Monday, January 5, 2026
E-PAPER
Homeఆటలుముస్తాఫిజుర్‌పై వేటు!

ముస్తాఫిజుర్‌పై వేటు!

- Advertisement -

జట్టు నుంచి తప్పించిన నైట్‌రైడర్స్‌

కోల్‌కతా : బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల ప్రభావం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)పై పడింది. బంగ్లాదేశ్‌లో ఓ వైపు మైనారిటీలపై హింసాత్మక ఘటనలు కొనసాగుతున్న వేళ..బంగ్లా క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తీసుకోవటంపై ఇక్కడ ఆధ్యాత్మిక, రాజకీయ నాయకులు ఆ ప్రాంఛైజీ యజమాని షారుకపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) సూచనల మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యాజమాన్యం ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను తమ జట్టు నుంచి తప్పించింది. ‘ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ సూచనల మేరకు బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేస్తున్నాం. బోర్డును సంప్రదించి, సంబంధిత వర్గాలతో మాట్లాడిన తర్వాతే ముస్తాఫిజుర్‌ను విడుదల చేస్తున్నామని ‘నైట్‌రైడర్స్‌ యాజమాన్యం తెలిపింది.

ఇటు నైట్‌రైడర్స్‌, అటు బీసీసీఐ వర్గాలు అధికారికంగా కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది భారత జట్టు బంగ్లాదేశ్‌ పర్యటనలో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడుతుందని ఆ దేశ క్రికెట్‌ బోర్డు ప్రకటించిన మరుసటి రోజే భారత క్రికెట్‌లో ఈ పరిణామం చోటుచేసుకోవటం గమనార్హం. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ముంబయి ఇండియన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించి 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను రూ. 9.2 కోట్లకు కోల్‌కతా దక్కించుకుంది. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ స్థానంలో మరో ఆటగాడిని ఎంచుకునేందుకు నైట్‌రైడర్స్‌కు బీసీసీఐ అనుమతి ఇచ్చినట్టు సమాచారం. ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌లో ఆడనివ్వకుండా చేసిన ఘటనపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) స్పందించాల్సి ఉంది. ముస్తాఫిజుర్‌ రెహమాన్‌ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌ (బీపీఎల్‌)లో రాంగ్‌పూర్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -