Thursday, January 29, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుమున్సిపోల్స్‌ హీట్‌

మున్సిపోల్స్‌ హీట్‌

- Advertisement -

నామినేషన్లు ఘరూ…కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక
అమెరికా టూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈనెల 30 వరకు
సీఎం రాష్ట్రానికి వచ్చేది ఫిబ్రవరి 2న
ఫోన్‌ట్యాపింగ్‌ కేసుల్లో బీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం
అంతర్గత కుమ్ములాటల్లో బీజేపీ
‘పుర’పోరుతో రాజకీయం గరంగరం

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మున్సిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. తొలిరోజు దాదాపు 900 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఏపార్టీ కూడా ఇప్పటి వరకు తమ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఆశావహులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. దీనికి ఇక రెండు రోజులే గడువు ఉంది. ‘పుర’ పోరు మొత్తం 15రోజుల్లో ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో రాజకీయ వేడి రాజుకుంది. కానీ ప్రధాన పార్టీలన్నీ ఏదో ఒక అంతర్గత సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌పార్టీకి అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. ఆపార్టీని ముందుండి నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లారు. దావోస్‌ వాణిజ్య సదస్సుకు వెళ్లిన ఆయన అటునుంచి అటే అమెరికాలోని హార్వర్డ్‌ యూనివర్సిటీలో విద్యార్థిగా మారి చదువుకుంటున్నారు.

పుర పోరులో నామినేషన్ల దాఖలుకు ఈనెల 30 తుది గడువు. సీఎం రేవంత్‌రెడ్డి ఫిబ్రవరి2వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఈ దశలో అభ్యర్థుల ఎంపికపై పీసీసీ కసరత్తు చేస్తున్నది. జిల్లా ఇంచార్జి మంత్రులు ఆశావహులతో చర్చలు జరుపుతున్నారు. కీలకమైన మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో లేకపోవడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. అసెంబ్లీ ఉప ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో బాధ్యతలు నెత్తికెత్తుకున్న ఆయన మున్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ దూరాన్ని ఎందుకు పాటిస్తున్నారనే విషయం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్‌పార్టీలో సీఎం రేవంత్‌రెడ్డి ఏకఛత్రాధిపత్యం పెరిగిందనే విమర్శకుల మాటలకు చెక్‌పెట్టేందుకు పురపోరులో ఆయన తన జోక్యాన్ని స్వచ్ఛందంగా తగ్గించు కుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఎన్నికల్లో అధికారపార్టీకి ఆశించిన ఫలితాలు రాకుంటే రేవంత్‌రెడ్డి చరిష్మా తగ్గిందనే ప్రచారం జరిగే అవకాశాలు లేకపోలేదు. ఆయన దావోస్‌, అమెరికా వెళ్తూ ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పార్టీకి కంటిమీద కునుకు లేకుండా ప్లాన్‌ చేసి వెళ్లారు.

అసెంబ్లీలో ఆపార్టీ ఉపనేత టీ హరీశ్‌రావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు, మాజీ ఎంపీ సంతోశ్‌రావు సహా ఒకరి తర్వాత మరొకరిని ‘సిట్‌’ విచారణకు పిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి అదే పెద్ద టాస్క్‌గా మారింది. మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించే పరిస్థితులు లేకుండా చేశారనే ప్రచారం జరుగుతున్నది. ఇక బీజేపీ పరిస్థితి ముందునుయ్యి, వెనుక గొయ్యి లెక్క తయారైంది. ఆపార్టీలో ఆశావహుల సంఖ్య పెరిగి, అంతర్గత కలహాలకు దారితీస్తున్నది. అనేక మున్సిపాల్టీల్లో స్థానిక ఎంపీలు జోక్యం చేసుకొని, తాము సిఫార్సు చేసిన వారికే పార్టీ టిక్కెట్‌ ఇవ్వాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. దీనితో క్షేత్రస్థాయిలో ఆధిపత్యపోరు పీక్‌ స్టేజికి చేరింది. ఆపార్టీ కూడా ఇప్పటి వరకు తమ అభ్యర్థుల్ని ప్రకటించలేదు. నామినేషన్ల దాఖలుకు ఇక రెండ్రోజుల మాత్రమే గడువు ఉండటంతో అన్ని పార్టీలు హడావిడిలోనే ఉన్నాయి.

ఆశావహుల ప్రదక్షిణాలు
పుర పోరులో బరిలోకి దిగేందుకు ఆశావహులంతా ఆయా పార్టీల నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తామే ఫలానా పార్టీ అభ్యర్థులమని స్వీయ ప్రచారం చేసుకుంటున్నారు. ఆయాపార్టీల అగ్రనేతలతో దిగిన ఫోటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఓటర్ల జాబితాలను కులాలవారీగా వర్గీకరించి విశ్లేషిస్తున్నారు. గెలుపోటములపై అంచనాలు వేస్తున్నారు. ఎన్నికల్లో ప్రభావం చూపే వ్యక్తులు, వివిధ వర్గాల ప్రతినిధులను కలుస్తూ బిజీగా గడుపుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -