Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంప్రపంచశాంతి కోసం ఉద్యమం

ప్రపంచశాంతి కోసం ఉద్యమం

- Advertisement -

అధిపత్యం కోసం అమెరికా ఆరాటం
అందుకే యుద్ధోన్మాద వాతావరణం
శాంతి సంఘీభావ సదస్సులో వక్తలు
అమరావతి:
అగ్రరాజ్యం అమెరికా సృష్టిస్తున్న యుద్ధోన్మాద చర్యలను వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం ఉద్యమించాలని అఖిలభారత శాంతి సంఘీభావ సంఘం (ఐప్సో) సదస్సులో వక్తలు పిలుపునిచ్చారు. ఎఐపిఎస్‌ఒ జాతీయ కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా ‘అమెరికా యుద్ధోన్మాదం’- ప్రపంచ శాంతి సవాళ్లు’ అనే అంశంపై జాతీయ సదస్సు ఐప్సో జాతీయ అధ్యక్షులు హర్‌చంద్‌భట్‌ సింగ్‌ అధ్యక్షతన విజయవాడలోని ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా శాంతి సంఘం అధ్యక్షులు పల్లబ్‌సేన్‌ గుప్తా మాట్లాడుతూ.. అమెరికా యుద్ధోన్మాద వాతావరణాన్ని సృష్టిస్తూ అనేక దేశాలపై పెత్తనం చెలాయిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్‌ అధ్యక్షులు నెతన్యాహు పాలస్తీనాపై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై నిరంతరంగా జరిపిన దాడిలో 72 వేల మంది ప్రజలు మరణించారని, 10 లక్షల మందికి పైగా గాయాలపాలై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతికి సామ్రాజ్యవాదం ఎలాంటి విఘాతాన్ని కల్గిస్తుందో ఇటీవల వెనిజులా అధ్యక్షులు మదురొను, అతని భార్యను ఎత్తుకెళ్లడం ఉదాహరణ అని వివరించారు. ఐప్సో ప్రధాన కార్యదర్శి ఆర్‌ అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. గాజాలో నెలకొన్న యుద్ధ వాతావరణం పాఠశాలల్లో పాఠాలు వినకముందే యుద్ధం నుంచి ఎలా బయటపడాలో పిల్లలు అక్కడ నేర్చుకుంటున్నారని తెలిపారు. మనిషి, మనిషి కలిసి మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతామనే వయసులో మరో మనిషితో పోరాడితేనే బతుకనే దుర్మార్గపు వాస్తవాన్ని గాజాలో నేర్చుకుంటున్నారని చెప్పారు. మనం కోరుకుంటున్న సమాజం ఇది కాదని, రాబోయే తరాలకు మనం ఇవ్వాల్సిన ప్రపంచం ఇలాంటిది కాదన్నారు. పాలస్తీనా, గాజాలో విమానాల శబ్దాలు, బాంబుల మోతే పిల్లలకు వినపడుతుందని, ఇజ్రాయిల్‌ చేసిన నరసంహరంలో 22 వేల మంది పిల్లలు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచంలో యుద్ధాల సంఖ్య పెరుగుతోందని, 2024లో 61 చోట్ల, 2025లో 72 చోట్ల యుద్ధాలు జరిగాయని తెలిపారు. అమెరికా తన అధిపత్యాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టుకొని చెలాయించాలని చూస్తోందన్నారు. సోషలిస్టు దేశాలుగా ఉన్న క్యూబా, చైనాతో పాటు వెనిజులా, ఇరాన్‌, రష్యా.. అమెరికా అధిపత్యానికి అడ్డుగా ఉన్నాయని తెలిపారు. ఈ దేశాలన్నింటినీ బలహీనపరిచి ప్రభుత్వాలను కూలదోయాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు. అమెరికాకు భారత్‌ అనుకూలమైన విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తే ప్రపంచ దేశాలు, ప్రజానీకం ముందు అపహాస్యం కాబడతామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిమితవాదులంతా ఏకమవుతూ ప్రపంచాన్ని ఉన్మాదం వైపు తీసుకెళ్తూ పీడిత ప్రజలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. మానవాళి భవిష్యత్తు బతికి ఉండాలంటే అభ్యుదయం దిశగా, పురోగమి వైపునకు మారాలనే చైతన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. భారత్‌ విదేశాంగ విధానాన్ని ఎండగడుతూ అమెరికా సామ్రాజ్యవాదం, దానికి అనుకూలంగా ఉన్న ప్రతి వ్యక్తి, శక్తిని ఎండగడితేనే శాంతి ఉద్యమాన్ని బలపరుస్తామన్నారు. జనవరి 3వ తేదీన మదురొ, అతని భార్యను అమెరికా ఎత్తుకెళ్లినందుకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి నెలా 3వ తేదీన పెద్దయెత్తున నిరసన సభలు నిర్వహిస్తున్నారని, ఈ కార్యక్రమం ఢిల్లీతో పాటు మిగిలిన చోట్ల కూడా జరపాలని కోరారు. ఐప్సో సలహాదారు యాదవరెడ్డి మాట్లాడుతూ.. యుద్ధాలకు వ్యతిరేకంగా సెక్యులర్‌ పార్టీలు కలిసి పోరాడాలని కోరారు. యుద్ధాలకు వ్యతిరేకంగా ఉండే రాజకీయ పార్టీలను కలుపుకోవాలని కోరారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమెరికా కార్పొరేట్లు ప్రపంచ అధిపత్యం కోసం జరుపుతున్న యుద్ధానికి ప్రతినిధిగా ఉన్న ట్రంప్‌ బరితెగించి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిక్స్‌ దేశాలు ఇతర దేశాలను కలుపుకొని దీనికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు. భారత్‌పై ట్రంప్‌ జరుపుతున్న దాడిని మోడీ ఖండించకుండా వ్యూహాత్మక లొంగుబాటు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. ప్రపంచ శాంతికోసం, యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా, అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కొల్లగొట్టేందుకు సామ్రాజ్యవాద దేశం.. మరోదేశంపై దాడి జరుపుతోందన్నారు. అమెరికా మన దేశంపై పెద్దయెత్తున దాడి చేస్తున్నా నరేంద్ర మోడీ నోరుమెదపడం లేదన్నారు. యుద్ధానికి వ్యతిరేకంగా, ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులను ఐక్యం చేసి శాంతి ఉద్యమం కోసం పెద్దయెత్తున పోరాటం చేయాలని కోరారు. వైసిపి నాయకులు నారాయణ మూర్తి మాట్లాడుతూ.. మానవాళిపై జరుగుతున్న దాడిని ఖండించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐప్సో రాష్ట్ర కన్వీనర్లు ఎన్‌ సతీష్‌ కుమార్‌, ఎం సుబ్బారావు, సంఘం నాయకులు వై వెంకటేశ్వరరావు, మనోహర్‌ నాయుడు, డి రమాదేవి, అక్కినేని వనజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -