Saturday, January 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమున్సి'పోల్‌' రాజకీయం

మున్సి’పోల్‌’ రాజకీయం

- Advertisement -

– ఆకర్ష్‌కు తెరదీసిన మంత్రులు
– వార్డులు, డివిజన్‌ల రిజర్వేషన్లపై దృష్టి
– చైర్మెన్‌, మేయర్‌ స్థానాలు లక్ష్యంగా పావులు
– ఓటర్‌ జాబితాపై ‘తుది’ కసరత్తు’
– కలిసివచ్చే పార్టీలతో రాయ’బేరాలు’
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి

మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లకు ఎన్నికలు నిర్వహిం చేందుకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో అధికార, విపక్షాలన్నీ ఈ ఎన్నికలపై దృష్టి సారించాయి. రాష్ట్రంలో 116 మున్సిపాల్టీలు, 7 కార్పొరేషన్లు, 2,996 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా తదనుగుణంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. మున్సిపాల్టీల్లో సెంచరీ కొట్టాలని, కార్పొరేషన్లు సైతం దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికార పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మంత్రులు తెరదీశారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాల్లోని కార్పొరేషన్లను ఎలాగైనా ‘చే’జిక్కించుకోవాలని సన్నాహాలు మొదలుపెట్టారు. నిత్యం మంత్రుల కార్యాలయాల్లో ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏ వార్డులో తమకు అనుకూలంగా ఉంది.. ఎక్కడ అననుకూలంగా ఉందో చర్చిస్తున్నారు. అనుకూలంగా లేని చోట ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా మాట్లాడుతున్నారు. వార్డుల వారీగా ఇన్‌చార్జిలను నియమిస్తున్నారు. కార్యవర్గాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. కలిసొచ్చే పార్టీలతో చర్చలు సాగిస్తున్నారు. ఇప్పటికే రాయ’బేరాలు’ మొదలుపెట్టారు.

‘ఓటర్‌’ జాబితాపై తుది కసరత్తు
మున్సి’పోల్స్‌’కు సంబంధించిన ఓటర్‌ తుది జాబితా ఈనెల 12వ తేదీన వెలువడనుంది. సవరణల కోసం ఇప్పటికే జాబితాను ఆయా పార్టీలకు అందించారు. ఈ జాబితాపై కసరత్తు తీవ్రంగా కొనసాగుతోంది. ఆయా వార్డుల్లో మార్పులు, చేర్పులూ ఎలా ఉన్నా.. సామాజిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలపై పార్టీలు దృష్టిపెట్టాయి. ముఖ్యంగా అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఈ అంశంలో తీవ్రంగా తలమునకలయ్యాయి. జాబితాను ముందు వేసుకొని ఆయా వార్డుల్లోని పార్టీ లీడర్లతో చర్చిస్తున్నాయి.

ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెర
మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లలో ఇప్పటికే మంత్రులు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరదీశారు. దీనిలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గడిచిన రెండు, మూడు రోజుల్లో 8మంది బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లకు కాంగ్రెస్‌ కండువాలు కప్పారు. గత ఎన్నికల్లో ఖమ్మంలో 40కి పైగా డివిజన్‌లలో బీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత సుమారు సగం మంది వరకూ ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ వైపు వచ్చేశారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోని మున్సిపాల్టీలతో పాటు ఇన్‌చార్జి మంత్రులుగా వ్యవహరిస్తున్న జిల్లాల్లోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలోనూ ఇప్పటికే ఆకర్ష్‌ చర్యలు మొదలయ్యాయి. నల్లగొండ జిల్లా కేంద్ర మున్సిపాల్టీని కార్పొరేషన్‌గా మార్పించటం కూడా రాజకీయంలో భాగమేనని చర్చ సాగుతోంది. అధికారంలో ఉన్న పార్టీలు తమకున్న ప్రాబల్యాన్ని బట్టి ఈ రకమైన వెసులుబాటులు పొందుతాయనే చర్చలు కూడా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాల్టీల్లో మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు వార్డుల విభజన మొదలు, రిజర్వేషన్లు, చైర్మెన్‌ రిజర్వేషన్ల వరకూ ఇలా అన్నీ తామై నడుపుతున్నారు.

కలిసివచ్చే పార్టీలతో రాయ’భేరాలు’
ఇప్పటికే కలిసివచ్చే పార్టీలతో రాయ’బేరాలు’ మొదలయ్యాయి. అధికార, ప్రధాన ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ విషయంలో చర్చలు మొదలుపెట్టాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు కోసం ఆరాట పడుతున్నాయి. గత ఎన్నికల్లో ఖమ్మం కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌తో జత కట్టిన సీపీఐ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో జత కట్టింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఏ పార్టీతో ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంది. అలాగే నూతనంగా ఏర్పడిన ఏదులాపురం మున్సిపాల్టీలో పొత్తుల అంశం పైనా చర్చలు సాగుతున్నాయి. ఇల్లెందు, కొత్తగూడెం, మధిర, సత్తుపల్లి, కల్లూరు తదితర మున్సిపాల్టీల్లో పొత్తులు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

గెలుపే లక్ష్యంగా వార్డుల రిజర్వేషన్లు
ఎక్కువ వార్డుల్లో గెలిచిన పార్టీకి కార్పొరేషన్లలో మేయర్‌లు, మున్సిపాల్టీల్లో చైర్‌పర్సన్‌ స్థానాలు దక్కుతాయి. కాబట్టి దీనిలో కీలకం వార్డుల రిజర్వేషన్లు. ఏ వార్డు ఎవరికి రిజర్వ్‌ చేయాలనే అంశం ఎన్నికల సంఘం అధికారుల చేతిలో ఉన్నా.. దీన్ని పరోక్షంగా నడిపించేది మాత్రం అధికార పార్టీనే అనే విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కనుసన్నల్లోనే రిజర్వేషన్లు గత కొన్నేండ్లుగా సాగుతున్నాయి. వాస్తవానికి జనాభా ప్రాతిపదికన రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్ల వ్యవహారం నడవాల్సి ఉంది. కానీ దీనికి భిన్నంగా అధికార పార్టీకి ఆ వార్డులో సామాజికంగా సరైన నాయకుడు ఉంటే సరేసరి.. లేదంటే దాని రిజర్వేషన్‌ మార్పించే ఆనవాయితీ ఇప్పుడు కొనసాగుతోంది. రిజర్వేషన్‌పరంగా ఏవైనా ఇబ్బందులు తలెత్తేటట్టు ఉంటే తదనుగుణంగా ఆ మున్సిపాల్టీ పరిధిలోని పక్కవార్డు లీడర్‌ను తీసుకొచ్చి పోటీ చేయించే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. అలా కూడా సాధ్యం కాకపోతే ప్రత్యర్థి పార్టీ లీడర్‌ను నయానోభయానో ఒప్పించి రంగంలోకి దించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -