నవతెలంగాణ – ఆలేరు
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. సిట్ పిలుస్తుందని తెలిసిన వెంటనే హరీష్ రావు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లారని ఆరోపించారు. సిట్ విచారణను పక్కదారి పట్టించే విధంగా హరీష్ రావు వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. సిట్ విచారణలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియకుండా ట్రిక్స్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సింగరేణి కాంట్రాక్టులు కట్టబెట్టారని హరీష్ రావు, కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అయితే సృజన్ రెడ్డి బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డికి స్వయానా అల్లుడని గుర్తు చేశారు. సృజన్ రెడ్డి తనకు దూరపు చుట్టమని రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని, ‘‘నా అల్లుడిని ఎందుకు బద్నాం చేస్తున్నారు’’ అంటూ కందాల ఉపేందర్ రెడ్డి గతంలోనే ప్రశ్నించారని పేర్కొన్నారు.
బిఆర్ఎస్ హయాంలోనే సృజన్ రెడ్డి, ప్రతిమ శ్రీనివాస్ రావు, హర్ష, సుధాకర్ రెడ్డిలకు కాంట్రాక్టులు ఇచ్చారని వెల్లడించారు. కేటీఆర్, హరీష్ రావు బంధువులకు కూడా బిఆర్ఎస్ పాలనలో సింగరేణి కాంట్రాక్టులు ఇచ్చారని ఆరోపించారు.‘‘రేవంత్ రెడ్డికి మీలా దోచుకోవాలనే ఆలోచన లేదు’’ అని వ్యాఖ్యానించారు. స్వంత ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేశారని స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్‌లో ఏం జరిగిందో తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని, అందుకే సిట్ దర్యాప్తు కొనసాగుతోందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మీ కుటుంబ సభ్యురాలే చెప్పిందని విమర్శించారు. సింగరేణి, హిల్ట్, టీడీఆర్ కుంభకోణం అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజంగా దర్యాప్తు కావాలంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరూ కలిసి ప్రభుత్వానికి లేఖ రాయాలని సూచించారు. తాను లోక్‌సభ సభ్యుడిగా సింగరేణిలో నిజానిజాలు తేలాలని లేఖ రాస్తానని తెలిపారు.
కిషన్ రెడ్డికి, కేటీఆర్, హరీష్ రావులకు మంచి సంబంధాలున్నాయని, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వారి బావ, బామ్మర్దులు ఇద్దరూ లేఖ రాయాలని సవాల్ విసిరారు. 2014 నుంచి 2026 వరకు సింగరేణిలో ఏం జరిగిందో కేంద్ర ప్రభుత్వం విచారించాలని డిమాండ్ చేశారు. హిల్ట్ పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కేవలం చర్చ మాత్రమే చేసిందని, అందులో ఒక్క రూపాయి అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. హిల్ట్‌లో ఐదు లక్షల కోట్ల అవినీతి అంటూ కేటీఆర్, హరీష్ రావు హడావుడి చేస్తున్నారని ఆరోపించారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అధికార దుర్వినియోగం బయటపడుతుండడంతో కేటీఆర్, హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారని చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.



