ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ సుజాత
నవతెలంగాణ – రామాయంపేట : బాలల హక్కులపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆఫీసర్ సుజాత అన్నారు. రామాయంపేట మండల కేంద్రంలో, బాలికల ఉన్నత పాఠశాలలో, బాలల హక్కుల పరిరక్షణపై గురువారం ఆమె అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె బాల్య వివాహాలు, బాలల అక్రమ రవాణా, బాలలపై లైంగిక దాడులు వంటి అంశాలపై, వారి రక్షణ కోసం రూపొందించిన చట్టాలపై ప్రజలకు వివరించారు. బాలలపై లైంగిక దాడులు, వేధింపులు జరిగినప్పుడు వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో 100 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. పిల్లలకు నిర్ణయం తీసుకునే హక్కు ఉందని ,ముఖ్యంగా బాల్య వివాహాల విషయంలో పిల్లలు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి తమ నిర్ణయాన్ని తెలియజేయవచ్చని ఆమె స్పష్టం చేశారు. పిల్లలపై లైంగిక దాడులు జరిగినప్పుడు భరోసా కేంద్రం అందించే సహాయాల గురించి ఆమె మాట్లాడుతూ.. ఇందులో ఎఫ్‌ఐఆర్ నమోదు, కౌన్సెలింగ్, మెడికల్ ఎగ్జామినేషన్, కోర్టు ప్రక్రియలో మద్దతు వంటివి ఉంటాయని వివరించారు.పిల్లలు ఫోన్‌లకు బానిసలవడం, సోషల్ మీడియా ద్వారా ఏర్పడే పరిచయాలు, దాని వల్ల జరిగే బాల్య వివాహాల గురించి కూడా ఆమె వివరించారు.
ఇలాంటి సమస్యలను గుర్తించినప్పుడు 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ లేదా షీ టీమ్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. షీ టీమ్ గురించి వివరిస్తూ, వారు పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందినవారని, యూనిఫామ్ లేకుండా సివిల్‌లో డ్యూటీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లాన్ ఇండియా కమిటీ సభ్యులు, షీ టీం సభ్యులు తోపాటు పలువురు పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES