ఉధృతికి నీట మునిగిన ఇండ్లు
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
వరద నీటిలో ఎంజీబీఎస్.. బస్సుల రాకపోకలు నిలిపివేత ప్రయాణికుల తరలింపు
పరీవాహక ప్రాంత కాలనీలు జలమయం
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎఫ్
హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాల సరఫరా
ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు
నీట మునిగిన మంజీర ఫిల్టర్ బెడ్
పలుచోట్ల పంట పొలాలు మునక..దెబ్బతిన్న రోడ్లు
నవతెలంగాణ- అంబర్‌పేట/విలేకరులు
మూసీ నది హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిపోవటంతో మూసీ నదికి ఇరువైపు లా ఉన్న కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. ఎన్నడూ లేనివిధంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌ను వరద ముంచెత్త్తింది. దీంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వారిని హైడ్రా, ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది బయటకు తరలించారు. ముందు జాగ్రత్తగా మూసీ నదిపై ఉన్న లో లెవల్ వంతెనలు మూసేశారు. పురానాపూల్, చాదర్‌ఘాట్, మూసారంబాగ్ కాజ్‌వేలను మూసేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నదికి భారీ వరద పోటెత్తింది. దీంతో శుక్రవారం రాత్రి అధికారులు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లను ముందస్తు హెచ్చరిక చేయకుండానే ఎత్తేయడంతో దిగువన ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగిపోయింది. వెంటనే స్పందించిన హైడ్రా, ఎస్‌డీఆర్‌ఎస్ విభాగాలు.. మూసీ వెంట ఉన్న కాలనీల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారులు, పోలీసులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చాదర్‌ఘాట్ తదితర ప్రాంతాల వరద బాధితులకు హెలికాప్టర్, డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలు పంపిణీ చేశారు.
మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్
మూసీ పరివాహక ప్రాంతాల్లో నీరు చేరుతుందన్న సమాచారంతో రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ పోలీసు శాఖలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా చాదర్‌ఘాట్, శంకర్‌నగర్, గోల్నాక డివిజన్ పరిధిలోని కృష్ణానగర్, అంబేద్కర్ నగర్ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రదేశాలకు తరలించారు. పాఠశాల భవనాలు, కమ్యూనిటీ హాల్స్‌ను పునరావాస కేంద్రాలుగా మార్చి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. నది ఉధతి పెరగడంతో ముసారంబాగ్ బ్రిడ్జిని మూసేశారు. రాకపోకలను నిలిపేశారు. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.
తొలిసారిగా ఎంజీబీఎస్‌లోకి వరద నీరు
మూసీ వరద ఉధృతికి మహత్మాగాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లోకి పూర్తిగా నీరు చేరింది. వరద నీరు బస్టాండ్ ప్రాంగణంలోకి చేరడంతో, టీజీఎస్‌ఆర్టీసీ అధికారులు బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌కు వెళ్లే రెండు ప్రధాన బ్రిడ్జీలు నీట మునగడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.
జియాగూడ రూట్ బంద్
పురానాపూల్ ప్రాంతంలో మూసీ నీరు రోడ్లపైకి చేరింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నారు. జియాగూడ ప్రాంతంలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. అక్కడ రోడ్లపైకి నీరు రావడంతో పోలీసులు రూట్ బంద్ చేశారు. రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనదారులను అడ్డుకున్నారు. అధికారులు వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు పలు సూచనలు చేశారు. నది పరివాహక ప్రాంతాల్లో ఎవరూ ఉండవద్దని హెచ్చరించారు.
1908లో సెప్టెంబర్ 26న వరదలు
1908లో కూడా సెప్టెంబర్ 26వ తేదీనే మూసీ నదికి వరదలు వచ్చాయి. అప్పటి వరదలకు వేలాది మంది ప్రాణం కోల్పోగా, దాదాపు 20 వేల ఇండ్లు నేలమట్టమయ్యాయి. దీంతో హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను నిర్మించారు. మళ్లీ ఇప్పుడు సెప్టెంబర్ 26వ తేదీన్నే అంతటి వరద మూసీలో రావడంతో నాటి ఘటనలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. చిన్న వర్షానికే ఇలా ఉంటే రాను రానూ పెద్ద వర్షాలు పడితే ఇంకెంత వరదలు ముంచుకొస్తాయోనన్న ఆందోళన నెలకొంది.
జిల్లాల్లోనూ..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలకు వాగులు వంకలు, నదులు వరదలై పారుతున్నాయి. కృష్ణా నదికి ఉపనది అయిన దుందుభి నాగర్‌కర్నూల్ జిల్లాల గుండా ప్రవహిస్తోంది. ఈ నది ప్రవాహం వల్ల 40 రోజులుగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. రామగిరి రఘుపతి పేట, ఆవంచ, నెల్లికుదురు, మిడ్జిల్, బాలానగర్ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీశైలం రిజర్వాయర్‌లోకి 3 లక్షలా 32 వేలా 233 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జూరాల రిజర్వాయర్‌లోకి మూడు లక్షల నలభై వేల క్యూసెక్కుల నీరు రావడంతో 40 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
జలదిగ్బంధంలో ‘ఏడుపాయల’
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రెండ్రోజులుగా కురిసిన వర్షానికి ప్రజల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడగా, రైతులు పంటలు నష్టపోయారు. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరుకు వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టుకు 89,615 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తున్నది. సింగూరు ప్రాజెక్టు నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో వరద నీరు వచ్చిన దాఖలాలు లేవు. మొత్తం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల దేవాలయం 50రోజులకుపైగా జలదిగ్బంధంలోనే చిక్కుకున్నది. శనివారం సాయంత్రం వరద ఉధృతికి దుర్గామాత ఆలయ గర్భగుడి పైకప్పు నీటిలో కొట్టుకుపోయింది. సదాశివపేట మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో హైదరాబాద్‌కు తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన ఫిల్టర్ బెడ్ మునిగిపోయింది. రెండ్రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేశారు. నీట మునిగిన మంజీర ఫిల్టర్ బెడ్‌ను వాటర్ బోర్డు సీఎండీ అశోక్ రెడ్డి పరిశీలించారు. అదేవిధంగా కొండాపూర్ మండలంలోని తొగర్‌పల్లి గ్రామ చెరువు నిండి సుమారు 60 మంది వరకు నీటిలో చిక్కుకుపోయారు.
ఉమ్మడి రంగారెడ్డి
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గండిపేట, శేరిలింగంపల్లి, శంషాబాద్, కొత్తూరు, కొందుర్గు మండలాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొందుర్గు మండలపరిధిలోని తంగెళ్లపల్లి-విశ్వనాథ్‌పూర్ గ్రామ సరిహద్దులో ప్రవహిస్తున్న వాగులో వెంకిర్యాల్ గ్రామానికి చెందిన దస్తగిరి లింగం కొట్టుకుపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. శనివారం కిలోమీటర్ దూరాన ముళ్ళ కంపలో ఆయన మృతదేహం లభ్యమైంది. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. కాగ్నానది ఉప్పొంగింది. పలు గ్రామాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు తెగిపోయాయి. రాకపోకలు నిలిచాయి. పలు మండలాల్లో కంది, పత్తి, మొక్కజొన్న పంట పొలాలు నీట మునిగాయి. వరుస వర్షాలకు పంటల దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా 120 పశువులు మృత్యువాత పడ్డాయి.