Sunday, March 1, 2026
E-PAPER
Homeసోపతిప్రజలలో స్పూర్తి నింపిన చిత్రం 'మిసెస్‌ మినీవర్‌'

ప్రజలలో స్పూర్తి నింపిన చిత్రం ‘మిసెస్‌ మినీవర్‌’

- Advertisement -

కొన్ని పాత సినిమాల గురించి చదివి వాటిని చూసినప్పుడు అవి అంత గొప్ప సినిమాలుగా ఎలా పేరు పొందాయా అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గొప్ప మేధావులు, ప్రజానాయకుల ప్రశంసలు పొందిన చిత్రాలుగా వాటిని చూస్తుంటే నేటి తరానికి ఆశ్చర్యం వేస్తుంది. కాని ఆ నాటి, ఆ దేశ రాజకీయ, సామాజిక, పరిస్థితులు, ఆ కాలంలోని ప్రజా జీవితం, సాంస్కతిక చైత్యనం, ప్రజల దష్టిని, మేధను అంటిపెట్టుకుని ఉండి ఓ కళారూపానికి ఆ తరాన్ని కనెక్ట్‌ చేస్తాయి. కాలంతో పాటు పరిస్థితులు మారడం, తరవాతి తరాల సామాజిక జీవితం భిన్నంగా ఉండడంతో అవే కళారూపాలు మొదటి తరాన్ని ప్రభావితం చేసినంతగా ఇప్పటి తరాన్ని చేయకపోవచ్చు. ఇది సినిమా విషయంలో మరీ ఎక్కువగా గ్రహింపు కొస్తుంది. కొన్ని సినిమాలు ఎన్ని తరాలు మారినా ప్రామాణికంగా నిలిచి ఉంటే కొన్ని ఆ నాటి కాలమాన, సామాజిక రాజకీయ ప్రజా జీవితపు రికార్డుగా నిలిచిపోతాయి. అలాంటి ఓ చిత్రం 1942లో వచ్చిన ‘మిసెస్‌ మినీవర్‌’

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో వచ్చిన ఈ సినిమా ఆ నాటి యుద్ధ వాతావరణాన్ని, మధ్యతరగతి సమాజం ఎదుర్కున్న పరిస్థితులను చూపిస్తుంది. ఇది ఎంతగా ఆనాటి యూరోప్‌ వాసులను కదిలించిందంటే ‘మిసెస్‌ మినీవర్‌’ను మిత్రరాజ్యాల అనుకూల యుద్ధ ప్రచారానికి ఒక స్మారక చిత్రంగా అప్పటి బ్రిటన్‌ ప్రధాన మంత్రి విన్‌స్టన్‌ చర్చిల్‌ భావించారు. ఐరోపాలో యుద్ధానికి మద్దతు ఇవ్వడం వైపు అమెరికన్‌ ప్రజాభిప్రాయాన్ని మళ్ళించడంలో ఇది కీలక పాత్ర పోషించిందని ఆయన విశ్వసించారు.
1940లో ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్‌లోకి ప్రవేశించినప్పటికి, యునైటెడ్‌ స్టేట్స్‌ యుద్ధం విషయంలో ఇంకా తటస్థంగానే ఉంది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే రాసిన చాలా నెలల తర్వాత, అమెరికా యుద్ధానికి సిద్దమయింది. అందుకని అమెరికన్‌ ప్రజలకు యుద్ధం పట్ల మరింత వాస్తవిక దక్పథాన్ని ప్రతిబింబించేలా సన్నివేశాలు తిరిగి రాయబడ్డాయి. పెర్ల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి ఖూను యుద్ధంలోకి తీసుకువచ్చిన తరువాత, కొన్ని సీన్లను మళ్లీ మార్చి రాసారు.
పెర్ల్‌ హార్బర్‌ సంఘటనకు కొంతకాలం తర్వాత విడుదలైన ఈ చిత్రం యూరోపియన్‌ యుద్ధాన్ని సందేహాస్పద అమెరికన్‌ ప్రేక్షకులకు వివరించడంలో కీలకమైనది. విల్కాక్సన్‌, దర్శకుడు విలియం వైలర్‌ చిత్రంలో సగం కూలిన చర్చ్‌లో ఫాధర్‌ ఇచ్చే కీలకమైన ఆఖరి ప్రసంగ సన్నివేశాన్ని చిత్రీకరించే ముందు రాత్రి ఆ సీన్‌ మళ్ళీ తిరగరాసుకున్నారు. ఈ ప్రసంగం ఎంత ప్రభావాన్ని చూపిందంటే, అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ దీనిని ప్రజలలోనూ, సైనికులలోనూ నైతిక బలాన్ని పెంపొందించే శక్తిగా ఉపయోగించారు. దానిలో కొంత భాగాన్ని వివిధ భాషలలో ముద్రించిన కరపత్రాలకు ఆధారంగా చేసుకుని శత్రువు ఆక్రమిత భూభాగంపై వెదజల్లారు. ప్రచార ప్రయోజనాల కోసం ఈ చిత్రాన్ని థియేటర్లకు తరలించాలని రూజ్‌వెల్ట్‌ ఆదేశించారు. ప్రసంగ సంభాషణను టైమ్‌ అండ్‌ లుక్‌ మ్యాగజైన్‌లలో తిరిగి ముద్రించారు. యుద్ద సమయంలో బ్రిటిష్‌, అమెరికన్‌ ప్రేక్షకులలో ధైర్యాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడింది.

‘మిసెస్‌ మినీవర్‌’ నిజానికి అమెరికన్‌ రొమాంటిక్‌ వార్‌ డ్రామా చిత్రం. దీనికి విలియం వైలర్‌ దర్శకత్వం వహించారు ముఖ్య పాత్రలలో అప్పటి ప్రముఖ నటులు గ్రీర్‌ గార్సన్‌, వాల్టర్‌ పిడ్జియన్‌ నటించారు. జాన్‌ స్ట్రూథర్‌ రాసిన 1940 నవల ”మిసెస్‌ మినివర్‌” ఈ సినిమాకు ఆధారం. గ్రామీణ ఇంగ్లాండ్‌లోని ఒక మధ్యతరగతి బ్రిటిష్‌ గహిణి జీవితం రెండవ ప్రపంచ యుద్ధం వల్ల ఎలా ప్రభావితమైనదో చెప్తుంది ఈ చిత్ర కథ. మెట్రో-గోల్డ్విన్‌-మేయర్‌ నిర్మించి పంపిణీ చేసిన ఈ సినిమాకి సహాయక తారాగణం టెరెస్సా రైట్‌, మే విట్టి, రెజినాల్డ్‌ ఓవెన్‌, హెన్రీ ట్రావర్స్‌, రిచర్డ్‌ నే, హెన్రీ విల్కాక్సన్‌.
మిసెస్‌ మినివర్‌ విమర్శనాత్మకంగా, వాణిజ్యపరంగా విజయం సాధించి, 1942లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇది ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి (గార్సన్‌), ఉత్తమ సహాయ నటి (తెరెసా రైట్‌)తో సహా ఆరు అకాడమీ అవార్డులను గెలుచుకుంది. రెండవ ప్రపంచ యుద్ధంపై కేంద్రీకతమై ఉత్తమ చిత్రాన్ని గెలుచుకున్న మొదటి చిత్రంగా, నటనాపారంగా ఐదు నామినేషన్లను అందుకున్న మొదటి చిత్రంగా సినీ చరిత్రలో నిలిచిపోయింది. ఈ చిత్రం అమెరికన్‌ ఫిల్మ్‌ ఇన్స్టిట్యూట్‌, అత్యంత స్ఫూర్తిదాయకమైన చిత్రాల జాబితాలో 40వ స్థానంలో నిలిచింది. 2009లో, ఈ చిత్రాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ ఫిల్మ్‌ రిజిస్ట్రీలో లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌ ”సాంస్కతికంగా, చారిత్రాత్మకంగా, సౌందర్యపరంగా ముఖ్యమైనది” గా ఎంపిక చేసింది.
సినీ కథకు వస్తే లండన్‌ వెలుపల బెల్హం అనే ఓ చిన్న నగరంలోకే మినీవర్‌, భర్త ముగ్గురు పిల్లలతో ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. నచ్చిన వస్తువులు కొంటూ, సౌకర్యవంతంగా జీవించే సాధారణ స్త్రీ ఆమె. ఆమె భర్త కూడా ఉన్నంతలో విలాసంగా జీవించాలనుకునే పురుషుడు. వీళ్ళ పెద్ద కుమారుడు విన్‌ ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొంటూ ఉంటాడు.

రెండవ ప్రపంచ యుద్దం మొదలవుతున్న సమయంలో విన్‌ కాలేజీ నుండి సెలవులకని ఇంటికి వస్తాడు. టీనేజ్‌ చివరి దశలో ఉన్న కొడుకు మనసులోని గందరగోళాన్ని తల్లితండ్రులు మౌనంగా ఓపిగ్గా గమనిస్తూ ఉంటారు. ఆ ఊరిలో రాచరికపు కుటంబానికి చెందిన లేడీ బెల్డన్‌ మనవరాలు కారోల్‌. రాచరికపు అహాన్ని ప్రదర్శించే లేడి బెల్డన్‌ ఆ ఊరిలో ప్రతి సంవత్సరం జరుపుకునే రోజ్‌ షోలో తన తోటలోని గులాబీలకు ఉత్తమ గులాబీ అవార్డు అందుకుంటూ ఉంటుంది. ఇది ఆమె ఓ గొప్ప ప్రెస్టీజ్‌గా భావిస్తుంది. ఆ సంవత్సరం ఆ ఊరి స్టేషన్‌ మాస్టర్‌ తన తోటలో ఓ అందమైన గులాబీని పూయిస్తాడు. దానికి మిసెస్‌ మినీవర్‌ అని పేరు పెట్టి ఆ సంవత్సరం జరగబోయే పోటీలో దించుతానని చెబుతాడు. ఇది లేడీ బెల్డన్‌ను ఆందోళనలోకి పడేస్తుంది. ఆ పోటీ నుండి అతన్ని విరమించుకొమ్మని చెప్పాలని కోరుతూ లేడి బెల్డన్‌ మనవరాలు కారెల్‌ మిసెస్‌ మినీవర్‌ ఇంటికి వచ్చి అభ్యర్ధిస్తుంది. అక్కడ ఆమె విన్‌ని కలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు.
యుద్దం తీవ్రమయి యువకులు సైన్యంలోకి చేరుతుంటే విన్‌ కూడా రాయల్‌ ఏర్‌ ఫోర్స్‌లో ఫైటర్‌ పైలెట్‌గా పేరు నమోదు చేసుకుంటాడు. యుద్దంలోకి వెళుతూ విన్‌ కారోల్‌కి తాను ఆమెను వివాహం చేసుకోదలచానని తెలియచేస్తాడు. కారోల్‌ విన్‌ తల్లి తండ్రుల సమక్షంలో ఆ ప్రతిపాదనను ఒప్పుకుంటుంది. విన్‌ ఇంటికి దగ్గరగా ఉండే బేస్‌ పాయింట్‌కి చేరుకుంటాడు. ఇంటిపై నుండి తన ప్లేన్‌ వెళుతుంటే తల్లి తండ్రులకు సైరెన్‌ ద్వారా తాను సురక్షితంగానే ఉన్నట్లు సందేశం పంపగలిగే ఏర్పాటు చేసుకుంటాడు విన్‌.

విన్‌ తండ్రి అంటే మిస్టర్‌ క్లెం మినీవర్‌ తన మోటర్‌ బోట్‌తో డన్కిర్క్‌ ఎవాక్యువేషన్‌కు ఓ అర్థరాత్రి ప్రయాణమవుతాడు. భర్త, పెద్ద కొడుకు ఇంట్లో లేని సమయంలో మిసెస్‌ మినీవర్‌ తన ఇద్దరు పిల్లలతో ధైర్యంగా ఇంటిని నడిపిస్తూ ఉంటుంది. ఆ యుద్దవాతావరణలోని ఒంటరితనాన్ని సంయమనంతో ఎదుర్కొంటుంది. ఆ సమయంలో గాయపడిన ఓ జర్మన్‌ పైలట్‌ ఆమె తోటలో దాక్కుని ఉండగా మిసెస్‌ మినీవర్‌ చూస్తుంది. అతను ఆమెను భయపెట్టి ఆమె వంటగదిలోకి దూరి ఆకలికి తాళలేక బ్రెడ్‌ అడిగి తీసుకుంటాడు. తన పెద్దబిడ్డ వయసులో ఉన్న ఆ యువకుడిని చూసి ముందు అతని ఆకలి తీరుస్తుంది మిసెస్‌ మినీవర్‌. తరువాత అతని చేతిలో తుపాకిని తప్పించి పోలీసులకు ఫోన్‌ చేసి అతన్ని పట్టిస్తుంది. ఈ సందర్భంలో ఆమె తల్లిగా ఆ జర్మన్‌ సైనికున్ని చెంపదెబ్బ కొట్టి, అనవసర పురుషాన్ని చూపకుండా, ముందు తన గాయాలకు డాక్టర్‌ సహయం తీసుకొమ్మని చెప్పడం ముందు రాసిన స్క్రిప్ట్‌లో లేదు. తరువాతి యుద్ద వాతావరణానికి అనుగుణంగా ఈ సీన్‌ మార్చారు దర్శకులు. మిసెస్‌ మినీవర్‌లోని తల్లి మనసును, దేశం పట్ల ఆ మధ్యతరగతి స్త్రీ కర్తవ్యాన్ని కలగలిపి చూపించిన ఈ సీన్‌ అప్పటి ప్రజలకు బాగా నచ్చింది. ముఖ్యంగా జర్మని దేశాన్ని తిట్టడం తమ లక్ష్యం కాకుండా ఆ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రదర్శించవలసిన నిబ్బరాన్ని ఈ సీన్‌ గొప్పగా చూపించిందని విమర్శకులు అభిప్రాయబడ్డారు. యుద్దం నుండి అలసిపోయి వచ్చిన మిస్టర్‌ మినీవర్‌ భార్య సాహసం గురించి విని ఆశ్చర్యపోతాడు.
విన్‌ కారోల్‌ పెళ్ళి చేసుకోబోతున్నారని తెలిసి లేడి బెల్డన్‌ ఈ వివాహం ఆపమని కోరుతూ మిసెస్‌ మినీవర్‌ను కలుస్తుంది. తెలివిగా ఆమెతో వ్యవహరించి అటు ఆమెను నొప్పించకుండా, పిల్లల ప్రేమ ఓడిపోకుండా ఈ పెళ్ళికి లేడీ బెల్డన్‌ను ఒప్పిస్తుంది కే. విన్‌ని పెళ్ళి చేసుకుని కేరల్‌ మరో మిసెస్‌ మినీవర్‌గా ఆ ఇంట అడుగుపెడుతుంది. ఈ జంట హనీమూన్‌ కని స్కాట్‌లాండ్‌ వెళ్లినప్పుడు ఆ నగరంపై బాంబు రైడ్‌ అవుతుంది. కుటుంబం అంతా ఇంటి భూభాగంలో తల దాచుకుంటారు. పిలలు భయపడకుండా వారికి ‘ఆలీస్‌ ఇన్‌ వండర్లాండ్‌’ చదివి వినిపిస్తూ తమ ఇంటి పై బాంబు పడడాన్ని మౌనంగా గమనిస్తారు ఆ భార్యాభర్తలు. ఇంటికి తిరిగి వచ్చిన కొత్త జంట సగం కూలిన తమ ఇంటిని చూసి బాధపడతారు. అయినా ఆ కూలిన గోడల నడుమే ఆ కొత్త జంటకు ఏకాంతాన్ని అందిస్తుంది మిసెస్‌ మినీవర్‌.

ఆ ఊరిలో జరిగే ఫ్లవర్‌ షోకి అందరూ వెళతారు. ఎప్పటిలాగే లేడీ బెల్డన్‌ గులాబీనే జడ్జ్‌లు ప్రధమ బహుమతికి ఎన్నుకుంటారు. స్టేషన్‌ మాస్టర్‌ గులాబికి రెండవ బహుమతి వస్తుంది. యుద్దం ఎందరి ఆలోచనలలోనో మార్పు తీసుకొస్తుంది. మిసెస్‌ మినీవర్‌ కుటుంబం ప్రభావం వల్ల కావచ్చు, తాను ఎంతో ప్రేమించే మనవరాలు మరో మిసెస్‌ మినీవర్‌గా మారడం కావచ్చు, అధికారం, అహంభావం జరిపే ప్రాణనష్టాన్ని అనుభవపూర్వకంగా చూడడం కావచ్చు, లేడి బెల్డన్‌ ఆలోచనలో ఎంతో మార్పు వస్తుంది. బహుమతి ప్రధానం చేసే సమయంలో స్టేషన్‌ మాస్టర్‌ పెంచిన గులాబీకి మొదటి బహుమతిని ప్రకటిస్తూ తన గులాబీకి రెండో బహుమతి స్వీకరిస్తుంది లేడి బెల్డన్‌. ఊరందరూ దీని హర్షిస్తారు. స్టేషన్‌ మాస్టర్‌ కన్నీటి పర్యంతం అవుతాడు. అందరూ ఆ నిముషం ఒక సమూహంగానూ ఒక గూటి పక్షులుగానూ స్నేహానుభూతిని అనుభవిస్తారు.
విన్‌ యుద్దంలోకి మళ్ళీ వెళ్లిపోతాడు. అతన్ని దించి వస్తున్న కే, కారొల్‌ బాంబు దాడిని ఎదుర్కుంటారు. కారులో వస్తున్న వీరిపై బాంబు శకలాలు పడతాయి. కారోల్‌ తీవ్రంగా గాయపడుతుంది. ఆమెను కే ఇంటికి తీసుకొచ్చిన కొన్ని గంటలకే మరణిస్తుంది.

బాంబు దాడిలో సగం కూలిన చర్చ్‌లో ఊరివారంతా ప్రార్ధనల కోసం చేరతారు. ఇక్కడ వచ్చే ఫాదర్‌ సంభాషణే యూరోప్‌ సైనికులకు, ప్రజలకు ఆ యుద్దకాలంలో బాసటగా నిల్చిన ప్రసంగం. అందమైన ఆ ఊరు శిధిలంగా మారి, వారి ప్రార్ధనా మందిరం కూడా సగం కూలిపోయి ఉండగా, ఆ శిధిలాల నడుమ ఫాదర్‌ ఆ ఊరి ప్రజలలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తాడు. ఆ యుద్దాన్ని ప్రజల యుద్దంగా నిర్వచిస్తూ ”ఇది యూనిఫాంలో ఉన్న సైనికుల యుద్ధం మాత్రమే కాదు, ఇది ప్రజల యుద్ధం, ప్రజలందరూ కలిసి పోరాడాలి. ఇది స్వేచ్ఛను ప్రేమించే ప్రతి పురుషుడు, స్త్రీ, పిల్లలు తమ హదయాలతో పోరాడాల్సిన సమయం. ఈ ప్రజాయుద్దంలో పౌరులు ముందు వరుసలో ఉన్నారు. ”మేము విచ్ఛిన్నం కాము. దీన్ని భరించగలం” అని కలసి ప్రకటిస్తున్నారు. ఇది మన యుద్ధం. మనం యోధులం. మనలో ఉన్న ప్రతిదానితో పోరాడతాం” అని ఆవేశంగా ముగిస్తాడు. ఒంటరిగా నిల్చున్న లేడి బాల్డెన్‌ వద్దకు విన్‌ తన తల్లి తండ్రులను వదిలి వెళ్లి నిల్చుంటాడు. విన్‌ను పక్కన మనవరాలి స్థానంలో చూసిన లేడి బెల్డన్‌ కన్నీళ్ళను బైటికి రానివ్వకుండా ధైర్యంగా ప్రార్ధనా గీతాన్ని ఆలాపిస్తుంది.
ఈ ప్రసంగం తర్వాత, RAF విమానాలు ‘V ఫర్‌ విక్టరీ’ నిర్మాణంలో ఎగురుతుండగా, ”ముందుకు సాగండి, క్రైస్తవ సైనికులులారా” అని అందరూ పాడుతుండగా సినిమా ముగుస్తుంది.
యుద్దాన్ని అనుభవిస్తున్న ఆ నాటి ఇంగ్లిష్‌ ప్రజలకు ఈ చిత్రం ఎంతటి స్పూర్తిని, ధైర్యాన్ని, పరిస్థితులను ఎదుర్కునే నిబ్బరాన్ని ఇచ్చిందో ఈ చివరి సీన్‌ చూస్తే తెలుస్తుంది. అందుకే ఈ సినిమాను మనసుతో అనుభవించాలంటే ఆ నాటి యుద్ద వాతావరణం గురించి యుద్దభీతితో నిండిన నగర ప్రజల మానసిక ప్రవత్తి గురించి కొంత అవగాహనతో సినిమా చూడాలి.
ఈ సినిమా విజయం తరవాత గ్రీర్‌ గార్సన్‌, వాల్టర్‌ పిడ్జియన్‌ వారి పాత్రలను తిరిగి పోషించగా, ది మినివర్‌ స్టోరీ (1950) అనే సీక్వెల్‌ నిర్మించారు. కాని అది ఈ సినిమా అంత గొప్పగా ప్రజలను చేరలేకపోయింది.

– పి.జ్యోతి,
98853 84740

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -