Thursday, April 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్తిపన్నుపై మున్సిపల్‌ శాఖ ఫోకస్‌

ఆస్తిపన్నుపై మున్సిపల్‌ శాఖ ఫోకస్‌

- Advertisement -

మొత్తం పన్నులో ఐదు శాతం రాయితీ : కమిషనర్లకు డైరెక్టర్‌ టీకే శ్రీదేవి సర్య్కూలర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మున్సిపాల్టీల్లో ఆస్తి పన్ను వసూళ్లపై మున్సిపల్‌ శాఖ ఫోకస్‌ చేసింది. చాలా మున్సిపాల్టీల్లో వసూలు కావడం లేదని అభిప్రాయపడింది. వేగవంతమైన ఆస్తి పన్ను వసూళ్ల కోసం ఐదు శాతం రాయితీ సౌకర్యం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) మినహా అన్ని మున్సిపాల్టీలకు బుధవారం ఈమేరకు మున్సిపల్‌ శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి మున్సిపల్‌ కమిషనర్లకు సర్య్కూలర్‌ జారీ చేశారు. గతేడాది పన్ను వసూళ్లు ఆశించిన స్థాయిలో లేవనీ, వచ్చే ఆర్థిక సంవత్సవానికి ఆ పరిస్థితిని మెరుగు పరుచుకోవాలని ఆదేశించారు.

పన్నులు, పన్నేతర వసూళ్ల లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారానే పట్టణ స్థానిక సంస్థలు అభివృద్ది చెందుతాయని గుర్తు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వంద శాతం రాబడి సమీకరణపై దృష్టి సారించాలని సూచించారు. సకాలంలో పన్నులు చెల్లించేలా పన్ను చెల్లింపు దారులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. అందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికిగానూ ప్రస్తుత సంవత్సరపు ఆస్తి పన్నుపై ఐదు శాతం రాయితీని ఇస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషనర్లు పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించేం దుకు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. అందుకు అవగాహన కార్యక్రమాలు, ఆస్తి పన్ను మేళాలు నిర్వహించాలని ఆదేశించారు.

పెరిగిన పన్ను వసూళ్లు
గ్రేటర్‌ మినహా మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో 2024-25 సంవత్సరంలో పన్నులు రూ.617.38 కోట్లు వసూళ్లు కాగా, 2025-26లో మాత్రం రూ. 685.04 కోట్లు వసూళ్లు అయ్యాయి. దాదాపు రూ. 67.66 కోట్లు అదనంగా పెరిగాయి. అదే సందర్భంలో పట్ణణాభివృద్ధి కోసం నిధుల కేటాయింపులు కూడా పెరిగాయి. 2024-25లో రూ.1011 కోట్ల కేటాయింపులు ఉండగా, పోయిన ఏడాది రూ. 1179 కోట్లను కేటాయించింది.

గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌, మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్‌ మున్సిపాల్టీల్లో 2024-25తో పోల్చితే 2025-26లో పన్ను వసూళ్లు బాగా పెరిగాయి. కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మున్సిపాల్టీల్లో పన్నులు వసూలు చేయడం తగ్గింది. హుజురాబాద్‌ మున్సిపాల్టీల్లో వంద శాతం వసూళ్లను పూర్తి చేసింది. మొత్తంగా 42 మున్సిపాల్టీల్లో 24 మున్సిపాల్టీలు మాత్రమే తమ లక్ష్యాన్ని చేరుకున్నాయి. 21 కొత్త మున్సిపాల్టీల్లో 16 మున్సిపాల్టీల్లో పన్ను వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నట్టు మున్సిపల్‌ శాఖ అభిప్రాయపడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -