– ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించు కోవాలి
– పుర ప్రజలకు కమీషనర్ నాగరాజు పిలుపు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గణేష్ నవరాత్రి ఉత్సవాలను మున్సిపాల్టీ నిబంధనలు పాటిస్తూ,ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అశ్వారావుపేట మున్సిపాల్టీ కమీషనర్ నాగరాజు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నవతెలంగాణ తో తన కార్యాలయంలో మాట్లాడారు. గణేష్ నవరాత్రుల ఉత్సవ కమిటీ పేరు,ప్రాంతం,ఉత్సవం నిర్వహించు తేదీలు, ఉత్సవ కమిటీ అధ్యక్షుల పేరు,ఫోన్ నెంబర్ తెలుపుతూ ఈ క్రింది నిబంధనలు అనుసరించి తాత్కాలిక అనుమతి మంజూరు పొందాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన ఎడల ఇట్టి అనుమతి రద్దు చేయబడుతుంది అన్నారు.
గణేష్ మండపాలలో ప్లాస్టిక్ పూర్తి నిషేధం ఉంటుందని, మట్టి విగ్రహాల ఏర్పాటును ప్రోత్సహించాలి అని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. సొంత స్థలాలలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసి వారు అట్టి స్థలానికి సంబంధించిన యజమాని అనుమతి తప్పనిసరిగా పొందాలని తెలిపారు. విద్యుత్ కనెక్షన్ నిమిత్తం విద్యుత్ సంస్థ నుండి అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, సౌండ్ సిస్టం, మైకుల ను ఏర్పాటు చేసుకోవడానికి పోలీస్ శాఖ వారి అనుమతులు ఉండాలని సూచించారు.
డీజే సౌండ్ లకు అనుమతి లేదని, గణేష్ మండపాల వద్ద బూర మైకుల కు అనుమతి లేదు అని,కేవలం రెండు సౌండ్ బాక్స్ లకు మాత్రమే అనుమతి ఉంటుందని అన్నారు. బాణాసంచా పూర్తిగా నిషేధించిన ఐనది, అదేవిధంగా గణేష్ మండపాల ఏర్పాటు చేసే కార్యక్రమంలో రోడ్లు బ్లాక్ కావటం, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా మండపాలు ఏర్పాటు చేసుకోవాలి అని,కమిటీ వారిదే పూర్తి బాధ్యత అన్నారు.
గణేష్ మండపాల వద్ద ఏదైనా అనుకోని ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదాలు జరగకుండా వాటర్ డ్రమ్ములు మరియు సాండ్ బకెట్ లను సిద్ధంగా ఉంచుకోవాలి. గణేష్ మండపాల వద్ద రాత్రి సమయంలో కచ్చితంగా ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులు తప్పనిసరిగా కాపలా ఉండాలని,వారి ఫోన్ నెంబర్ లను కూడా తెలపాలని సూచించారు.
సీసీ కెమెరాలు ఉన్నట్లయితే వాటిని కూడా ఏర్పాటు చేసుకోవాలని, గణేష్ నిమజ్జనం తేదీ,నిమజ్జనం స్థలం కచ్చితంగా తెలపాలని అన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు సమయంలో రోడ్డు మీద వెళ్ళు అత్యవసర వాహనాలకు తప్పనిసరిగా దారి ఇవ్వాలని అన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు అవకాశం ఇవ్వకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు విజయవంతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని కోరారు.