బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలి
పెత్తందారులకు కొమ్ము కాసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి : తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర జాతరలో దళిత, రజక కుటుంబాలను అడ్డుకోవడంతోపాటు పసి పాపను తొక్కి చంపిన పెత్తందారులపై హత్యా నేరం కింద కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి నాగయ్య, ఆర్ వెంకట్రాములు డిమాండ్ చేశరు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, పెత్తందారులకు కొమ్ము కాసిన ఎస్‌ఐ, సీఐ ఇతర పోలీసులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. జాతరలో దర్శనం టికెట్‌కు రసీదు ఇవ్వాలని అడిగినందుకు పెత్తందారులు దాడి చేసి కొట్టడమే కాకుండా పసిపాపను కాలితో తొక్కి చంపిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు.
వారిపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదును పక్కనపెట్టి పెత్తందారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాధితులపై రివర్స్ కేసు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమేనని పేర్కొన్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన పోలీసులు పెత్తందారులకు కొమ్ము కాయడమేంటని ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రజా ప్రతినిధులు, ఆ ప్రాంత ఎంపీ మల్లురవి ఇప్పటివరకు స్పందించకపోవటం అనేక అనుమానాలకు తావిస్తున్నదని తెలిపారు. అధికార పార్టీ నాయకుల అండదండలు చూసుకుని గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఘటనలకు పెత్తందారులు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. బాధితులతో ఎవరూ మాట్లాడొద్దని బెదిరించడం, బాధితులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని నిలుపుదల చేయడం వంటి చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. తక్షణమే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలనీ, బాధితులకు అండగా ప్రభుత్వం నిలబడాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో సామాజిక, ఇతర ప్రజాసంఘాలను కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలను నిర్వహిస్తామని హెచ్చరించారు.
చిన్నారి మృతికి కారకులపై హత్యా నేరం కేసు పెట్టాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



