Sunday, March 22, 2026
E-PAPER
Homeమానవిసంగీతం ప్రశాంతతనిస్తుంది

సంగీతం ప్రశాంతతనిస్తుంది

- Advertisement -

మల్లెల కమల రమణి… కళలను ప్రేమించే కుటుంబంలో పుట్టారు. సంగీతాన్ని ఆరాధించే తండ్రి నీడలో పెరిగారు. ఆయన ప్రోత్సహంతో, తండ్రే తొలి గురువుగా సంగీతంలో ఓనమాలు నేర్చుకున్నారు. ఆ తర్వాత అనేక మంది గురువుల వద్ద సంగీతంలో పట్టుసాధించారు. పెండ్లి తర్వాత బాధ్యతల రీత్యా సంగీతానికి కొంత కాలం దూరమయ్యారు. తిరిగి తనకు ఇష్టమైన సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి దేశ, విదేశాలలో అనేక కచేరీలు చేస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

అమ్మ లీలావతి, నాన్న మీనాక్షి సుందర్‌. నేను పుట్టింది చెన్నైలో. అయితే నా ఐదేండ్ల వయసులో అమ్మా, నాన్న హైదరాబాదుకి వచ్చేసారు. నాన్న రైల్వే ఉద్యోగి. ఆయన డిగ్రీ వరకు సెయింట్‌ ఫ్రాన్సిస్‌లో చదువుకున్నారు. డిగ్రీ అయిన వెంటనే పెళ్లి చేసేసారు. పెళ్లయిన పదేండ్ల తర్వాత సంగీతం వైపు మొగ్గు చూపారు. అమ్మ వీణ వాయించేవారు. నాన్న పాటలు పాడేవారు. సంగీతం మా కుటుంబంలో ఉన్నప్పటికీ నాన్న ఎందుకో నా మీదనే దృష్టి పెట్టేవారు. సంగీతం విషయంలో నన్నెంతో ప్రోత్సహించేవారు.

మ్యూజిక్‌లో గోల్డ్‌మెడల్‌
సంగీతంలో మొదటి గురువు మా నాన్ననే. ఆ తర్వాత శ్రీరంగం గోపాల రత్నం వద్ద చేరాను. ఆమె దగ్గర సంగీతం నేర్చుకుంటూ డిప్లొమా పూర్తి చేశాను. ఆ తర్వాత సురవరం ప్రతాప్‌ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం(అప్పటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం) నుండి ఎం.ఎ మ్యూజిక్‌ చేసాను. అందులో గోల్డ్‌ మెడల్‌ సాధించాను. 2006లో అంటే నా పెండ్లి తర్వాత దాదాపు పదిహేనేండ్ల పాటు సంగీతానికి దూరంగా ఉండవలసి వచ్చింది. పిల్లలు, చదువు, కుటుంబ బాధ్యతలు.. వీటన్నిటి వల్ల సంగీతంపై దృష్టి పెట్టలేక పోయాను. పిల్లల చదువులు పూర్తయ్యి, ఉద్యోగాలు వచ్చి జీవితంలో సెటిల్‌ అయ్యేంతవరకు నా పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించాను. గత ఆరు సంవత్సరాలుగా మళ్లీ నాకెంతో ఇష్టమైన సంగీత ప్రపంచంలోకి వచ్చాను. అమెరికా, సింగపూర్‌, మలేషియా, వెళ్లి అక్కడ కూడా నా కచేరీలు ఇచ్చాను.

కుటుంబ బాధ్యతలతో…
డాక్టర్‌ ఎస్‌. కె.వెంకటాచారి దగ్గర మనోధర్మ సంగీతంపై పట్టు సాధించాను. చెన్నైలో ‘బృహధ్వని ‘అనే జాతీయ స్థాయి సంగీత కళాశాలలో గాత్ర శుద్ధి కోసం రెండేండ్ల కోర్సు చేశాను. అక్కడికి పెద్ద పెద్ద మహామహులంతా వచ్చేవారు. కేవీ నారాయణ చార్యులు, పినాకపాణి వంటి పెద్దల మార్గదర్శకంలో ఆ కోర్సులో చేరాను. కానీ కుటుంబ బాధ్యతల వల్ల పూర్తి చేయలేక పోయాను. ఆ తర్వాత దాదాపు ఆరేండ్ల పాటు ప్రముఖ సంగీత విధూషీమణి డీకే పట్టమాలు దగ్గర సంగీతం నేర్చుకున్నాను. ఆమె దగ్గర ముఖ్యంగా సాంప్రదాయ, శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకునే అవకాశం దక్కింది.

ఆదరణ అవసరం
ఆ తర్వాత హైదరాబాద్‌ బ్రదర్స్‌లో శేషాచారి వద్ద నాలుగేండ్లు సంగీతం నేర్చుకున్నాను. నేదునూరి కృష్ణ మూర్తి వద్ద కచేరీలు ఎలా చేయాలో సలహాలు, సూచనలు తీసుకున్నాను. 16 సంవత్సరాల కిందట పీహెచ్డీ చేశాను. అది కూడా నొటేషన్స్‌ ఇన్‌ కర్ణాటక మ్యూజిక్‌లో బంగారు పతకం సాధించారు. సంగీతాన్ని ఆదరించే రాష్ట్రాలలో ముందు వరసలో అంటే తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వస్తాయి. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలు వస్తాయి. సంగీతం అనేది మన మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. మనలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. పాటలు పాడుతూ, వింటూ ఎలాంటి ఒత్తిడినైనా జయించవచ్చు. అందుకే అన్ని కళల్లోకి ఇప్పటికీ సంగీతానికి అంతటి ప్రాధాన్యం ఉంది.

మన వాళ్లకు ప్రాధాన్యమివ్వాలి
ఇతర రాష్ట్రాల్లోని వారు ముందుగా వారి స్థానికులకు ప్రాధాన్యం ఇస్తారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లోని వారైతే ఇతర రాష్ట్రంలోని వాళ్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. స్థానికులను అంతగా పట్టించుకోరు. అదే కొంత బాధగా ఉంటుంది. మన వాళ్లను ప్రోత్సహించి అవకాశాలు ఇస్తే ఎంతో మంది మహిళలు ఈ రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇప్పటి వరకు దాదాపు మూడు వందలకు పైగా కచేరీలు చేశాను. ముందు తరాల వారికి మన సంస్కృతి, సాంప్రదాయాలను అందించాలని తపనపడుతున్నాను.

పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -