చలికాలంలో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన
నవతెలంగాణ – నెల్లికుదురు
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలు ప్రకారం.. బుధవారం నెల్లికుదురు మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను, తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ మరియు షెడ్యూల్డ్ కులాల హాస్టల్ లను మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన , పట్టు పరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్శనలో అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేసి, పాఠశాలలో అందిస్తున్న విద్యా, వసతి, భోజన సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో చదువులో ముందుకు సాగాలని ప్రోత్సహించారు. అలాగే మానసిక ఆరోగ్య, క్రీడలు, వ్యాయామం లాంటి తదితర అంశాలు పై కూడా విద్యార్థులకు నిత్య అవగాహన చేయాలని తెలిపారు, అధికారులు విద్యార్థులు మరియు సిబ్బందికి చలి కాలంలో వ్యాధులు ప్రబలకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
ముఖ్యంగా నీటి పరిశుభ్రత పాటించడం, పాఠశాలలో నీరు నిల్వ ఉండనివ్వకపోవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం, శుభ్రమైన ఆహారం తీసుకోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం వలన డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్, విరేచనాలు, టైఫాయిడ్ వంటి వ్యాధులు నివారించవచ్చని విద్యార్థులకు వివరించారు.అలాగే, జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనపడితే వెంటనే ప్రభుత్వ వైద్యశాలను సంప్రదించాలని, స్వీయచికిత్స చేయరాదని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చందా.నరేష్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.



