డీపీఆర్ లేకుండా 10,017 ఇండ్ల కూల్చివేతకు నోటీసులు ఎలా ఇస్తారు?
రేవంత్ సర్కారు బుల్డోజర్ రాజ్యం రాహుల్‌కు కనిపించడం లేదా ?
అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు సభా హక్కుల నోటీసు ఇస్తాం
సీఎం రియల్ ఎస్టేట్ దందాకు, దోపిడీకి సహకరిస్తారా? : బీజేపీకి మాజీమంత్రి హరీశ్‌రావు ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్‌కు పాల్పడాలని చూస్తున్నారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూసీ పునరుజ్జీవనానికి బీఆర్‌ఎస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేది మూసీ ప్రక్షాళనా? లేక సుందరీకరణా?, పునరుజ్జీవమా?అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ పేరిట వేలాది మంది ప్రజలను నిరాశ్రయులుగా చేస్తుండటానికి వ్యతిరేకమని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్నది ఎకలాజికల్ ప్యూరిఫికేషనా? లేదా ఆస్తటిక్ బ్యూటిఫికేషనా?అని అడిగారు.
వికారాబాద్ నుంచి ఇక్కడి వరకు మురుగు నీటిని ఆపకుండా ప్రక్షాళన ఎలా చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఖజానా ఖాళీ అంటూనే రూ.1.50 లక్షల కోట్లకు టెండర్ ఎలా పెట్టారని నిలదీశారు. రైతు భరోసాకు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఉద్యోగుల డీఏల మంజూరుకు నిధుల్లేవంటున్న ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును ఎలా చేపడుతుందని ప్రశ్నించారు. మూసీని బాగు చేయాలనే చిత్తశుద్ది ఉంటే ఆ పరివాహక ప్రాంతాల్లో తిరగాలని సూచించారు. ముందు ఎస్టీపీలు పెట్టాలనీ, మురుగు నీటిని శుద్ధి చేసి, మూసీలో కలిసేలా చూడాలని కోరారు. అది చేయకుండా పేదల ఇండ్ల మీద ఎందుకు పడ్డారని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డికి విజన్ లేదు, ప్రణాళిక లేదనీ, రియల్ ఎస్టేట్ దందా ఒక్కటే ఉందన్నారు. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం 3279.19 ఎకరాల్లో ఉన్న 10,017 నిర్మాణాలను కూల్చుతామని ప్రకటించిందని గుర్తు చేశారు. మూసీ ప్రాజెక్టుకు డీపీఆర్ లేకుండా లక్షలాది మంది ప్రజల జీవితాలను అతలాకుతలం ఎలా చేస్తారని ప్రశ్నించారు. గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి ఇన్ని ఇండ్లు కూల్చడం అవసరమా? అని అడిగారు.
గల్ఫ్ దేశాల్లో బాంబులు వేస్తూ ఇండ్లు కూల్చుతుంటే, ఇక్కడ ఏ యుద్ధం లేదు, బాంబులు లేకుండానే బుల్డోజర్లతో విధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం గురించి రాహుల్ గాంధీకి ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌లో జరిగే బుల్డోజర్ రాజ్యానికి, తెలంగాణలో జరిగే బుల్డోజర్ రాజ్యానికి తేడా ఏముందనీ, రాహుల్‌గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ లేకుండా 10,017 పేదల ఇండ్ల కూల్చివేతకు నోటీసులు, గెజిట్ ఎలా ఇచ్చారని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. బఫర్ జోన్ అంటే ఎన్ని మీటర్లని అడిగారు. దానిపై అధ్యయనం ఉంటే బయటపెట్టాలని కోరారు. జనవరిలో ఏడీబీ రూ.4,100 కోట్లు మూసీకి రుణం ఇవ్వడానికి అంగీకరించిందని అసెంబ్లీలో సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. ఈనెల 11న రుణం మంజూరు కాలేదన్నారని చెప్పారు. అసెంబ్లీ వేదికగా అబద్ధం చెప్పినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామన్నారు.
చాదర్‌ఘాట్ మూసీ వద్ద 300 ఇండ్లు కూల్చారని అన్నారు. వారికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వలేదని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు పంపారని చెప్పారు. వారికి న్యాయం చేయకుండా మధు రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజల ఆవాసాలే కాకుండా మెట్రో రైల్వే స్టేషన్, ఎంజీబీఎస్, ఎస్టీపీలు, దేవాలయాలు, చర్చీలు, మసీదులు, ప్రభుత్వ ఆస్తులున్నాయని వివరించారు. వాటిపై ప్రభుత్వ విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం తనను మూసీ జన ఆందోళన్ బాధితులు కలిశారనీ, సీఎం సమావేశం ఉన్నందున వారిని గృహనిర్బంధం చేశారని చెప్పారు. మూసీ ప్రాజెక్టు శంకుస్థాపనకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వస్తారంటూ రేవంత్‌రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. మూసీ పేరుతో రేవంత్‌రెడ్డి చేస్తున్న రియల్‌ఎస్టేట్ దందా, దోపిడీకి బీజేపీ సహకరిస్తున్నదా?అని ప్రశ్నించారు.



