సంక్రాంతి తర్వాత ఎన్నికల షెడ్యూల్
రిజర్వేషన్ల ఖరారులో మున్సిపల్ అధికారులు బిజీ
తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల సంఘం
ఎన్నికలు జరిగే మున్సిపాల్టీలు 117, కార్పొరేషన్లు 6, వార్డులు 2,996
మొత్తం ఓటర్లు 52,43,023
పురుషులు 25,63,369, మహిళలు 26,80,014, ఇతరులు 640
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో గడువు ముగిసిన 117 మున్సిపాల్టీలు, ఆరు కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో సంక్రాంతి పండుగ తర్వాత షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను రాష్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే ఆదేశించారు. ఈ నెలలో ఎప్పుడైనా నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులను ఆమె అప్రమత్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గుర్తించిన పోలింగ్‌స్టేషన్ల వారీగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది, బ్యాలెట్ బాక్స్‌ల తరలింపునకు సంబంధించి రవాణా తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా చర్యలు చేపట్టాలని పోలీసులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది.
రిజర్వేషన్ల ఖరారు…
సుప్రీం మార్గదర్శకాలననుసరించి 50 శాతం రిజర్వేషన్ పరిమితిని తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. పట్టణ స్థానిక సంస్థల్లో (యూఎల్‌బీ) అనుమతించబడిన రిజర్వేషన్లలో, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) రిజర్వేషన్లు కలిపి 15 శాతానికే పరిమితం అయ్యే అవకాశం ఉంది. మిగిలిన వాటా వెనుకబడిన తరగతులకు లభించనుంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో వారి జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో వారి కోటా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని బీసీ కమిషన్ కూడా సిఫారసు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకనుగుణంగా మున్సిపల్ శాఖ రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు ముమ్మరం చేసింది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. అనంతరం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం తదుపరి చర్య తీసుకోవాలని తుది నివేదిక అందించిన తర్వాత ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది.
మున్సిపల్ ఓటర్ల తుది జాబితా…
రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న మున్సిపాల్టీలు, మున్సిపల్ కార్పొరేషన్ల తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. మొత్తం 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్టు వెల్లడించింది. వీరిలో 25,62,369 మంది పురుష ఓటర్లు కాగా 26,80,014 మంది మహిళా ఓటర్లు, 640 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. అత్యల్పంగా వనపర్తి జిల్లా అమరచింత మున్సిపాల్టీలో 9,147, ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాల్టీలో 9,622, మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మున్సిపాల్టీలో 10,070 మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 1,43,655, ఆ తర్వాత నల్లగొండ మున్సిపాల్టీలో 1,42,437, సూర్యాపేటలో 1,08,848 మంది ఓటర్లు ఉన్నారు. అలాగే నిజామాబాద్ కార్పొరేషన్‌లో అత్యధికంగా 3,48,051 మంది ఓటర్లు ఉండగా.. కొత్తగూడెం కార్పొరేషన్‌లో అత్యల్పంగా 1,34,775 మంది ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఫిబ్రవరి రెండో వారంలో మున్సి పోల్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



