నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల పరిధిలో బుధవారం ఉదయం 7 గంటలకు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర లు ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, వృద్ధులు, యువత ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొంటున్నారని వారు పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, ర్యాంపులు, వీల్‌చైర్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. పోలింగ్ సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తూ, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా కొనసాగుతోందన్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగనున్నందున అర్హులైన ప్రతి ఓటరు తమ సమీప పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులకు గాను 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమస్యాత్మక కేంద్రాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. స్ట్రాంగ్ రూముల్లో వార్డులు, పోలింగ్ బూతుల వారీగా నిర్దేశిత క్రమ సంఖ్యలో బ్యాలెట్ బాక్సులను అమర్చాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన టేబుళ్లు ఏర్పాటు చేసి, ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా లెక్కింపు ప్రక్రియను జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.
ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ : కలెక్టర్, ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



