Thursday, November 6, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం'పత్తి' పరిమితిపై ఎంపీ ఇంటి ముట్టడి

‘పత్తి’ పరిమితిపై ఎంపీ ఇంటి ముట్టడి

- Advertisement -

– పోలీసులు, బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య తోపులాట
– అమెరికా నుంచి దిగుమతుల కోసమే నిబంధనలు : జోగు రామన్న
– నిబంధనలు ఎత్తేయాలని డిమాండ్‌
నవతెలంగాణ-ఆదిలాబాద్‌టౌన్‌

పత్తి కొనుగోళ్లలో ఏడు క్వింటాళ్ల పరిమితిని ఎత్తేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఎంపీ గొడెం నగేష్‌ ఇంటిని ముట్టడించారు. మాజీ మంత్రి జోగు రామన్న నాయకత్వంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఎంపీ ఇంటి ముట్టడికి యత్నించారు. పోలీసులు ముందస్తుగా ఎంపీ ఇంటి నలుమూలల బారికేడ్లు ఏర్పాటు చేశారు. బీఆర్‌ఎస్‌ శ్రేణులు వాటిని తోసుకుంటూ వెళ్లి ఎంపీ ఇంటి ముందు బైటాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అదుపు చేయడానికి యత్నించే క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి, సీఐలు మాజీ మంత్రి జోగు రామన్నతోపాటు నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారిని అడ్డు తొలగించి జోగు రామన్నను రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై వదిలిపెట్టారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. తేమతో సంబంధం లేకుండా పత్తి, సోయా కొనుగోళ్లు చేపట్టాలని అనేక వినతులు ఇచ్చామన్నారు. గత నెల 24న పత్తి మార్కెట్‌ ప్రారంభమైందని, అదే రోజు 600పైగా పంట వాహనాలు వచ్చాయని తెలిపారు. అందులో 5 బండ్లకు మాత్రమే తేమ 12 శాతం వచ్చిందన్నారు. గతంలో బీఆర్‌ఎస్‌ హయాంలో సీసీఐ అధికారులు ఇదే నిబంధన పెడితే వారిపై ఒత్తిడి పెంచి 18 నుంచి 20 శాతం తేమ వచ్చినా పంట కొనుగోలు చేయించామని తెలిపారు. సీసీఐ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ, ఎమ్మెల్యేలు రైతులకు మద్దతుగా ఉండాల్సిందిపోయి సీసీఐ నిబంధనలను సమర్థించడం సరికాదన్నారు. పత్తి కొనుగోళ్లలో ఏడు క్వింటాళ్ల పరిమితిని విధించడంతో రైతులు నష్టపోతారన్నారు.
ఈ నిబంధనలు కేవలం అమెరికా పత్తిని ఇక్కడికి దిగుమతి చేసుకోవడం కోసమే పెట్టారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల నడ్డివిరిచేలా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నామ్‌ కే వస్తేగా కొన్ని సోయా కాంటాలు ప్రారంభించారని, కొనుగోళ్లు మాత్రం చేయడం లేదని అన్నారు. రైతులు పండించిన పంటలను ఎలాంటి తేమ లేకుండా ప్రభుత్వాలే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రమేశ్‌, నారాయణ, అజరు, రమేశ్‌, పవన్‌ నాయక్‌, ప్రకాశ్‌, ప్రశాంత్‌, తిరుపతి, సెవ్వ జగదీష్‌, కుమ్ర రాజు, ధమ్మపాల్‌, దాసరి రమేష్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -