Monday, April 28, 2025
Navatelangana
Homeజాతీయంమొఘలులు.. ఢిల్లీ సుల్తానుల ఊసే లేదు

మొఘలులు.. ఢిల్లీ సుల్తానుల ఊసే లేదు

- Advertisement -

– ఏడో తరగతి పాఠ్యపుస్తకంలో ఎన్సీఈఆర్టీ మార్పులు
– వారి స్థానంలో పురాతన రాజవంశాల ప్రస్తావన
– పుణ్యక్షేత్రాలు… యాగాలు… ఆచారాలు… ఆధ్యాత్మికత
– అయ్యవార్లు నేర్పేది ఇక ఈ పాఠాలే

కొత్తగా రూపొందించిన ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో మొఘలులు, ఢిల్లీ సుల్తానుల పాలనకు సంబంధించిన రెండు అధ్యాయాలను తొలగించారు. వాటి స్థానంలో మగధులు, మౌర్యులు, శుంగులు, శాతవాహనులు వంటి పురాతన రాజవంశాలకు సంబంధించిన చాప్టర్లను ప్రవేశపెట్టారు. ఇంకో విశేషమేమంటే కొత్త పాఠ్య పుస్తకంలో ఇటీవల జరిగిన మహా కుంభమేళా ప్రస్తావన కూడా ఉంది. అంతేకాక పుస్తకంలోని వేర్వేరు అధ్యాయాలలో జనపద (ప్రజలు నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రదేశం), సామ్రాజ్‌ (దేశ పాలకుడు), అధిరాజ (ఫ్యూడల్‌ పాలకుడు), రాజాధిరాజ (రాజులకు రాజు) వంటి సంస్కృత పదాలు కూడా బాగా కన్పించాయి.
న్యూఢిల్లీ : ఎన్సీఈఆర్టీ నూతన పాఠ్య పుస్తకంలో గ్రీకులకు సంబంధించి సవివరమైన సెక్షన్లను చేర్చారు. గత సంవత్సరం 3, 6 తరగతులకు కొత్త పాఠ్య పుస్తకాలు ప్రవేశపెట్టిన ఎన్సీఈఆర్టీ…ఈ ఏడాది 4, 7 తరగతుల పుస్తకాలు మార్చింది. ఏడో తరగతి పాఠ్య పుస్తకంలో గతంలో మొఘలులు, ఢిల్లీ సుల్తానులపై సెక్షన్లు ఉండేవి. మొఘలు చక్రవర్తుల విజయాలతో పాటు పలు రాజకుటుంబాల ప్రస్తావనలతో రెండు పేజీల టేబుల్‌ ఉండేది. తాజాగా రూపొందించిన కొత్త సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో వాటన్నింటినీ తొలగించారు. అనేక కొత్త అధ్యాయాలను చేర్చారు. కానీ ఎక్కడా మొఘలులు, ఢిల్లీ సుల్తానుల ప్రస్తావన లేదు.
ఆనాటి రాజవంశాల చరిత్రలతో…
‘విద్యార్థులు ఎలాంటి విలువలను అభివృద్ధి చేసుకోవాలని మనం కోరుకుంటామో అవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. ఆ విలువలు మన సంస్కృతిలో పాతుకుపోయాయి’ అని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ దినేష్‌ ప్రసాద్‌ ఈ పుస్తకానికి రాసిన ముందుమాటలో తెలిపారు. పాఠ్య పుస్తకంలోని ఐదో అధ్యాయం మగధ రాజవంశం ఆవిర్భావం గురించి వివరించింది. ప్రస్తుతం దక్షిణ బీహార్‌, దాని పరిసరాలలో ఉన్న ప్రాంతాన్ని అప్పటి మగధ రాజవంశం పాలించింది. ‘ఉత్తర భారతదేశంలో క్రీస్తుపూర్వం 6వ, 4వ శతాబ్దాల మధ్య తీవ్రమైన మార్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో మగధ సామ్రాజ్యం ఒకటి. చిన్న చిన్న రాజ్యాలను విలీనం చేసుకునేందుకు అది ఓ వేదికను ఏర్పాటు చేసింది. మగధను శక్తివంతమైన అధికార కేంద్రంగా మార్చేందుకు అజాతశత్రు వంటి రాజులు కీలక పాత్ర పోషించారు’ అని ఓ అధ్యాయంలో రాశారు. తూర్పు ప్రాంతంలో మగధ అభివృద్ధి చెందుతున్న సమయంలో వాయవ్యంలో చిన్న చిన్న రాజ్యాలు ఉండేవి. వీటిలో గ్రీకు ఒకటి. దానిని పోరస్‌ రాజు పాలించాడు. మసడోనియాను పాలించిన గ్రీకు రాజు అలగ్జాండర్‌ తన ప్రతీకారం తీర్చుకోవడానికి పర్షియన్‌ సామ్రాజ్యాన్ని ఎలా ఓడించిందీ ఆ అధ్యాయంలో వివరించారు. అలగ్జాండర్‌ విజయంతో గ్రీకు సంస్కృతి వ్యాప్తి చెందింది. చరిత్రలో అతి పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించింది.
తీర్థయాత్రలు… ఆధ్యాత్మికత
‘భూమి ఎలా పవిత్రంగా మారుతుంది’ అనేది ఎనిమిదో అధ్యాయం శీర్షిక. భాగవతంలోని ఓ శ్లోకంతో ఇది ప్రారంభమవుతుంది. తీర్థయాత్రలు, విశ్వాసాల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాలు ఎలా పవిత్రతను సంతరించుకున్నాయో ఏకరువువ పెట్టారు. భూమితో ప్రజలకు ఉన్న ఆధ్యాత్మిక సంబంధాన్ని వివరించారు. బదరీనాథ్‌, అమర్‌నాథ్‌ నుండి కన్యాకుమారి వరకూ…భరతభూమి పుణ్యక్షేత్రాలకు నెలవుగా మారిందని తెలిపారు. సంస్కృతి, అధ్యాత్మికతకు ఇవి మేళవింపు అని అభివర్ణించారు. ఈ పుస్తకంలో భారత రాజ్యాంగంపై ఓ అధ్యాయం కూడా ఉంది. పనిలో పనిగా ఆధార్‌ను కూడా ఈ పాఠ్య పుస్తకంలో ప్రస్తావించారు.
వేద ఆచారాలు… అశ్వమేధ యాగం
తర్వాతి అధ్యాయం మౌర్య రాజవంశం గురించి తెలియజేసింది. చంద్రగుప్త మౌర్యుడి ప్రాభవం, కౌటిల్యుని నీతి, అశోకుడి పాలన వంటి అంశాలను వివరించింది. ఆరో అధ్యాయంలో దక్షిణాది గురించి ప్రస్తావించారు. పుష్యమిత్ర షుంగుడు షుంగ రాజవంశాన్ని ఎలా ప్రారంభించిందీ తెలిపింది. ‘ఆ కాలంలో వేద ఆచారాలు, అభ్యాసాలు పునరుజ్జీవనం పొందాయి. అయితే ఇతర రకాల ఆలోచనా విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తాత్విక, సాహిత్య రచనలకు ప్రాధాన్యత ఇచ్చే భాషలలో ఒకటిగా సంస్కృతం అలరారింది’ అని చెప్పుకొచ్చింది. అలనాటి రాజులు నిర్వహించిన అశ్వమేథ యాగం ప్రస్తావన కూడా ఆ అధ్యాయంలో ఉంది. ఆంధ్ర రాజవంశంగా పిలవబడే శాతవాహన రాజవంశం గురించి అది వివరించింది. ఓ సెక్షన్‌లో చోళులు, పాండ్యులు, చేరాలను గురించి వివరించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img

తాజా వార్తలు