Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబడ్జెట్లో నిధుల కేటాయింపు పెంపు కోసం ఉద్యమం

బడ్జెట్లో నిధుల కేటాయింపు పెంపు కోసం ఉద్యమం

- Advertisement -

ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్ల సాధనకు పోరాటం
ఆత్మగౌరవం, హక్కుల సాధన కోసం ఆందోళనలు
ఫిబ్రవరి 21-28 వరకు ఎన్పీఆర్డీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు : సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
వికలాంగుల పెన్షన్‌ పెంపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధుల కేటాయింపుల పెంపు కోసం ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఎన్పీఆర్డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.అడివయ్య తెలిపారు. ఎన్పీఆర్డీ 16వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ చిక్కడపల్లిలోని సంఘం రాష్ట్ర కార్యాలయం వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె.వెంకట్‌ ఎన్పీఆర్డీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అడివయ్య మాట్లాడుతూ ఆత్మగౌరవం, హక్కుల సాధన లక్ష్యాలతో 2010 ఫిబ్రవరి 21,22 తేదీల్లో ఎన్పీఆర్డీ ఏర్పడిందని అన్నారు. 2026 ఫిబ్రవరి 21-28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘం ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వికలాంగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే, చట్టాలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎన్పీఆర్డీ పోరాటాలు చేస్తుందని అడివయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా వికలాంగులకు చట్టభద్ధంగా రావాల్సిన హక్కులను సాధించడానికి వికలాంగులను ఐక్యం చేస్తుందని అన్నారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వికలాంగుల చట్టాలు, హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. వికలాంగుల కోసం దేశవ్యాప్తం గా ఉన్న నేషనల్‌ పాలసీ, నేషనల్‌ ట్రస్ట్‌, 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం వంటి వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వికలాంగులకు అమలవుతున్న రిజర్వేషన్స్‌ ఎత్తివేయడానికి కుట్రలు చేస్తుందని అన్నారు. వికలాంగుల సంక్షేమనికి అమలవుతున్న పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల కోత విధిస్తుందని విమర్శించారు. 2026-27 వార్షిక బడ్జెట్లో కేవలం రూ.1,669.72 కోట్లు మాత్రమే కేటాయించిందని అన్నారు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంతో వికలాంగుల చట్టాల అమలు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2012 నుంచి ఇందిరా గాంధీ జాతీయ పెన్షన్‌ పథకానికి నిధుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 49.5 శాతం మందికి ప్రభుత్వ పథకాలు అందడం లేదని అన్నారు. యుడీఐడీ కార్డ్స్‌ జారీ చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. క్రీడల్లో వికలాంగులను భాగస్వామ్యం చేయడానికి వికలాంగుల కోసం ప్రత్యేక క్రీడా పాలసీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ సంస్థల్లో వికలాంగ ఉద్యోగుల పట్ల వివక్షత కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమోషన్లలో రిజర్వేషన్స్‌ అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేట్‌ రంగంలో రిజర్వేషన్స్‌ అమలు చేయడానికి చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దేశ వ్యాప్తంగా 2016 ఆర్పీడబ్ల్యూడీ చట్టం సాధనతో పాటు పెన్షన్‌ పెంపు కోసం ఎన్పీఆర్డీ పోరాడి సాధించిందని గుర్తుచేశారు. కె.వెంకట్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి 26 నెలలవుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. పెన్షన్‌ పెంచకుండా వికలాంగులను మోసం చేస్తుందని తెలిపారు.

బడ్జెట్లో వికలాంగుల సంక్షేమనికి నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఎంపికైన లబ్ధిదారులకు పరికరాలు వెంటనే పంపిణి చేయాలని డిమాండ్‌ చేశారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పించేందుకు అసెంబ్లీలో చట్టం చేయాలని కోరారు. రాష్ట్రంలో వికలాంగులపై దాడులు, దౌర్జన్యాలు, మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరిగిపోతున్న ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలనీ, వికలాంగుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు, గృహ లక్ష్మి, వివాహ ప్రోత్సాహకం, సంక్షేమ పథకాల్లో 5 శాతం రిజర్వేషన్స్‌ కోసం ఎన్పీఆర్డీ పోరాడి సాధించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్పీఆర్డీ రాష్ట్ర కోశాధికారి ఆర్‌. వెంకటేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు రజినీకాంత్‌, ఉపాధ్యక్షులు దామెర కిరణ్‌, ఎన్పీఆర్డీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.శశికల, జె మల్లేష్‌, గ్రేటర్‌ హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, నర్సింగ్‌, ఎస్‌ఎఫ్‌ఐ ఆఫీస్‌ కార్యదర్శి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -