– అవసరమైతే మంత్రి పదవిని త్యాగం చేసేందుకు సిద్ధం : మంత్రి వాకిటి శ్రీహరి
– రవీంద్రభారతిలో ముదిరాజ్ సర్పంచ్‌ల సన్మాన సభ
నవతెలంగాణ-కల్చరల్
ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలని, అందుకు తన మంత్రి పదవిని త్యాగం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ముదిరాజ్‌ల ఐకత్యను చాటేందుకు పరేడ్ మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో మంగళవారం ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ముదిరాజ్ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలమైనదన్నారు. ప్రజాప్రతినిధులలో సర్పంచులకు మాత్రమే రాజ్యాంగం చెక్కు పవర్ కల్పించిందని చెప్పారు. సర్పంచులందరూ భవిష్యత్‌లో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిచేలా బాగా పని చేయాలని సూచించారు. పండుగ సాయన్న, కానిస్టేబుల్ కృష్ణయ్య ఉద్యమ స్ఫూర్తితో, మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆలోచన విధానంతో, అంబేద్కర్ ఇచ్చిన వాటాతో రాజకీయంగా ముదిరాజ్‌ల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనాభా దామాషా ప్రకారం ముదిరాజులు ఎక్కువగా ఉన్నారని, అందుకు అనుగుణంగా అసెంబ్లీలో, పార్లమెంటులో ప్రాతినిథ్యం పెరగాలని అన్నారు. ఒకవైపు బీసీ బిడ్డగా, మంత్రిగా అన్ని వర్గాల అభివృద్ధి కోసం పాటుపడుతూనే తన జాతి అభ్యున్నతి కోసం కృషి చేస్తానని హామీనిచ్చారు.
ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సర్పంచ్‌గా అందరికీ అవకాశం రాదని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని నూతన సర్పంచులకు సూచించారు. ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండాలని, రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని అన్నారు. చెరువుల వద్ద చేపలు పట్టేవాళ్ళు ఇప్పటికీ పేదవారిగానే ఉంటే బ్రోకర్లు మాత్రం ధనికులుగా మారుతున్నారని, చెరువుల వద్ద బ్రోకర్ల పద్ధతి పోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చరిత్రలో ముదిరాజ్‌ల ప్రాముఖ్యతను తొక్కేశారన్నారు. ముదిరాజ్‌లలోని మహనీయుల జయంతులను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మెన్ బొర్రా జ్ఞానేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, కాసాని వీరేష్ ముదిరాజ్, వివిధ జిల్లాల ముదిరాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
ముదిరాజ్‌లను బీసీ- ఏలో చేర్చాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



