రాష్ట్ర రెవెన్యూ విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్..సమ్మక్క బ్యారేజీ పరిశీలన
నవతెలంగాణ- ఏటూరునాగారం ఐటిడిఏ
వర్షాకాలం ముగిసే వరకు వరదలపై ప్రజలకు ఎప్పటికప్పుడూ సమాచారం అందిస్తూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ముందస్తు ప్రణాళికల్లో భాగంగా వరద ముంపు ప్రాంతాలను గుర్తించడం, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అన్నారు. గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సకాలంలో స్పందించకపోతే చిన్న సమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో ఎన్‌డీఆర్‌ఎఫ్, జిల్లా అగ్నిమాపక శాఖ బృందాలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడూ అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్దం చేసుకోవాలన్నారు. జిల్లా అధికారులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడూ తగు చర్యలు చేపట్టాలని సూచించారు. సీజన్ వ్యాధులు ప్రబలే నేపథ్యంలో ముఖ్యంగా తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ దామోదర్ సింగ్ మాట్లాడుతూ.. ముందస్తుగా వరద నివారణ ప్రణాళికలను గుర్తించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చన్నారు. అంతకు ముందు అరవింద్ కుమార్ కలెక్టర్ దివాకర టీఎస్, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, ఏఎస్పీ శివం ఉపాద్యాయతో కలిసి కన్నాయిగూడెం మండలంలోని సమ్మక్క బ్యారేజ్ నీటి నిల్వలు, గేట్ల వివరాలను పరిశీలిం చారు. ఎగువ ప్రాంతాల నుంచి నీరు ఎంత వరకు వస్తుంది.. ఏ మేరకు దిగువకు విడుదల చేస్తున్నారని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంతరావు, ఇరిగేషన్ అధికారి అప్పలనాయుడు, పంచాయతీరాజ్, అగ్నిమాపక, ఆర్‌డబ్ల్యూఎస్, అగ్రికల్చర్, సివిల్ సప్లరు, విద్యుత్, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు.
వరదల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES