రిపబ్లిక్ దినోత్సవం నడిజామువేళ… దక్షిణ కోల్‌కతా సరిహద్దులోని నజీరాబాద్ ఆనందపూర్ గోదాముల సముదాయంలో కార్మికులు సజీవ దహనమైపోతున్న విషాదకాండ దేశాన్ని కలచివేసింది. మృత దేహాలను వెలికితీసే పని పూర్తికావడంతో జనవరి 29 నాటికి ఈ మృతుల సంఖ్య 21కి చేరింది. మీడియాలో వచ్చే తాజా సమాచారాల ప్రకారమైతే మృతుల సంఖ్య కనీసం 31కి పెరిగింది. నిజానికి మొదట చెప్పింది కావాలని తగ్గించిన సంఖ్య. ఎందుకంటే జనవరి 29కే ఇంకా 28మంది ఆచూకీ తెలియవలసి వుండింది. ఏదో తాత్కాలిక గుడారంలా ఉపయోగిస్తున్న ఆ గోదామును చుట్టుముట్టిన మంటలు చాలా భయానకమైనవి. బెంగాల్ రాష్ట్రం ఇరుగు పొరుగు జిల్లాల నుంచి తీసుకువచ్చిన వలస కార్మికులను ఆ గోదాములో బయటి నుంచి తాళాలు వేసి వుంచారన్న వార్త ఈ ఘటనలోని నేరస్త కోణాన్ని బయటికి తెచ్చింది. ఆ రాత్రి వారు గాఢ నిద్రలో వుండటంతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై మరణించారు. ఏ విధంగానూ బయటికొచ్చే మార్గం లేకపోయింది. వారు దేశంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ‘వావ్ మోమో’ స్నాక్స్‌ను తయారు చేసే కార్మికులు.
ఆధునిక కాలంలో కొనసాగుతున్న భయానక బానిసత్వం ఏమిటో ఈ ఘటన కళ్లకు కట్టింది. అలాంటి బ్రాండ్ల వెనక ఎంత ఘోరమైన దోపిడీ దాగివుందీ తెలుస్తుంది. ఇవి కేవలం ప్రమాదవశాన సంభవించిన మరణాలు కావని గ్రహించడం అవసరం. అంతులేని లాభాల కోసం పాకులాడే అమానవీయ పద్ధతుల కారణంగా పాతుకుపోయిన ఒక హంతక వ్యవస్థకు ఈ ప్రాణాలు బలైనాయి. ఎన్ని గంటలు పని చేయించాలి? అదనపు గంటలకు ఓవర్‌టైమ్ ఎంత చెల్లించాలి? కార్మికులు సంఘంగా ఏర్పడే హక్కులు ఇలాంటివేమీ అనుమతించ కుండా కార్మికులకు సామాజిక భద్రతను నిరాకరించే వ్యవస్థ అది. ఇఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రాథమిక కార్మిక హక్కులను కూడా వారికి లేకుండా చేస్తున్నారు. వారి కుటుంబాలకు చెప్పుకోదగిన ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేవు. మిఠాయి దుకాణాల వంటి వాస్తవాలలో బతికే అసంఘటిత కార్మికుల విషయంలోనూ ఇదే నిజం వర్తిస్తుంది. అగ్నిమాపక యంత్రాలు గానీ,అత్యవసర ద్వారాలు గానీ లేకుండా కనీసమైన గాలి, వెలుతురు సోకకుండా వారు పనిలో మగ్గిపోతుండాలి.
ఆద్యంతం నిర్లక్ష్యమే
ఈ విషాదం తీవ్రత ఇంతటితోనే ముగిసిపోలేదు. ఘోరానికి కారకులైన నేరస్తులను బోనెక్కించేందుకు అధికారులు చిటికెన వేలు కూడా కదల్చలేదు. చెప్పుకోదగినన్ని రోజులు గడిచినా సరే యజమా నులను అరెస్టు చేయలేదు. ప్రమాద స్థలాన్ని సందర్శించే అవకాశం లేకుండా మూసివేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కూడా విషాదం వాస్తవాలు బయటికి రాకుండా తొక్కిపట్టేందుకు తన వంతు దోహదం చేసింది. కార్పొరేట్లు పర్యావరణ నిబంధనలను ఇష్టారీతిన ఉల్లంఘించడంలో…టిఎంసి రాష్ట్ర ప్రభుత్వం…వారితో కుమ్మక్కు అవుతుందనేది నిస్సందేహం. భూగర్భంలో చెత్త నిల్వ స్థలాలు, అంతర్జాతీయ ప్రాధాన్యత గల మాగాణి భూముల ఆక్రమణలు కూడా ఈ విషాదానికి ఎంతగానో కారణమైనాయి. మరోవైపున రాష్ట్ర కార్మికశాఖ కూడా తప్పనిసరిగా జరపాల్సిన తనిఖీలను,అగ్నిమాపక ఏర్పాట్లనూ పర్యవేక్షించకుండా నేరపూరిత నిర్లక్ష్యం వహించింది. ఈ వ్యవస్థాగత హత్యలకు రాష్ట్ర కార్మికశాఖ కూడా బాధ్యత వహించాల్సి వుంటుంది.
సిజెఐ వ్యాఖ్యల్లో వాస్తవమెంత?
ఏమైనా అలాంటి దారుణమైన పని పరిస్థితులు పశ్చిమ బెంగాల్‌కే పరిమితమని అనుకోవడం పూర్తిగా తప్పే. అలాంటి పని పరిస్థితులు, వృత్తిపరమైన ఆరోగ్యం ఘోరంగా వుండటం దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా వుంటుంది. ఏదైనా చెల్లిపోతుందనే వాతావరణంతో పాటు కార్మికుల భద్రత పట్ల ప్రతికూల భావన కూడా అల్లుకుపోయింది. ఇది అతి పెద్ద వర్గ సమస్య. కార్మికుల పట్ల ఈ ప్రతికూల భావన మరింత పెంచడం కోసం అన్నట్టు మాట్లాడారు భారత ప్రధాన న్యాయమూర్తి. అది కూడా సుప్రీంకోర్టులోనే. పెన్ తొఝిలాలర్ సంఘం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంలో ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ”నిజంగా దేశంలో ట్రేడ్ యూనియన్ల కారణంగా ఎన్ని పారిశ్రామిక సంస్థలు మూతపడ్డాయి? ఒక్కసారి వాస్తవాలు చూద్దాం. సంప్రదాయికంగా వస్తున్న పరిశ్రమలు ఈ జండా యూనియన్ల కారణంగా దేశవ్యాపితంగా ఎన్ని మూతపడ్డాయి? వాళ్లకు పని వుండకూడదు. ఈ ట్రేడ్ యూనియన్ నాయకులు…వారే… దేశంలో పారిశ్రామికాభివృద్ధి ఆగిపోవడానికి చాలా వరకూ కారణం.”
చాలా పరుషమైన మాటలు. స్పష్టమైన మాటలు. దేశం మొత్తం మీద నెలకొన్న కార్మిక వ్యతిరేక వాతావరణాన్ని కళ్లకు కట్టే మాటలు. ఆ పేద వలస కార్మికులు ‘వావ్ మోమో’ వంటి కార్ఖానాల్లో బిచ్చాన్ని తలపించే వేతన కూలీతో, మృత్యు సన్నిధిని తలపించే పని పరిస్థితులలో గొడ్డుచాకిరిలో మగ్గిపోతున్నారంటే ”పని చేయవద్దనుకోవడం” వల్లనేనా? జస్టిస్ సూర్యకాంత్ తన వర్గపరమైన వ్యతిరేకతతో మాట్లాడారని చెప్పవలసి రావడం విచారకరం. ఆయన మాటల్లో వ్యక్తమైన వ్యతిరేక భావన వాస్తవాలను చూడకుండా కళ్లు కప్పేసింది. ”భారత దేశంలో పారిశ్రామిక వివాదాలు, మూసివేతలు, తొలగింపులు, లే ఆఫ్‌ల”పై లేబర్ బ్యూరో నివేదికలు చూస్తే పారిశ్రామిక మాంద్యానికి వాస్తవమైన కారణమేమిటో అత్యంత సమగ్రంగా చెబుతాయి. దేశంలో పారిశ్రామిక వివాదాలు గణనీయంగా తగ్గిపోయాయనీ, 2023లో వరుసగా 17వ ఏడాది తక్కువగా నమోదైనాయని ఆ బ్యూరో నివేదిక చెబుతున్నది.
2023 సెప్టెంబరులో కేవలం ముప్పై వివాదాలు మాత్రమే నివేదించ బడ్డాయి.ఇది 2006కు పూర్తి భిన్నమైన పరిస్థితి. అప్పుడు అత్యధికంగా 432 పారిశ్రామిక వివాదాలు నమోదైనాయి. తర్వాత 2008లో 421, 2007లో 389 నమోదైనాయి. మరోవైపున చట్టబద్దంగానూ విరుద్ధంగానూ సాగుతున్న పరిశ్రమల మూసివేతలు యూనియన్లనేవి చాలా తక్కువగా వున్న, బలహీనంగా కనిపిస్తున్న రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువగా వున్నాయని విదితమవుతుంది. విలీనాలు, మార్పిళ్లు, రద్దుల వల్ల గత అయిదేళ్లలో 2,04,268 ప్రయివేటు కంపెనీలు మూతపడినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలియజేయడం ఆసక్తికరం. లేదంటే 2013 కంపెనీల చట్టం కింద ప్రతిష్టంభనలో చిక్కాయి. అంతేగాక భారతీయ పరిశ్రమల ప్రతిష్టంభన, దివాళా బోర్డు లెక్కలు చూసినా, ప్రభుత్వ రంగ బ్యాంకులు రాబట్టగలిగిన బకాయిల శాతం చూసినా ఈ మూసివేతలకు కారణాలు బాగా తెలుస్తాయి.
సంక్షోభం అసలు కారణాలు
అందువల్ల సిజెఐ మాటలు పూర్తిగా పొరబాటు దిశలో వున్నాయి. మూసివేతను రుద్దుతున్నది ట్రేడ్ యూనియన్ల వల్ల ఉత్పన్నమైన పారిశ్రామిక వివాదాలు కాదు. వాస్తవం అందుకు పూర్తి భిన్నం. ప్రస్తుత నయా ఉదారవాద వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థలో మితిమీరిన కేంద్రీకరణ, ద్రవ్యీకరణ వల్ల ఉత్పన్నమైన అంతర్గత సంక్షోభమే ఇందుకు దారితీస్తున్నది. చిన్న మధ్యతరహా పరిశ్రమల (ఎం.ఎస్.ఎం.ఇ) రంగాన్ని, ఉత్పాదక రంగాన్ని అది మరింత దారుణంగా దెబ్బతీస్తున్నది. ఇవన్నీ కలిసే ప్రస్తుత మూసివేతలకు దారితీస్తున్నాయి. పారిశ్రామిక రంగ సంక్షోభానికి కారణాలేమిటో ఇటీవలి ఆర్థిక సర్వే, అలాగే బడ్జెట్ సమీక్ష, మందస్తు అంచనాలు కూడా నొక్కి చెప్పాయి. ఆర్థిక వ్యవస్థలో స్థూల గిరాకీ లేకపోవడమే పరిశ్రమలు నడవలేని పరిస్థితిని సృష్టిస్తున్నది. తీవ్ర అసమానతలు, ఉద్యోగ రహిత అభివృద్ధి నమూనా వల్ల శ్రామికశక్తి నిస్పృహపాలు అవుతున్నది. ఈ విషాద పరిస్థితికి ప్రతిబింబమే ఆనందపూర్ ఘోరం.
అధికార వర్గం ఈ వాస్తవాన్ని గుర్తించే బదులు సమిష్టి నిరసనలు, బేరసారాలు లేకుండా చేయాలని, సామాజిక భద్రత వల్ల లభించే రక్షణలను తొలగించాలని ప్రయత్నాలు పెంచుతున్నది. వాస్తవానికి దీనికి ప్రతిశక్తిగా న్యాయవ్యవస్థ ముందుకు రావడానికి ఇంతకంటే మంచి సందర్భం వుండదు. రాజ్యాంగం 19(1)(సి) ప్రకారం పౌరులకున్న సభ సంఘ స్వాతంత్య్ర హక్కుల మేరకు కార్మికులు నిరసన తెలిపే ప్రాథమిక హక్కును కాపాడేందుకు న్యాయవ్యవస్థ అధికారికంగా ముందుకు రావలసిన సందర్భం. లేబర్‌కోడ్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడటంతో తాసు కార్మికులకు మరింత వ్యతిరేకంగా మారుతున్నది. కార్పొరేట్లకు సుఖవంతమైన పరిస్థితిని సృష్టించే పోకడ మరింత వేగం పుంజుకుంటున్నది. ఏ విధమైన సమిష్టి నిరసనలు, బేరసారాలకు అవకాశమే లేకుండా పూర్తిగా తొలగిస్తున్నది. కార్మికులకు గౌరవ ప్రదమైన మనుగడ లేకుండా చేసి పురుగుల్లా చావమని తోసేస్తామా అన్నదే ఇక్కడ ప్రశ్న.
(ఫిబ్రవరి 4 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)
సిజెఐ గారూ… కార్మికులు పురుగుల్లా చావాలా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



