మనసు బాగోలేనప్పుడు పి.బి.శ్రీనివాస్ పాటలు వింటె ఉల్లాసంగా మారుతుంది. అతని పాటలు శ్రోతల మనసులను కరిగించాయి. విశిష్ట గాయకుడిగా పేరొందిన ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలిడిన సందర్భంలో ఇంగ్లీషులో ‘మేన్ హాజ్ సెట్ హిజ్ పూట్ ఆన్ ది మూన్’ అనే పాట రాసి కంపోజ్ చేశాడు. రవీంద్రనాథ్ శతజయంతి సందర్భంగా శాంతినికేతన్ వారు రవీంద్రనాథ్ టాగూర్‌పై ఆయనచే కొన్ని పాటలు రికార్డు చేయించుకున్నారు. కొన్నాళ్ళు జర్నలిస్టుగా కూడా పనిచేశాడు. ఈయన పాడిన ‘ఓహౌ గులాబీ బాలా..’, ‘నీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ బెడదా’ వంటి మధుర గేయాలు తెలుగునాట సుపరిచితమే. సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన 95వ జయంతి ఈ నెల 22న జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
పి.బి.శ్రీనివాస్ పూర్తిపేరు ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు. 1930 సెప్టెంబరు 22న కాకినాడకు సమీపంలోని గొల్లప్రోలు గ్రామంలో శేషగిరమ్మ, ఫణీంద్రస్వామి దంపతులకు జన్మించాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి సంగీతంలో ప్రవీణురాలు. ఆమె జానపద పాటలు, సినిమా పాటలు పాడుతుంటే శ్రీనివాస్ గళం కలుపుతుండేవాడు. శ్రీనివాస్‌కు చిన్నతనం నుంచి రేడియో వినడం అలవాటు. మహమ్మద్ రఫీ పాటలంటే ప్రాణం. కాకినాడలో చదువుకుంటున్న సమయంలో తమ్ముడు రామనుజంతో కలిసి సినిమాలు బాగా చూసేవాడు. తండ్రి ఖర్చులకు పంపే డబ్బులు సరిపోక చిత్తు కాగితాలు అమ్మగా వచ్చిన డబ్బుతో సినిమాలు చూసేవాడు. సినిమా నచ్చితే ఎన్నిసార్లు చూసేవారో లెక్కే లేదు. తెలుగు సినిమాలు ‘రత్నమాల’, ‘బాలరాజు’తో బాటు ‘కిస్మత్’, ‘అనోఖి అదా’ వంటి హిందీ సినిమాలు ఆయనను ప్రభావితం చేశాయి. ఈ సినిమాల్లో ఏ పాటలు ఎన్ని గంటలకు, ఎన్ని నిమిషాలకు వస్తాయో గుర్తు పెట్టుకొని, విని, స్వరాలు రాసుకుని గ్రంధస్తం చేసేవాడు.
పన్నెండేళ్ళ వయసులో శ్రీనివాస్ మేనమామ ఆయన చేత ఒక నాటకంలో పాటలు పాడించాడు. అలా సంగీతం మీద ఆపేక్ష పెంచుకున్నాడు. సంగీతం మీద ఆసక్తివున్నా తండ్రి అతనికి శాస్త్రీయ సంగీతం నేర్పించలేదు. కాకినాడలో పట్టభద్రుడై, హిందీ విశారద పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. తండ్రికి శ్రీనివాస్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా చూడాలని కోరిక. కానీ శ్రీనివాస్ మద్రాసు వెళ్లి సినిమాల్లో పాటలు పాడుతానన్నాడు. అప్పుడు అతన్ని ఒక జ్యోతిష్కుడి వద్దకు తీసుకెళితే గాయకుడిగా శ్రీనివాస్ రాణించలేడని చెప్పాడు. దాంతో శ్రీనివాస్‌లో పట్టుదల పెరిగింది. ఆ జ్యోతిష్కుని జ్యోతిష్యం తప్పని రుజువు చేయాలనుకున్నాడు.
కాకినాడ పి.ఆర్ కళాశాలలో బి.కాం పూర్తిచేసిన తర్వాత న్యాయశాస్త్రంలో పట్టా కోసం 1951లో మద్రాస్ వెళ్లాడు. అక్కడ తమ బంధువైన వైణిక విద్వాంసుడు ఈమని శంకరశాస్త్రిని కలిసాడు. ఆయన శ్రీనివాస్‌ను జెమినీ వాసన్‌కు పరిచయం చేశాడు. వాసన్ ఎదుట శ్రీనివాస్ ‘దీదార్’ సినిమాలో మహమ్మద్ రఫీ పాడిన ‘హుయే హమ్ జిన్ కే లియే బర్బాత్’ పాటను వినిపించాడు. వాసన్‌కు శ్రీనివాస్ పాడే తీరు నచ్చింది. జెమిని పతాకం మీద హిందీ చిత్రం ‘మిస్టర్ సంపత్’ (1952)లో శ్రీనివాస్‌ను నేపథ్యగాయకుడిగా పరిచయం చేశాడు. ఆ చిత్రానికి ఈమని శంకరశాస్త్రి, కల్లా బాలకష్ణ సంగీతం సమకూర్చగా శ్రీనివాస్ అందులో ‘అజీ హమ్ భారత్‌కి నారీ హై సబ్ సే న్యారి’, ‘లైలా లైలా పుకారూ మై బన్ మే’ (గీతా దత్‌తో), ‘లో బారి జిప్సీ’ (శంషాద్ బేగంతో) అనే మూడు పాటలను, మరి కొన్ని బిట్లు , కోరస్ లీడ్‌లోనూ పాడాడు. ఈ చిత్రం తమిళంలో కూడా వచ్చింది. తర్వాత సౌండ్ రికార్డిస్ట్ జీవా సహాయంతో దక్షిణ భారత చిత్రసీమలోకి ప్రవేశించాడు. సినిమాల్లో ప్రయత్నిస్తూనే ‘ప్రియాంక’, ‘ప్రియభాషి’, ‘త్రిలోక సంచారి’, విశ్వసాక్షి’ వంటి కలం పేర్లతో అనేక రచనలు చేసాడు. 1954లో రత్తిహళ్లి నాగేంద్రరావు మూడు భాషల్లో ఒకేసారి ‘జాదకం’ (తమిళం), ‘జాతక ఫలం’ (తెలుగు), ‘జాతకఫల’ (కన్నడం) పేర్లతో సినిమా నిర్మించాడు. అందులో సంగీత దర్శకుడు గోవర్ధనం పి.బి. శ్రీనివాస్ చేత రెండు పాటలు పాడించారు. తెలుగు వర్షన్‌లో ‘ఏలా దిగులేలా, ఈ కాలము మారునులే, మరువకే బేలా’ అనే నేపథ్య గీతం తెలుగులో శ్రీనివాస్ పాడిన తొలిపాట. అందులోనే ‘లోకులు కాకులే లోకమే మాయ, మాయమాటలలోన’ అనే పాటను కూడా శ్రీనివాసే పాడాడు. 1955లో ‘పుత్రధర్మ’ అనే మళయాళ సినిమాలో ‘మమలకల్ కప్పురత్తు’ అనే పాటను తొలిసారి పాడాడు. నేటికీ ఆ పాట మళయాళుల ఇళ్ళలో వినిపిస్తూనే వుంది.
గాయకునిగా తెలుగు చిత్రాల్లో
1956లో వచ్చిన ‘భలేరాముడు’ సినిమాలో సాలూరి రాజేశ్వరరావు సంగీతదర్శకత్వంలో పాడిన ‘భయమేలా ఓ మనసా భగవంతుని లీల, ఇదంతా పరమాత్ముని ఈ లీలా’ అనే పాటతో శ్రీనివాస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. అందులోనే ‘బంగారుబొమ్మా పదవే పోదాము, పైదేశం చూద్దాం’ అనే సోలో సాంగ్, పి.లీలతో కలిసి ‘గోపాలదేవా కాపాడరావా’ అనే మరో రెండు పాటలు కూడా పాడాడు. 1959లో వచ్చిన ‘జయభేరి’ చిత్రంలో ఘంటసాల, రఘునాథ పాణిగ్రాహిలతో కలిసి పాడిన త్రిగళ గీతం ‘మది శారదాదేవి మందిరమే’ పాట మంచి పేరు తెచ్చింది. 1960లో వచ్చిన ‘భీష్మ’ సినిమాలో ‘మనసులోని కోరిక, తెలుసు నీకు ప్రేమిక’ యుగళ గీతాన్ని పిబిఎస్, సుశీల లచే పాడించారు. ఇదే ఏడాది విడుదలైన ‘శాంతినివాసం’ చిత్రంలో నాగయ్య కోసం ‘శ్రీరఘురాం జయరఘురాం సీతా మనోభిరాం’ అనే పాటను ఘంటసాల సంగీత సారధ్యంలో శ్రీనివాస్ అద్భుతంగా పాడారు. ఈ చిత్రానికి ఘంటసాల స్వయంగా సంగీత దర్శకుడై ఉండి కూడా పిబిఎస్ చేత పాటలు పాడించారు.
శాస్రీయ సంగీతం నేర్చున్న వారు కూడా పాడలేని పాటలు అతి సునాయాసంగా శ్రీనివాస్ పాడేవారు. ‘రంగుల రాట్నం’ సినిమాలో ‘మనసు మనసు కలిసే వేళా’ అనే పాట పిబిఎస్ పాడిన పాటలలో ఒక కలికి తురాయి. భక్తశబరి చిత్రంలో శ్రీనివాస్ ఆలపించిన ‘ఏమి రామకథ శబరీ శబరీ ఏదీ మరియొకసారి’ పెండ్యాల స్వరపరచిన గీతాల్లో ఒక రససుధ అని చెప్పాలి. అయితే ఆయన కొన్ని సరదాగా వుండే హాస్య గీతాలు కూడా ఆలపించారు. కులగోత్రాలు సినిమాలో ‘రావే రావే బాలా హలో మై డియర్ లీలా ఇటురావే’ జమునారాణితో, ‘చక్కని చుక్క సరసకు రావే ఒక్కసారి నవ్వినచాలే’ సుశీలతో, దేవాంతకుడు సినిమాలో ‘గోగోగోగో గొంగూరా జైజైజైజై జైఆంధ్ర’ పాటలు ఈ కోవలోనివే. ఇక 1966లో భక్తపోతన సినిమాను గాను భోగినీ దండకం, భాగవత పద్యాలు శ్రీనివాస్ చేత పాడించారు. శ్రీనివాస్ ఎంత గొప్పగా పాడినా నాగయ్య గారి భక్తపోతన సినిమా ముందు గుమ్మడి నటించిన సినిమా తేలిపోవడంతో శ్రీనివాస్ పాడిన పాటలు, పద్యాలు మరుగున పడ్డాయి.
1977లో బాపు నిర్మించిన స్నేహం, 1978లో నిర్మించిన గోరంతదీపం సినిమాల్లో మహదేవన్ శ్రీనివాస్ చేతనే ఎక్కువ పాటలు పాడించారు. ఇవి కాకుండా లేతమనసులు సినిమాలో విశ్వనాథన్ శ్రీనివాస్ చేతనే పాటలు పాడించారు. ఆడిబతుకు సినిమాలో ‘బుజ్జిబుజ్జి పాపాయి, బుల్లి బుల్లి పాపాయి’, ‘తనువుకెన్ని గాయాలైనా మాసిపోవునేలాగైనా’, మనసేమందిరంలో ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకో” వంటి అద్భుతమైన పాటలు పాడించారు. తెలుగులో శ్రీనివాస్ ఎన్నో ప్రైవేట్ రికార్డులకోసం పాడాడు. వాటిలో ఎక్కువగా భక్తిపరమైనవే. కష్ణశాస్త్రి రాసిన ‘పడవ నడపవోరు’, ‘ఇదేకదా తొలిరేయి’, ‘ఉదయ సమీర సాంధ్య లాస్యము’, ‘ప్రణయసీమ పయనమౌదమా’, ‘రాదటే చెలి రాధికా’ వంటి లలితగీతాలు బహుళ జనాదరణ పొందాయి.
తమిళంలో…
1960లో ‘అడుత్త వీట్టు పెణ్’ పేరుతో తమిళంలో వచ్చిన ఈ చిత్రంలో పిబి శ్రీనివాస్ ఆలపించిన ‘మాలయ్యిల్ మలర్ సొలయ్యిల్’, ‘కణ్ణాలే పేసి పేసి’, ‘వాడత్తా పుష్పమే వనిత్తా మణియే’ పాటలు సూపర్ హిట్లయ్యాయి. సంగీత దర్శకుడు రామనాథన్ శ్రీనివాస్‌ని బాగా ప్రోత్సహించారు. జెమినీ గణేశన్‌కు శ్రీనివాస్ చేతనే సంగీత దర్శకులు ఎక్కువ పాటలు పాడించారు. తమిళంలో ‘బలే పాండియన్, నెంజిల్ ఒరు ఆలయం, శుమైతాంగి, కాదలిక్క నేరమిల్లై, పోలీస్ కారన్ మగళ్, పాదకాణిక్కై, మణప్పందల్, వీర తిరుమగన్” సినిమాలలో పిబి శ్రీనివాస్ పాడిన పాటలు అద్భుతాలు సష్టించాయి. ‘పావ మన్నిప్పు’లో జెమిని గణేశన్ కోసం విశ్వనాథన్ స్వరపరచిన ‘కాలంగళిల్ ఆవళ్ వసందం’ తమిళలకు ఎంతో ఇష్టమైన పాట.
కన్నడంలో..
తమిళంలో లాగానే ఆర్ నాగేంద్ర రావు ‘జాతకఫల’ సినిమా ద్వారానే పిబి శ్రీనివాస్ మొట్ట మొదట కన్నడ చిత్రసీమకు పరిచయమయ్యాడు. సంగీత దర్శకుడు జి కె వెంకటేశ్‌కు పిబిఎస్ అంటే ఇష్టం. తాను ‘ఓహిలేశ్వర’ అనే కన్నడ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నప్పుడు రాజకుమార్‌ను తనకు పాడడానికి ఒక కొత్త గాయకుడికి అవకాశం ఇస్తే బాగుంటుందని సూచించాడు. అలా ఓహిలేశ్వర సినిమాలో రాజకుమార్‌కు మొట్టమొదట పిబిఎస్ పాడాడు. పిబిఎస్ గాత్రం రాజకుమార్‌కు చక్కగా కుదిరింది. అప్పటినుండీ 1974 వరకు రాజకుమార్ పాటలను కన్నడలో పిబిఎస్ మాత్రమే పాడాడు. 1974లో ఒక పాట రికార్డింగుకు పిబిఎస్ రాలేక పోయినప్పుడు రాజకుమార్ తానే పాడుకున్నాడు. అప్పటినుండి ప్రేక్షకులు రాజకుమార్ పాటలనే అభిమానించడంతో పిబిఎస్‌కు తర్వాత రాజకుమార్‌కు పాడే అవకాశం రాలేదు. కన్నడ చిత్రసీమలో ముగ్గురు ‘కుమార’ నాయకులు ఉండేవారు. ‘రాజకుమార్, ఉదయకుమార్, కళ్యాణకుమార్’. వాళ్ళ ముగ్గురికీ పిబిఎస్ గాత్రదానం చేశాడు. తర్వాత వచ్చిన ‘గంగాధర్, శ్రీనాథ్, విష్ణువర్ధన్, అంబరీష్’ లాంటి హీరోలకి కూడా పిబిఎస్ పాడాడు. రాజకుమార్ తాను శరీరమయితే పిబిఎస్ తన కంఠస్వరం అనే వాడు. అదేవిధంగా రాజకుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే బహుమతి లభించినప్పుడు పిబి.శ్రీనివాస్ అది తనకే వచ్చినట్లు పొంగిపోయాడు. అతని కన్నడ ఉచ్చారణ, క్రమశిక్షణ, వేళ తప్పకుండా రికార్డింగులకు వెళ్ళడం వంటి కారణంగా,చిత్ర దర్శకులు, సంగీత దర్శకులు అతనికి అవకాశాలు బాగా ఇచ్చారు. అంతేకాదు పి.బి.శ్రీనివాస్ మరణానంతరం బెంగళూరులోని ఓ పార్కుకు ఆయన పేరే పెట్టారు. ఇలా కన్నడీకుల గుండెల్లో గుడికట్టుకున్నారు.
పాటల రచయితగా
పి.బి.శ్రీనివాస్ కొన్ని చిత్రాలకు పాటలు కూడా రాశారు. కె.బాలచందర్ ‘ఆకలిరాజ్యం’లోని ‘తుహై రాజా మై హూ రాణీ’ హిందీ పాటను పి.బి.శ్రీనివాస్ రాయడం విశేషం. తర్వాతి రోజుల్లో ఆయన సొంతగా ఓ ఛందస్సును రూపొందించి అందులో పద్యాలు రాశారు. ఆయన మనవడు పి.బి. ఆనందవర్ధన్ అప్పట్లో బాలనటునిగా పలు చిత్రాలలో అలరించారు. పి.బి.శ్రీనివాస్ పాట మరపురానిది, మరువలేనిది అని అందరూ అంటారు. 2013 ఏప్రిల్ 14న పి.బి.శ్రీనివాస్ కన్నుమూశారు. ఆయన లేకున్నా పి.బి. పంచిన మధురామతం ఈ నాటికీ మనలను ఆనందంలో ముంచెత్తుతూనే ఉంది.
అరుదైన వ్యక్తి
అనేక భాషల్లో పాటలు పాడి ప్రఖ్యాతి పొందిన పిబి.శ్రీనివాస్‌ను మన పొరుగున ఉన్నవారు ‘మా వాడు’ అని గర్వంగా చెప్పుకోవటం తెలుగు వారిగా మనం గర్వించ తగ్గ విషయం. అయితే తెలుగునాట ఆయనకు తగినంత గుర్తింపు రాకపోటం బాధపడవలసిన విషయం. పిబిఎస్‌కు తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం, కర్ణాటక ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారం, 2500 చదురపుటడుగుల భూమి, శివ ఫౌండేషన్ వారి మాధవపెద్ది పురస్కారం, రాజకుమార్ కుటుంబం వారి రాజ్‌కుమార్ సౌహార్ద పురస్కారం, శిరోమణి బహుమతి, గాయని సుశీల ట్రస్ట్ వారి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్ వంటి అవార్డులు అందుకున్నారు. సాత్వికుడిగా, అజాతశత్రువుగా, మెత్తని మనసుతో అందరితో ఎంతో కలివిడిగా కలిసిపోయే మనిషిగా ఆయన చాలా అరుదైన వ్యక్తి. ఉడ్‌లాండ్స్-డ్రైవ్‌ఇన్ ఫలహారశాలలో కూర్చుని పలకరించిన వారందరితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ వుండేవాడు. ఎవరికి సన్మానం అని విన్నా జేబులనిండా వుండే రంగురంగుల కలాలతో ఒక పద్యం రాసి దాన్ని ఒక ప్లాస్టిక్ కవరులో పెట్టి, స్వయంగా పాడి తరువాత సమర్పించేవాడు.
పి.బి.శ్రీనివాస్ బహుభాషా చలనచిత్ర నేపథ్య గాయకులు, అష్టభాష కవి, నూతన కర్ణాటక సంగీత రాగ సష్టికర్త, నూతన ఛందః సష్టికర్త, వాగ్గేయకారులు, తొలితెలుగు గజల్ గాయకులు, తొలి తెలుగు గజల్ వాగ్గేయకారులు, ఇంగ్లీష్ గానం చేసిన తొలి తెలుగు గాయకులు, ఎనిమిది భాషల్లో గజళ్లు రాసిన తొలికవి ఆపై ఏకైక కవి, అమెరికా అధ్యక్షులు నిక్సన్ ప్రశంసల్ని, చంద్రుడిపై కాలు మోపిన ఆంస్ట్రంగ్ ప్రశంసల్ని అందుకున్న కవి-గాయకులు పి.బి.శ్రీనివాస్. శాస్త్రీయ సంగీతం గురుముఖంగా నేర్చుకోకుండా అద్భుతంగా పాడేవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో ప్రముఖంగా చెప్పుకోవలసిన వ్యక్తి ఆయన. సంగీత ప్రియుల హదయాల్లో ‘పిబిఎస్’గా స్థిరపడ్డ ప్రముఖ సినీ సంగీత నేపథ్యగాయకుడు. శ్రీనివాస్ ఇంటి పేరు ప్రతివాది భయంకర కావచ్చు గాని ఆయన ఒక అజాతశత్రువు. గాయకుడిగా పిబిఎస్ విశిష్టతను గుర్తు చేసుకోవటం కోసమే ఈ నివాళి వ్యాసం.
డా. పొన్నం రవిచంద్ర, 9440077499.