Sunday, July 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమా గ్రామంలో ఆదివారం ముక్కా, చుక్కా నిషేధం 

మా గ్రామంలో ఆదివారం ముక్కా, చుక్కా నిషేధం 

- Advertisement -

గ్రామస్తుల మూకుమ్మడి నిర్ణయం ..
– పకడ్బందీగా అమలు 
నవతెలంగాణ – గంగాధర :
ఆదివారం వచ్చిందంటే మాంసాహార ప్రియులకు పండుగే. ప్రభుత్వ సెలవు దినం కావడంతో కొన్ని దశబ్ధాలుగా ప్రతి ఇంట్లో ఆదివారం నాన్ వెజ్ లేనిదే నోట్లో ముద్ద దిగని పరిస్థితులు నెలకొన్నాయి. సూర్య భగవానుడి సుదినమైన ఆదివారం రోజున మత్తు పదార్థాలు తీసుకోవడం, మాంసాహారం భుజించడాన్ని నిషేధిస్తూ ఓ గ్రామంలో గ్రామస్తులు మూకుమ్మడి నిర్ణయం తీసుకున్న తీరు ఇది. వివరాల్లోకి వెళితే… గంగాధర మండలం గర్శకుర్తి మేజర్ గ్రామంలో గ్రామస్తులు ఏకమై మూకుమ్మడిగా తీసుకున్న ఈ నిర్ణయం చర్చానీయాంశంగా మారింది.

బ్రిటీష్ కాలం నుండి నేటి వరకు ఆదివారం ప్రభుత్వ సెలవు దినంగా కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ, ప్రయివేట్ ఉద్యోగులతోపాటు ప్రతి ఒక్కరు సెలవు దినాన్ని పురస్కరించుకుని చాలా కుటుంబాల ఇళ్లలో (మాంసం) ముక్క ముట్టనిదే నోట్లో ముద్ద దిగని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా కొన్ని కుటుంబాలు మాంసాహారంతో అనేక రకాల నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేయడం పరిపాటిగా మారింది. నాన్ వెజ్ రుచే వేరంటూ గుటకలేసే మాంసం ప్రియులు, మందుబాబులకు ఈ రోజుల్లో కొదువే లేదు. ఆదివారం రోజు మాంసాహారం, మందు సేవిస్తూ సూర్య భగవానుడి సుదినాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే నిజాన్ని గ్రహించిన గర్శకుర్తి గ్రామస్తులు ఆదివారం రోజున గ్రామంలో ఎవ్వరు కూడా మత్తు పదార్థాలు, మందు, మాంసం ముట్టుకోకూడదంటూ నిర్ణయించుకున్నారు.

దీంతో ఆదివారం మత్తు పదార్థాలు, మందు, మాంసాహారం నిషేధిస్తున్నట్టు ప్రకటన చేస్తూ ఇనుప రేకులతో తయారు చేసిన ప్లేట్లపై రాసి గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధి వీధిన గోడలకు కొట్టించారు. 2 మార్చి 2025 నుండి ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మెజార్టీ కుటుంబాలు ఆదివారం రోజున మత్తు పదార్థాలు, మందు, మాంసాహారానికి దూరంగా ఉంటూ నిషేధించడం అరుదైన అంశమే. గ్రామస్తులు తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -