టాలెంట్ ఉన్న విద్యార్థులకు చేయూత అందిస్తాం : హైకోర్టు లాయర్ గీత
నవతెలంగాణ – మిడ్జిల్
ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని, టాలెంటు ఉన్న పేద విద్యార్థులకు చేయూత అందిస్తామని హైకోర్టు లాయర్ గీతా జగన్నాథ్, లాయర్ బిల్ గేట్స్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల విద్యార్థిని, విద్యార్థులకు మంగళవారం విద్యపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అన్నిటికీ మూలం విద్యనేనని విద్య ద్వారానే గ్రామం దేశం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్క విద్యార్థి తనకున్న టాలెంట్ను పదవ తరగతి పరీక్షల్లో రాణించాలని సూచించారు.
ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో కూడిన విద్య నేర్చుకోవాలని, అధ్యాపకులు చెప్పే ప్రతి పాఠాన్ని ఏకాగ్రతతో వింటేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నది నిరుపేద విద్యార్థులేనని చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని నైపుణ్యత గుర్తించి వారికి అర్థమయ్యే రీతిలో విద్యను బోధించాలని చెప్పాలని కోరారు. పాఠశాలలో పదవ తరగతిలో మొదటి స్థానంలో వచ్చిన విద్యార్థులకు పారితోషకాన్ని అందజేస్తామని చెప్పారు.
అనంతరం మండల మండల కేంద్రానికి చెందిన బరిగల బిల్ గేట్స్ రెడ్డి లండన్ లో చదువుకొని మొదటిసారి ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి సరస్వతి హైకోర్టు లాయర్ ఉమాదేవి, గ్రామ పెద్దలు రుతమ్మ, రాజారత్నం, ప్రధానోపాధ్యాయులు కృష్ణ కుమార్, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీశైలం, నరసింహులు, కోటయ్య, జానకమ్మ, , అరుణ, రాజా లక్ష్మి, మేఘమాల, సౌందర్య ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.



