శి ఐషీ ఘోష్
– విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి : రామ్మోహన్, ప్రసన్నకుమార్
– భీమవరంలో ముగిసిన రాష్ట్ర విద్యార్థినుల కన్వెన్షన్
భీమవరం (పశ్చిమగోదావరి) : రాష్ట్రంలో టిడిపి కూటమి ప్రభుత్వం పిపిపి విధానం తీసుకొచ్చి మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణకు పూనుకుందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడానికి విద్యార్థి లోకం సన్నద్ధం కావాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా సహాయ కార్యదర్శి ఐషీఘోష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కనీస వసతులు కల్పించలేని పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం సిగ్గుచేటన్నారు. నూతన విద్యా విధానంతో ప్రభుత్వ విద్యారంగం నిర్వీర్యమైపోతోందని, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు నడుం బిగించాల్సిన అవసరం ఉందన్నారు. రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అంబేద్కర్ భవనంలో నిర్వహించిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర విద్యార్థినుల కన్వెన్షన్ శనివారం ముగిసింది. ముఖ్య అతిథిగా ఐషీఘోష్ ప్రారంభోపన్యాసం చేశారు. వైద్యం, వైద్య విద్య ప్రభుత్వ ఆధీనంలో ఉంటే పేద, మధ్యతరగతి విద్యార్థులకు, ప్రజలకు విద్య, వైద్యం అందుతుందని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి మృతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారనడం దారుణమని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. మనుధర్మం పేరుతో విద్యా వ్యవస్థను పూర్తిగా వక్రీకరించే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి.రామ్మోహన్, కె.ప్రసన్నకుమార్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని సంక్షేమ వసతి గృహాలు ఇప్పటికీ కొన్ని అద్దె భవనాల్లోనే ఉన్నాయని, సౌకర్యాలు లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. మెస్‌ఛార్జీలు పెంచి, పౌష్టికాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్.పావని, కో-కన్వీనర్లు జ్యోతి, రాష్ట్ర నేతలు చిన్ని, నవిత, అమూల్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.గణేష్, టి.ప్రసాద్ పాల్గొన్నారు.
విద్యార్థినుల భారీ ప్రదర్శన
రాష్ట్ర విద్యార్థినుల కన్వెన్షన్ ముగింపులో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో భీమవరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రం నలు మూలల నుంచి విచ్చేసిన సుమారు 300 మంది విద్యార్థినులు, విద్యార్థి సంఘ నేతలు ప్రదర్శనలో పాల్గొన్నారు. పాత బస్టాండ్ సెంటర్‌లో ప్రారంభమైన ప్రదర్శన గాంధీ చౌక్, అంబేద్కర్ సెంటర్ మీదుగా ప్రకాశం చౌక్ వరకూ సాగింది. అక్కడ అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఐషీఘోష్, ప్రసన్నకుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీస్ బొమ్మ సెంటర్, అన్నపూర్ణ థియేటర్ రోడ్డు, కొత్త బస్టాండ్ సెంటర్ మీదుగా వీరమ్మ పార్క్ మీదుగా అంబేద్కర్ భవనం వరకు ప్రదర్శన సాగింది.
మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణపై ఉద్యమం
- Advertisement -
- Advertisement -