– రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు స్థానికంగా ఓటుండాలి
– హైకోర్టు ఉత్తర్వుల అమలుకు ఎన్నికల సంఘం నిర్ణయం
– ఎక్స్ అఫీషియో ఓటుపై సర్క్యులర్ జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మున్సిపల్ పరోక్ష ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సర్క్యూలర్ జారీ చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో సభ్యులుగా తమ పేరు నమోదు చేసుకునేందుకు గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. లోక్‌సభ, శాసనసభ సభ్యులు మున్సిపల్ చైర్మెన్, మేయర్ ఎన్నికల్లో తమ నియోజకవర్గం పరిధిలోని ఏదైనా ఒక మున్సిపాల్టీలో మాత్రమే ఓటు వేసేందుకు అర్హులు. తాము ఓటు వేయాలనుకున్న కార్పొరేషన్, మున్సిపాల్టీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకుని ఉండాలి. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు మాత్రం స్థానికంగా ఓటు హక్కు కలిగి ఉండటం తప్పనిసరని స్పష్టం చేసింది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కాకపోతే ఎక్స్ అఫీషియో సభ్యులుగా వారు అనర్హులని పేర్కొంది. గతంలో రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు రాష్ట్రంలో తమకు నచ్చిన మున్సిపాల్టీని ఎంచుకుని ఎక్స్ అఫీషియో ఓటు వేసే అవకాశం ఉండేది. స్థానిక ఓటు లేకుండా ఇతర ప్రాంతాల్లో ఓటు వేయడం నిబంధనలకు విరుద్ధమని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ పరిధిలో ఓటరుగా నమోదు కానివారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా కొనసాగడానికి అనర్హులు. నిబంధనలకు విరుద్ధంగా అర్హత లేకుండా వేసే ఓట్లు చెల్లవని ఎస్‌ఈసీ పేర్కొంది. తెలంగాణ మున్సిపాల్టీస్ చట్టం-2019 ప్రకారం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత మేయర్, చైర్మెన్ పీఠాలను దక్కించుకోవడంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకంగా మారుతుంటాయి. హంగ్ ఏర్పడిన చోట ఈ ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తాయి. తాజా నిబంధనలతో స్థానిక ఓటు లేని ప్రజాప్రతినిధులు తమ ఓటును వినియోగించుకోలేరు.
రేపే పరోక్ష ఎన్నికలు
మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఫిబ్రవరి 16న (సోమవారం) మధ్యాహ్నం 12.30కి ప్రత్యేక సమావేశం ప్రారంభమవుతుంది. ముందుగా వార్డు సభ్యులు, కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ల ఎన్నిక జరుగుతుంది. చేతులెత్తే విధానం ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహిస్తారు.
కాంగ్రెస్‌కు 39.08, బీఆర్‌ఎస్‌కు 28.75 శాతం ఓట్లు వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం
రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,983 వార్డులకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 52,17,413 మంది ఓట్లకు గాను 38,09,406 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 50 శాతానికి పైగా వార్డుల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనబర్చింది. పర్సంటేజీ పరంగానూ ఆ పార్టీ ముందు వరసలో నిలిచింది. మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు నమోదయ్యాయో ఎన్నికల అధికారులు శనివారం వెల్లడించారు.
కాంగ్రెస్‌కు 39.08 శాతం, బీఆర్‌ఎస్‌కు 28.75, బీజేపీకి 15.67, స్వతంత్రులు 8.307 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎంఐఎంకు 3.28 శాతం, ఫార్వర్డ్ బ్లాక్‌కు 1.5 శాతం, సీపీఐకి 1.308 శాతం, సీపీఎంకు 0.585శాతం, జనసేనకు 0.3 శాతం ఓట్లు నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.



