నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానించాలి : సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదనీ, ఆ విధానాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని సీఐటీయూ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ హెచ్చరించాయి. మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశాయి. శుక్రవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో ఆ సంఘాలు సంయుక్త సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె అంచనాలకు మించి జరిగిందని ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల లక్షలాది మంది కార్మికులు, శ్రామికులు తమ అసంతృప్తినీ, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని వారు గుర్తు చేశారు. సమ్మెను జయప్రదం చేసిన అన్ని సంఘాలకు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి. వెంకట్ మాట్లాడుతూ సార్వత్రిక సమ్మె ద్వారా కార్మికవర్గం, శ్రామికులు చేసిన హెచ్చరికను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇప్పటికైనా నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే కార్మిక, ప్రజా వ్యతిరేక చట్టాలను వారు ధిక్కరిస్తారని హెచ్చరించారు. 78 ఏండ్ల స్వాతంత్య్ర ఫలాలను ప్రజలకు అందించటానికి, దేశ ఆర్థిక స్వావలంబన, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలకు కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. అమెరికాతో మితృత్వం పేరుతో మోడీ భారతదేశాన్ని విధ్వంసం వైపు నడిపిస్తూ, లొంగుబాటు వైఖరిని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. దేశ ప్రజల్ని శత్రువుల్లా చూస్తున్నారనీ, అందుకే ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని అన్నారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాలు స్వతంత్రంగానూ, సంయుక్తంగానూ పోరాటాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నాయని తెలిపారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిజ్ఞా దినంగా జరపనున్నట్టు తెలిపారు.
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్‌లను రాష్ట్రంలో అమలు చేయబోమంటూ శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఆ లేబర్ కోడ్‌లను అమలు చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. రాబోయే రోజుల్లో నాలుగు లేబర్ కోడ్‌లు రద్దయ్యే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ మాట్లాడుతూ రైతు విత్తన చట్టం, విద్యుత్ సవరణ చట్టం- 2025 అమలు చేయటం వల్ల రాష్ట్రంలోని రైతాంగానికి కలిగే నష్టంతో పాటు యావత్ ప్రజలకు తీవ్ర హాని కలగనున్నదని తెలిపారు. దేశంలో అమలు జరుపుతున్న వ్యవసాయ విధానాల వల్ల వ్యవసాయ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం పెరగనున్నదని హెచ్చరించారు.
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్రాములు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని మార్చి ‘వీబీ జీఆర్‌ఏఎమ్‌జీ’ ని అమలు చేయటం వల్ల వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పన మరింత క్షీణిస్తుందని చెప్పారు. దీని ప్రభావం కొనుగోలు శక్తిపై తీవ్రంగా పడుతుందనీ, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు రద్దయ్యే వరకు ఉద్యమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



