Thursday, February 5, 2026
E-PAPER
Homeజాతీయంముస్లిం ఓటర్లే టార్గెట్‌

ముస్లిం ఓటర్లే టార్గెట్‌

- Advertisement -

వారిని చనిపోయినవారిగా పేర్కొంటూ దరఖాస్తులు
ఓటరు జాబితా నుంచి తొలగించే కుట్రలు
ఫారం-7ను దుర్వినియోగం చేసిన బీజేపీ కార్పొరేటర్‌!
సూరత్‌లో బాధితుల ఆందోళన
గుజరాత్‌లో సర్‌ ప్రక్రియపై అనేక అనుమానాలు

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లోని సూరత్‌ నగరంలోని సలాబత్‌పురా ప్రాంతంలో ఓటర్ల జాబితాలపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియలో భాగంగా బీజేపీ కార్పొరేటర్‌ విక్రమ్‌ పోపట్‌ పాటిల్‌.. ఫారం-7ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. బతికి ఉన్న ముస్లిం ఓటర్లను మరణించినట్టుగా ప్రకటించి వారి పేర్లను తొలగిస్తున్నారని బాధితులు చెప్తున్నారు. దీనిపై వందలాది మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సలాబత్‌పురా ప్రాంతానికి చెందిన వందలాది మంది నివాసితులు తమ పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించేందుకు ఫారం-7 దరఖాస్తులు పెట్టినట్టు బ్లాక్‌ లెవెల్‌ ఆఫీసర్‌ (బీఎల్‌ఓ) ద్వారా తెలుసుకున్నామని తెలిపారు. ఈ దరఖాస్తులన్నీ బీజేపీ కార్పొరేటర్‌ విక్రమ్‌ పోపట్‌ పాటిల్‌ పేరు, మొబైల్‌ నంబర్‌తో ఉన్నాయని వారు అంటున్నారు. ”మేము సర్‌ సమయంలో మా ఓటరు గుర్తింపు పత్రాలు చూపించాం. డ్రాఫ్ట్‌ జాబితాలో మా పేర్లు ఉన్నాయి.

అయినా తర్వాత మమ్మల్ని చనిపోయిన వారిగా చూపించి ఫారం-7 దరఖాస్తు పెట్టారు” అని 69 ఏండ్ల అబ్దుల్‌ రజాక్‌ వజీర్‌ షా తెలిపాడు. ఆయనతో పాటు ఆయన భార్య, కుమారుడి పేర్లకూ ఇదేవిధంగా దరఖాస్తులు పెట్టినట్టు చెప్పారు. కాగా ఫారం-7పై ఉన్న సంతకాలు 2021 సూరత్‌ మునిసిపల్‌ ఎన్నికల సమయంలో విక్రమ్‌ పాటిల్‌ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌ సంతకాలతో సరిపోలుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ అంశంపై స్పందన తెలియ జేయాల్సిందిగా విక్రమ్‌ను ఫోన్‌లో సంప్రదించగా.. ఆయన ఫోన్‌ కాల్‌ కట్‌ చేయటం గమనార్హం. ఈ విషయంపై బాధిత ఓటర్లు గతనెల 22న పెద్ద సంఖ్యలో సలాబత్‌పురా పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే పోలీసు అధికారుల నుంచి సరైన స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఎంత మంది ‘మరణించారు’?
సుమారు 118 మంది ఓటర్ల పేర్లపై ఫారం- 7 ద్వారా ‘మరణించినవారు’గా చూపించారు. అయితే ఈ సంఖ్య 228 వరకు ఉండొచ్చని మరో వార్త కథనం ద్వారా తెలుస్తున్నది. అయితే వీరంతా ముస్లింలేనని బాధితులు వాపోతున్నారు.

ఫారం-7 అంటే ఏమిటి?
ఫారం-7 అనేది ఓటర్ల జాబితాలో ఉన్న ఇతరుల పేర్లపై అభ్యంతరం తెలపడానికి లేదా స్వయంగా పేరు తొలగించుకోవడానికి ఉపయోగించే ముందస్తు దరఖాస్తు. ఇది రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ ఎలెక్టర్స్‌ రూల్స్‌, 1960లోని నియమాల ప్రకారం అమల్లో ఉంటుంది. తప్పుడు ప్రకటన చేస్తే ఏడాది వరకు జైలుశిక్ష లేదా జరిమాన విధించవచ్చు.

ఇది ‘ఎన్నికల మోసం’ : కాంగ్రెస్‌ పార్టీ
ఈ వ్యవహారంపై గుజరాత్‌ కాంగ్రెస్‌ స్పందించింది. దీనిని ‘ఎన్నికల మోసం’గా అభివర్ణించింది. గుజరాత్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి అస్లాం మాట్లాడుతూ… ”ఆధారాలు లేకుండా ఫారం-7లను ఆమోదించడం ప్రజాస్వామ్యంపై దాడి. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని వారి రాజ్యాంగ హక్కులు హరించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఆరోపించారు. గుజరాత్‌లో సర్‌ ప్రక్రియ గతేడాది నవంబర్‌ 4న ప్రారంభమైంది. డిసెంబర్‌ 19న విడుదలైన డ్రాఫ్ట్‌ జాబితాలో సుమారు 4.34 కోట్ల మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు.

సర్‌కు ముందు ఈ సంఖ్య 5.08 కోట్లుగా ఉన్నది. అంటే సుమారు 73.7 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. సూరత్‌, అహ్మదాబాద్‌, వడోదర వంటి నగరాల్లో తొలగింపుల శాతం ఎక్కువగా ఉన్నదని గణాంకాలు సూచిస్తున్నాయి. ఎన్నికల సంఘం సమాచారం ప్రకారం… అభ్యంతరాలు, క్లెయిమ్‌లను ఫిబ్రవరి 10 నాటికి పరిష్కరించి తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నది. అయితే సలాబత్‌పురా ఘటనల నేపథ్యంలో ఈ ప్రక్రియపై మరింత పారదర్శకత అవసరమని పౌర సమాజం కోరుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -